భీష్ముడు చెప్పిన పావురాళ్ల కథ

 

 

మహాభారతం అనగానే చాలామందికి కౌరవ పాండవులకు మధ్య జరిగిన ఘర్షణో, కురుక్షేత్రంలో వినిపించిన భగవద్గీతో గుర్తుకువస్తాయి. కానీ మహాభారతంలోని ప్రతి పర్యంలోనూ అద్భుతమైన నీతిని అందించే కథలెన్నో ఉన్నాయి. ముఖ్యంగా కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన తరువాత శాంతిపర్వం అనే అధ్యాయంలో రాజనీతి, గృహస్థు ధర్మం, వ్యక్తిత్వం వంటి అనేక అంశాల మీద కథల కనిపిస్తాయి. అంపశయ్య మీద ఉన్న భీష్ముడు, ధర్మరాజుకి చేసిన ఈ ఉపదేశాలు ప్రతి ఒక్కరికీ ఉపయుక్తంగా ఉంటాయి. వాటి ఓ ముఖ్యమైన కథే వేటగాడు- పావురాళ్ల కథ!

 

ఒక బోయవాడు అడవిలోని పక్షుల మీద ఆధారపడి జీవిస్తుండేవాడు. నిత్యం అడవికి వెళ్తూ అక్కడ పక్షుల కోసం వల వేసేవాడు. తన వలలో చిక్కిన పక్షులు కొన్నింటినితో తన కడుపు నింపుకొని, మిగతావాటిని అమ్ముకుని నిబ్బరంగా రోజులను గడిపేసేవాడు. అలాంటి ఒక రోజున వేటగాడు ఎప్పటిలాగానే వల పన్నాడు. ఆ వలలో కావల్సినన్ని పక్షులు చిక్కుకున్నాయి. ఇక వాటిని తీసుకుని ఇంటికి బయల్దేరదామనుకునేలోగా తీవ్రమైన గాలివాన మొదలైంది. ఒక పక్క వర్షం, దానికి తోడు గజగజా వణికించేస్తున్న చలి. ఆ చలిలో తడిసిముద్దయిపోతూ వేటగాడు ఓ పెద్ద చెట్టు కింద నిలబడ్డాడు.

 

వేటగాడు నిలబడిన చెట్టు మీద ఒక పావురాల జంట నివసిస్తోంది. ఆ రోజు ఉదయం వేటకని బయల్దేరిన ఆడపావురం ఇంకా గూటికి చేరుకోనేలేదు. ఇంకా తిరిగిరాని తన భార్య గురించి గూటిలోని మగపావురం తపించిపోసాగింది. ‘ఇంత చీకట్లో, ఇంతింతగా ముంచుకొస్తున్న వర్షంలో, రక్తం గడ్డకట్టుకుపోయే చలిలో తన భార్య ఏ కష్టం పడుతోందో,’ అని మగపావురం తల్లడిల్లిపోతోంది. తన భార్య లేని జీవితం వృథా కదా అని వేదన పడుతోంది. ఇంతకీ ఆ ఆడపావురం ఎక్కడో లేదు! చెట్టు కింద నిలబడి ఉన్న వేటగాడి వలలో మిగతా పక్షులతో పాటు అది కూడా చిక్కుకొని ఉంది.

 

వేటగాడి వలలో ఉన్న ఆడపావురం భర్త వేదనను విన్నది. వెంటనే ‘నేను ఇక్కడే ఉన్నాను. నువ్వు నాకోసం పడుతున్న తపన చూసి నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఏం చేస్తాం. విధిరాతను తప్పించలేం కదా! కానీ ఇదిగో ఈ చెట్టు కింద ఉన్న వేటగాడు ప్రస్తుతం మన అతిథి. అతనికి ఏ లోటూ రాకుండా చూసుకోవడం మన బాధ్యత,’ అని మగపావురంతో పలికింది. భార్య మాటలు విన్న పావురం కిందకి చూసింది. అక్కడ నిజంగానే ఒక వేటగాడు గజగజా వణికిపోతూ కనిపించాడు. ‘‘అయ్యా! నా భార్య చెప్పిన మాట నిజమే! మీరు ఇవాళ మా అతిథి. మీకేం కావాలో సెలవియ్యండి,’’ అని అడిగింది.

 

పావురం మాటలకు వేటగాడు దీనంగా ‘‘నేను ఈ చలిబాధను తట్టుకోలేకపోతున్నాను. దయచేసి ఈ మాయదారి చలి నుంచి నా ప్రాణాలను కాపాడే ఉపాయం ఏదన్నా చూడు,’’ అంటూ వేడుకొన్నాడు. వెంటనే పావురం కొన్ని చితుకులు ఏరుకువచ్చి, వేటగాడి దగ్గర మంట వేసింది. ఆ మంటలో చలిని కాచుకున్న వేటగాడికి చలైతే తగ్గింది కానీ, ఆకలి మొదలైంది. వేటగాడి బాధను గ్రహించిన పావురం ‘‘అయ్యా! మీ మనుషుల్లాగా మా దగ్గర ఆహారం నిలువ ఉండదు కదా! పైగా మీకు ఎలాగూ పక్షులను తినే అలవాటు ఉంది. కాబట్టి నన్నే ఆహారంగా స్వీకరించండి,’’ అంటూ ఆ చలిమంటలోకి ఒక్కసారిగా దూకింది. పావురం చేసిన పనికి వేటగాడికి మతిపోయినంత పనయ్యింది. ఇన్నాళ్లూ తను చేస్తున్న పని ఎంత పాపమో కదా అనిపించింది. వెంటనే తన వలలో ఉన్న పక్షులన్నింటినీ వదిలివేశాడు. అందులోంచి బయటపడిన ఆడపావురం మాత్రం తన స్వేచ్ఛకు సంతోషించలేదు సరికదా... తన భర్త లేని జీవితం ఎందుకంటూ అదే మంటల్లో పడి మరణించింది. ఆ పావురపు జంట చూపిన ఔదార్యానికి వేటగాడు చలించిపోయాడు. విరాగిగా మారిపోయాడు.

 

ఇదీ కథ! ఇప్పుడు కాలం మారింది. కలిధర్మం ప్రవేశించింది. ఎదుటివాడి ఆకలిని తీర్చేందుకు ప్రాణాలను అర్పించడం సాధ్యం కాకపోవచ్చు. కానీ ఇంటి ముంగిట నిలిచిన అతిథి బాగోగులను గమనించుకుని తీరాలన్న శాశ్వత నీతిని మాత్రం కాదనలేం! శత్రువైనా సరే, బాధలో మన ముందుకి వచ్చినవాడికి మనకు తోచిన సాయం చేయాలన్న ధర్మాన్ని కొట్టపారేయలేం!

 

- నిర్జర.


More Purana Patralu - Mythological Stories