శివాజీకే గురువైనవాడు – సమర్థ రామదాసు

 

మన దేశవాసులకు శివాజీ పట్ల ఉన్న అభిమానం అంతాఇంతా కాదు! చాలామంది దృష్టిలో ఆయన హిందూ రాజ్యాన్ని స్థాపించిన వీరుడు. ఇక మరాఠాలకైతే చెప్పనే అవసరం లేదు. శివాజీని తమ పౌరుషానికి చిహ్నంగా భావిస్తుంటారు. శివాజీ అంతటివాడు కావడానికి కారణం లేకపోలేదు. రామాయణ, మహాభారతాలను నూరిపోసిన అతని తల్లి జిజాబాయి, యుద్ధవిద్యలలో ఆరితేర్చిన దాదాజీ కొండదేవ్‌... లాంటి వార్ల ప్రభావం శివాజీ మీద చాలానే ఉంది. ఇక ఆయనలోని ఆధ్మాత్మికతకు, పోరాటపటిమకు మధ్య సమతుల్యం సాధించేందుకు రామదాసు సూచనలు చాలా ఉపయోగపడ్డాయి.

సమర్థ రామదాసు అసలు పేరు ‘నారాయణ్‌ సూర్యాజీ’. వారి వంశస్థులంతా సూర్యుడినీ, రాముడినీ ఇష్టదైవాలుగా కొలుస్తారట. అందుకే ఆ ఇద్దరి పేర్లూ స్ఫురించేట్లుగా ఆ పేరు పెట్టారు. నారాయణ్‌ మహారాష్ట్రాలోని గోదావరి ఒడ్డున ఉన్న ఓ చిన్న గ్రామంలో 1606వ సంవత్సరం శ్రీరామనవమి రోజున జన్మించాడు. ఒకవైపు తరతరాలుగా వస్తున్న రామభక్తి, మరోవైపు తన తరంగాలతో రామాయణాన్ని గుర్తుచేస్తున్న గోదావరి తల్లి... నారాయణుడిలో రామభక్తిని పరాకాష్టకు తీసుకువెళ్లాయి.

రామదాసు చిన్నప్పటి నుంచి ఇహ సంసారం పట్ల విముఖంగా ఉండేవాడు. బాల్యంలోనే తండ్రి చనిపోవడంతో, ఆ వైరాగ్యం మరింతగా హెచ్చింది. రామదాసు విరక్తిని గమనించిన రాముడు తానే స్వయంగా ప్రత్యక్షం అయ్యాడట. ‘శ్రీ రామ జయ రామ జయజయ రామ’ అనే 13 అక్షరాల తారకమంత్రాన్ని రోజుకి 108 సార్లు జపిస్తూ ఉండమని సూచించాడట. ఆ తారకమంత్రాన్ని జపిస్తున్న కొద్దీ, సంసారం పట్ల ఉన్న మాయ అంతా పటాపంచలు కాసాగింది.

రామభక్తిలో మునిగిపోయిన నారాయణుడు సన్యాసాన్ని స్వీకరించి సమర్థరామదాసుగా మారాడు. రాముడు వనవాసం చేసిన నాసిక్‌కు చేరుకుని సుదీర్ఘకాలం తపస్సు చేశాడు. ఆ తర్వాత దేశాటనకు బయల్దేరాడు. దేశాటనలో రామదాసు అనేక అనుభవాలను ఎదుర్కొన్నాడు. ఆ అనుభవాలన్నింటినీ కూడా రెండు పుస్తకాలుగా రాశాడని అంటారు. అదే కనుక నిజమైతే, తన కాలపు ప్రజలు జీవితాన్ని అక్షరబద్ధం చేసిన మొదటి సన్యాసి ఆయనే కావచ్చు.

తన చుట్టూ ఉన్న పరిస్థితులు రామదాసుని తీవ్రంగా ఆలోచింపచేశాయి. ఆ సమయంలో దేశం అంతా అతలాకుతలంగా ఉంది, స్థానిక రాజులు తమలో తాము కొట్టుకు చస్తున్నారు, ప్రజలు నానాకష్టాలూ ఎదుర్కొంటున్నారు. ప్రజల బాధలు తీరాలంటే ఒక సమర్థమైన నాయకత్వం ఉండాలన్న నిశ్చయానికి వచ్చారు రామదాసు. ఆయన హనుమంతునికి వీరభక్తుడు. ఆ ఆంజనేయునిలాగానే అందరికీ తగిన దేహధారుఢ్యం ఉండాలనీ, ఆపదలలో ఉన్న సాటివారిని ఆదుకోవాలని ఆశించేవారు. అందుకు తగినట్లుగానే ఆధ్మాత్మికతో పాటుగా... ఆరోగ్యం గురించీ, పోరాటపటిమ గురించి కూడా ప్రజలకు బోధించసాగారు. ఆ బోధలు శివాజీ మహారాజుని ఎంతగానో ప్రభావితం చేశాయని చెబుతారు.

శివాజీతో పాటుగా ఆయన కుమారుడు శంభాజీకి కూడా రామదాసు అంటే చాలా గౌరవం ఉండేది. శివాజీ చనిపోయి రాజ్యపు మనుగడ ప్రశ్నార్థకంగా మారినప్పుడు... శంభాజీకి రామదాసే దిశానిర్దేశం చేశారట. ఇక ఎప్పుడైతే తనకు వయసు మీదపడుతోందని రామదాసు గ్రహించారో, తన తనువుని చాలించేందుకు నిశ్చయించుకున్నారు. మహారాష్ట్రలోని సజ్జన్‌గఢ్‌ అనే ప్రాంతంలో రోజుల తరబడి ఉపవాసం చేస్తూ, మనసున ఆ రాముని జపిస్తూ 1681లో తన రామునిలో ఐక్యమైపోయారు. ఆయన మరణించిన చోట, శంభాజీ మహారాజే ఒక సమాధిని నిర్మించారు.

రామదాసు బోధ చేయడమే కాదు, అసంఖ్యాకమైన పుస్తకాలు కూడా రాశారు. ఆయన రాసిన దాసబోధ అనే పుస్తకం ఆధ్మాత్మిక రంగంలోకి ప్రవేశించాలనుకునే ప్రతి ఒక్కరికీ ఒక దిశను అందిస్తుంది. దాసబోధతో పాటుగా రామాయణానికి మరాఠీ అనువాదాన్ని కూడా అందించారు. ఇక ఆత్మారామ్‌, పంచమన్‌, సగుధ్యాయన్, సప్తసమయం లాంటి పుస్తకాలు సరేసరి! వీటితో పాటుగా అనేక దేవీదేవతల ఆరతులు కూడా రాశారు.

సమర్థరామదాసు తన తత్వాన్ని ప్రచారం చేస్తూ దేశమంతా పర్యటించారు. ఆ సమయంలో వందలాది ఆంజనేయుని ఆలయాలను ప్రతిష్టించారు. ఆయనకు కులమత బేధాలు ఉండేవి కావు, స్త్రీలను కూడా తన శిష్యురాళ్లుగా స్వీకరించేవారు. రామదాసు ఇంత విశిష్టమైన వ్యక్తి కాబట్టే... ఆయననే పరమగురువుగా అంగీకరించేవారు మహారాష్ట్రలో కోకొల్లలుగా కనిపిస్తారు.

- నిర్జర.


More Purana Patralu - Mythological Stories