వృత్రాసురుని కథ!

 

 


కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యాలు ఎంతటి మనిషినైనా దిగజారుస్తాయి. ఆ బలహీనతలకు అంతే ఉండదు. వాటికి అధికారం దక్కితే విచక్షణ ఉండదు. తమకి మరణమనేదే ఉండకూడదనీ, ఎన్ని యుగాలైనా తమ కోరికలు నెరవేరుతూనే ఉండాలని ఆ అరషడ్వర్గాలు కోరుకుంటాయి. ఆ అరిషడ్వర్గాలకు ప్రతీకలైన రాక్షసులూ అంతే! తమకి ఎన్నటికీ చావు ఉండకూడనీ, ముల్లోకాలూ తమ ఆధీనంలోనే ఉండాలనీ వారు కోరుకుంటారు. ఆ కోరికతో భగవంతుని ప్రసన్నం చేసుకొని... ‘నాకు దాని చేతిలో చావు ఉండకూడదు, దీని చేతిలో చావు ఉండకూడదు’ అంటూ షరతులు పెడతారు. కానీ చివరికి వారు ఏ షరతునైతే మర్చిపోతారో... అదే వారి పాలిట శాపంగా మారుతుంది. వృత్రాసురుని కథ కూడా ఇలాంటిదే!

 

పూర్వం విశ్వరూపుడనే మహర్షి ఉండేవాడు. ఆ విశ్వరూపుడు తపోయజ్ఞాలతో నానాటికీ బలపడసాగాడు. ఆయనలో రాక్షసుల అంశ ఉండటంతో... ఏనాటికైనా తనను జయిస్తాడేమో అన్న అనుమానం ఇంద్రునిలో మొదలైంది. దాంతో విశ్వరూపుని హతమార్చి పారేశాడు. విశ్వరూపుని మరణవార్త అతని తండ్రి త్వష్ట ప్రజాపతికి చేరింది. తన కుమారుడి మరణవార్తతో త్వష్ట ప్రజాపతి రగిలిపోయాడు. అందుకు కారణమైన ఇంద్రుని మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలనుకున్నాడు.

 

ఇంద్రుని హతమార్చేందుకు త్వష్ట ప్రజాపతి ఓ గొప్ప హోమాన్ని చేయసాగాడు. ఆ అగ్నిగుండంలోంచి వృత్రాసురుడనే రాక్షసుడు వెలువడ్డాడు. అసలే అమిత బలవంతుడు. ఆపై ఓ చిత్రమైన వరం కూడా వృత్రాసురునికి ఉండేది. పగలు కానీ రాత్రి కానీ, లోహంతో కానీ రాతితో కానీ చెక్కతో కానీ, ఇప్పటివరకూ ఉన్న ఆయుధాలతో కానీ, తడి వస్తువుతో కానీ పొడి వస్తువుతో కానీ... తనకు మరణం సంభవించకూడదన్నదే ఆయనకి ఉన్న వరం.

 

కష్టసాధ్యమైన వరాన్ని పొందిన వృత్రాసురునికి ఇక అంతులేకుండా పోయింది. ముల్లోకాల మీదా దాడి చేసి ప్రజలందరినీ పీడించసాగాడు. వృత్రాసురుని జయించే ఉపాయం తోచక దేవతలంతా, విష్ణువు చెంతకి చేరారు. వృత్రాసురుని సంహరించేందుకు ఓ సరికొత్త ఆయుధం కావాలి. అది చెక్కతోనూ, లోహంతోనూ, రాతితోనూ చేయబడి ఉండకూడదు. కాబట్టి దధీచి అనే రుషి వెన్నెముకతో ఒక ఆయుధాన్ని రూపొందించుకోమంటూ విష్ణుమూర్తి వారికి సూచించాడు.

 

దేవతల కోరికను విన్న దధీచి సంతోషంగా వారికి తన శరీరాన్ని అర్పించాడు. అలా ఆయన వెన్నెముకతో రూపొందించినదే ‘వజ్రాయుధం’. ఆ వజ్రాయుధాన్ని చేపట్టి వృత్రాసురుని వధించేందుకు తగిన సమయం కోసం ఇంద్రుడు ఎదురుచూడసాగాడు. ఒకసారి వృత్రాసురుడు సముద్రతీరాన ఇంద్రుని కంటపడ్డాడు. అది పగలూ, రాత్రీ కాని సూర్యాస్తమ సమయం. తన చేతిలో వజ్రాయుధం ఉంది. దానికి సమద్రపు అలల మీద ఉన్న నురగను తాటించాడు ఇంద్రడు. దాంతో అది అటు తడీపొడీ కానీ ఆయుధంగా మారింది. ఆ వజ్రాయుధంతో వృత్రాసురుని వధించాడు ఇంద్రడు.

 

వృత్రాసురుని కథ కాస్త అటూఇటుగా రుగ్వేదంలోనూ, భాగవతంలోనూ, భారతంలోనూ కనిపిస్తుంది. రాక్షస ప్రవృత్తి ఎంతటివారికైనా పతనాన్ని కలిగిస్తుందనే నీతిని అందిస్తుంటుంది.

  - నిర్జర.

 


More Purana Patralu - Mythological Stories