శ్రావణ శుక్రవారాలు... ఎందుకంత ప్రత్యేకం!

 

 

శ్రావణ మాసం వచ్చిందంటే చాలు.. హైందవుల ఇంటింటా ఒక పండుగ వాతావరణం నెలకొంటుంది. పూజలూ, నోములతో... ప్రతి ముత్తయిదువా హడావుడి పడిపోతుంది. అందులోనూ శ్రావణ శుక్రవారాల సంగతి ఇక చెప్పనే అక్కర్లేదు. ఇంతకీ శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారానికి ఎందుకంత ప్రాధాన్యతా అంటే...

 

- అసలు శుక్రవారం అంటేనే ప్రేమ, దాంపత్యము, అందం... వంటివాటిని చిహ్నము. ఎందుకంటే ఈ వారానికి అధిపతి అయిన శుక్రుడు ఆయా లక్షణాలను ప్రభావితం చేస్తాడని నమ్మకం. పైగా లక్ష్మీదేవికి సైతం శుక్రవారం ప్రీతికరం. కాబట్టి శుక్రవారం నాడు అమ్మవారిని కొలుచుకుంటే అటు అమ్మవారి అనుగ్రహం, గ్రహాల అనుకూలతా సిద్ధిస్తాయి.

 

- శ్రీమ‌హావిష్ణువు జ‌న్మ‌న‌క్ష‌త్రం శ్రవణము. చంద్రుడు ఈ నక్షత్రాన సంచరించే మాసం శ్రావణమాసం. విష్ణుమూర్తి, మహాలక్ష్మి ఎంత అన్యోన్యంగా ఉంటారో... ఈ మాసాన అమ్మవారిని కొలుచుకునేవారి దాంపత్యం అంతే అన్యోన్యంగా సాగుతుందని భక్తుల నమ్మకం.

 

- సంపదకి అధిపతి అయిన లక్ష్మీదేవికి చంచలమైనది అని ఒక గుణాన్ని ఆపాదిస్తారు. ఈ మాటలో నిజం లేకపోలేదు. సంపద చేతిలో ఉందికదా అని చులకనగా, అజాగ్రత్తగా ఉంటే... అది ఏదో ఒక రోజున చేజారిపోక తప్పదు. అందుకని సంపద, సౌభాగ్యాల పట్ల ఎరుకనీ... వాటిని తమకు అందించిన దైవం పట్ల కృతజ్ఞతనీ ప్రకటించే రోజులు శ్రావణమాసపు తిథులు.

 

- శ్రావణమాసం అమ్మవారికి ఇష్టమైన నెల కాబట్టి, ఈ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ పూజను చేసుకుంటారు. అమ్మవారిని వరాలిచ్చే తల్లిగా భావించి కొలుచుకుంటారు కాబట్టి.... ఆమెను వరలక్ష్మి రూపంలో పూజించుకుంటారు. ఆ రోజున ఏదన్నా ఇబ్బంది వస్తుందనుకునే వారు మొదటి శుక్రవారం నాడే వరలక్ష్మీ వ్రతాన్ని జరుపుకొంటారు. ఈ వ్రతవిధానాన్ని సాక్షాత్తూ ఆ పరమేశ్వరుడే, పార్వతీదేవికి అందించాడని పురాణాలు పేర్కొంటున్నాయి.

 

- శ్రావణ మాసంలో మగవారంతా పొలంపనులలో తీరిక లేకుండా ఉంటారు. ఆ సమయంలో ఆడవారికి తమకు ఇష్టమైన నోములు, పూజలు చేసుకునేందుకు కావలసిన సావకాశం చిక్కుతుంది. పురుష ప్రధానంగా సాగే హైందవ క్రతువులలో, ఆడవారు పూజలు చేసుకునే అవకాశం బహుశా శ్రావణంలోనే ఎక్కువగా చిక్కుతుందేమో!

 

- ఈ మాసంలో పసుపు రాసుకోవడం; పెసరపప్పుని తినడం; పూలు, పత్రితో పూజించడం; పండ్లను, శనగలను పంచిపెట్టడం... వంటి ఆచారాలన్నీ వర్ష రుతువులో వచ్చే రకరకాల అనారోగ్యాలకు విరుగుడుగా పనిచేసేవే!

 

- పూజలు, వ్రతాలు, పేరంటారు, వాయనాలు... వీటన్నింటి వల్లా సామాజిక బంధాలు మెరుగుపడతాయనడంలో సందేహం ఏముంది.

 

మరి ఇన్ని విశేషాలు ఉన్న శ్రావణ శుక్రవారాలు నిజంగా విశిష్టమైనవే కదా!

 

- నిర్జర.

 


More Sravana Masam - Varalakshmi Vratam