సింహాచలం అప్పన్నకు చందనం ఎందుకు?

 

 

విష్ణుమూర్తి అవతారమైన నరసింహస్వామికి చాలాచోట్ల ఆలయాలు ఉన్నాయి. కానీ ఎక్కడా లేని విధంగా సింహాచలంలోని వరాహనరసింహస్వామికి చందనపు పూత కనిపిస్తుంది. అందుకు కారణం లేకపోలేదు! సింహాచల క్షేత్రంలో ఒకటి కాదు, రెండు విష్ణుమూర్తి అవతారాలు కొలువై ఉన్నాయి. అటు హిరణ్యాక్షుని సంహరించిన వరాహావతారం, ఇటు హిరణ్యకశిపుని అంతమొందించిన నరసింహావతారం కలిసి ఇక్కడ వరాహనరసింహ అవతారంగా వెలిశారు. వరాహ మొఖం, మానవుని శరీరం, సింహపు తోకతో ఇక్కడి మూలవిరాట్టు కనిపిస్తుంది. అసలు నరసింహ అవతారం అంటేనే ఉగ్రమూర్తి, దానికి తోడు మరో ఉగ్రరూపమైన వరాహమూర్తి కూడా కలిస్తే ఇంక చెప్పేదేముంది. అందుకే స్వామివారి మీద నిత్యమూ చందనపు పూతని పూస్తారు. ఒక్క అక్షయ తృతీయ సందర్భంగా మాత్రమే స్వామివారి మీద ఉన్న చందనాన్ని తొలగించి నిజరూప భాగ్యాన్ని కలిగిస్తారు.

 

పురూరవుడనే రాజు అక్షయతృతీయ రోజున స్వామివారి నిజరూపాన్ని దర్శించాడు కాబట్టి... ఆనాటి నుంచి ప్రతి అక్షయ తృతీయకూ చందనోత్సవం జరుపుతున్నారన్నది స్థలపురాణం. దీని వెనుక మరో శాస్త్రీయ కారణం కూడా కనిపిస్తుంది. అక్షయ తృతీయ కృత్తిక లేదా రోహిణి నక్షత్రం ఉన్న రోజునే వస్తుంటుంది. ఈ రెండు నక్షత్రాలూ కూడా అగ్ని సంబంధమైనవే. అందుకనే ఈ రోజు నుంచే ఎండలు మరింత తీవ్రతరం కావడాన్ని గమనించవచ్చు. అసలే తీక్షణంగా ఉండే స్వామివారికి ఈ వేడిమి కూడా తోడైతే ఇక చెప్పేదేముంది. అందుకే స్వామివారికి కాస్త ఉపచారాన్ని కలిగించేందుకు చల్లటి తాజా చందనాన్ని లేపనం చేస్తారు. ముందుగా సహస్ర ఘటాలతో స్వామివారిని అభిషేకించి వారిని శాంతింపచేస్తారు. ఆపై మూడు మణుగుల చందనాన్ని పూస్తారు. ఈ చందనంతోనే స్వామివారు సంవత్సరం పొడవునా దర్శనమిస్తారు.

- నిర్జర.


 


More Akshaya Tritiya