అమ్మవారిని స్వర్ణకవచాలంకారంలో చూస్తే ఏం జరుగుతుందో తెలుసా!
 

 

దసరా సందర్భంగా అమ్మవారిని వేర్వేరు అలంకారాలలో కొలుచుకుంటాము. తల్లి ఎలాగైతే బిడ్డ పరిస్థితిని బట్టి వేర్వేరు బాధ్యతలు చేపడుతుందో... అమ్మలగన్న అమ్మ, ఆ దుర్గమ్మ కూడా భక్తుల అవసరాలను బట్టి వేర్వేరు రూపాలతో సాక్షాత్కరిస్తుంది. ఒకో ప్రాంతంలోని ఆచారాలను బట్టి అక్కడ అమ్మవారి అలంకారాలు ఒకోతీరుగా ఉంటాయి. తెలుగు రాష్ట్రాలలో అమ్మవారు అంటే విజయవాడ కనకదుర్గమ్మే! ఇక్కడి దేవతని మొదటి రోజు ‘స్వర్ణ కవచాలంకృత దేవి’గా అలంకరిస్తారు.

 

పూర్వం విజయవాడని విజయవాటిక అని పిలిచేవారు. అర్జునుడు ఇక్కడ శివుని కోసం ఘోరమైన తపస్సు చేశాడు. అర్జునుడి తపస్సుకి మెచ్చిన శివుడు తన పాశుపతాస్త్రాన్ని ఇచ్చాడు. అందుకనే ఈ ప్రాంతానికి విజయవాటిక అన్న పేరు వచ్చింది.

 

ఒకప్పుడు ఈ విజయవాటికను మాధవవర్మ అనే రాజు పాలించేవాడు. అతను గొప్ప దేవీ భక్తుడు. మాధవవర్మ పాలనలో రాజ్యంలో ప్రజలు చాలా సంతోషంగా ఉండేవారు. ధర్మం నాలుగు పాదాలా నడిచేది. అలాంటి సమయంలో ఒక దుర్ఘటన జరిగింది. మాధవవర్మ కుమారుడు ఒకసారి రథం మీద తిరుగుతుందగా, ఆ రథం కింద పడి ఓ బాలుడు చనిపోయాడు. పొరపాటున జరిగినా కూడా అమాయకుడైన ఓ పిల్లవాడి ప్రాణాలను బలిగొన్నందుకు రాజుగారు విచారించారు. తన కొడుకని కూడా చూడకుండా మరణశిక్ష విధించారు.

 

మాధవవర్మ నిజాయితీకి అమ్మవారు చాలా సంతోషించారు. ఆ రాజ్యం అంతా బంగారు వర్షాన్ని కురిపించారు. అప్పటి నుంచి అమ్మవారిని కనకదుర్గగా పిలుస్తున్నారు. ఆవిడ అనుగ్రహంతో ఏ ఇంట్లో అయినా సిరుల వర్షం కురుస్తుందని నమ్ముతున్నారు. దసరా మొదటి రోజున అమ్మవారిని బంగారపు ఆభరణాలతో అలంకరించి... ఆమెను స్వర్ణ కవచాలంకృతగా పూజిస్తున్నారు. ఈ అలంకారంలో ఉన్న అమ్మవారిని చూసినా, పూజించినా... ఇంట్లో ఉన్న దారిద్ర్యమంతా తీరిపోతుందట.


More Dasara - Navaratrulu