శ్రీ సాయిసచ్చరిత్రము యాభైవ అధ్యాయము - 2 వ భాగము

వారితో బాబాది అరవై తరాల బంధం

 

టెంబెస్వామి
పూర్వము టెంబె స్వామిగా ప్రసిద్ధి చెందిన శ్రీవాసుదేవానంద సరస్వతి స్వామి  రాజమండ్రిలో మకాం చేసిరి. ఆయన గొప్ప నైష్ఠికుడు, పూర్వాచారపరాయణుడు, జ్ఞాని, దత్తాత్రేయుని యోగిభక్తుడు. నాందేడుకు చెందిన ప్లీడరు పుండలీకరావు స్వామిని చూసేందుకు తన మిత్రులతో కలిసి అక్కడికి వెళ్లెను.  స్వామితో వారు మాట్లాడుతున్నప్పుడు సాయిబాబా పేరు షిరిడీ పేరు వచ్చింది. బాబా పేరు వినగానే  ఆ స్వామి చేతులు జోడించి, ఒక టెంకాయను తీసి పుండలీకరావు కిచ్చి  "దీనిని నా సోదరుడగు సాయికి నా ప్రణామములతో అర్పింపుము, నన్ను మరువ వద్దని వేడుము. నాయందు ప్రేమ చూపు మనుము." అని పలికెను.  పుండలీకరావు ఆ టెంకాయను, సమాచారమును షిరిడీకి తీసుకొని వెళ్లేందుకు అంగీకరించెను.  బాబాను స్వామి సోదరుడనుట సమంజసమే. ఎందుకనగా,  బాబావలె  స్వామియును రాత్రింబవళ్ళు అగ్నిహోత్రమును వెల్గించియే యుంచిరి. 

నెల పిమ్మట పుండలీకరావు, మిత్రులతో కలిసి టెంకాయ తీసుకొని షిరిడీకి బయలుదేరిరి . మన్మాడు చేరుకున్నారు. పరిగడుపున నీళ్ళు తాగకూడదని కారపు అటుకులు ఉపాహారము చేసిరి. అవి కారముగా ఉండటంతో టెంకాయ పగులగొట్టి దాని కోరును అందులో కలిపి అటుకులు రుచికరంగా చేసుకొని ఆరగించిరి. దురదృష్టము కొద్ది ఆ పగులకొట్టిన టెంకాయ టెంబె స్వామి ఇచ్చినది. షిరిడీ చేరుకున్నాక పుండలీకరావుకీ ఆ విషయము జ్ఞప్తికి వచ్చెను. అతడు ఎంతగానో విచారించెను. భయముతో వణకుతూ సాయిబాబా వద్దకు చేరుకొనెను. అప్పటికే సర్వజ్ఞుడైన బాబా విషయం అంతా గ్రహించెను. బాబా వెంటనే తన సోదరుడగు టెంబెస్వామి పంపించిన టెంకాయను తెమ్మనెను. పుండలీకరావు బాబా పాదములు  పట్టుకొని, తన తప్పును అలక్ష్యమును వెలిబుచ్చుచు, పశ్చాత్తాపపడుచు, బాబాను క్షమాపణ వేడుకొనెను. దానికి బదులు ఇంకొక టెంకాయ సమర్పించెదననెను. కానీ బాబా అందుకు సమ్మతించలేదు. ఆ టెంకాయ విలువ సాధారణ టెంకాయ కన్నా ఎన్నో రెట్లని దాని విలువకు సరిపోయేది ఇంకొకటి లేదని చెప్పి నిరాకరించెను. ఇంకా  "ఆ విషయమై నీవేమాత్రము చింతింపనవసరము లేదు. అది నా సంకల్పము ప్రకారము నీ కివ్వబడెను. తుదకు దారిలో పగులగొట్టబడెను. దానికి నీవే కర్తవని అనుకొనుట ఏల? మంచి గాని చెడ్డగాని చేయుటకు నీవు కర్తవని అనుకొనరాదు. గర్వాహంకారరహితుడవయి ఉండుము. అప్పుడే నీ పరచింతన అభివృద్ధి పొందును." అని బాబా అతనితో పలికెను. ఎంత చక్కని వేదాంతవిషయము బాబా బోధించెనో చూడుడు!

 


 
 

బాలారామ్ ధురంధర్ (1878 - 1925)

 
బొంబాయికి దగ్గరనున్న శాంతాక్రజ్‌లో పఠారెప్రభుజాతికి చెందిన బాలారామ్ ధురంధర్ ఉండెడి వారు.  వారు బొంబాయి హైకోర్టులో న్యాయవాది. కొన్నాళ్ళు బొంబాయి న్యాయశాస్త్ర కళాశాలకు ప్రిన్సిపాలుగా నుండెను. ధురంధర్ కుటుంబములోని వారందరు భక్తులు, పవిత్రులు, భగవత్చింతన గలవారు. బాలారామ్ తన జాతికి సేవ చేసెను. ఆ విషయమై ఒక గ్రంథము వ్రాసెను. అటుపిమ్మట తన దృష్టిని మతము ఆధ్యాత్మిక విషయములవైపు మరలించెను. గీతను, జ్ఞానేశ్వరిని, వేదాంత గ్రంథములను, బ్రహ్మవిద్య మొదలగువానిని చదివెను. అతడు పండరీపురవిఠోబా భక్తుడు. అతనికి 1912లో సాయిబాబాతో పరిచయము కలిగెను. 6 నెలలకు పూర్వము తన సోదరులగు బాబుల్జీ, వామనరావు షిరిడీకి పోయి బాబా దర్శనము చేసిరి. ఇంటికి వచ్చి వారి అనుభవములను బాలారామ్ కు, ఇతరులకు చెప్పిరి. అందరూ బాబాను చూడలని నిశ్చయించుకున్నారు. వారు షిరిడీకి రాక ముందే బాబా  "ఈ రోజున నా దర్బారు జనులు వచ్చుచున్నారు." అని చెప్పెను.
తమ రాకను బాబాకు తెలియజేయనప్పటికి బాబా పలికిన పలుకులు ఇతరుల వలన విని, ధురంధరసోదరులు విస్మయమొందిరి. తక్కినవారందరు బాబాకు సాష్ఠాంగనమస్కారము చేసి వారితో మాట్లాడుతూ కూర్చొని యుండిరి. బాబా వారితో నిట్లనెను. "వీరే నా దర్బారు జనులు. ఇంతకు ముందు వీరి రాకయే మీకు చెప్పియుంటిని." బాబా ధురంధర సోదరులతో నిట్లనెను "గత 60 తరముల నుండి మన మొండొరులము పరిచయము గలవారము".
 
 
సోదరులందరు వినయవిధేయతలు గలవారు. వారు చేతులు జోడించుకొని నిలచి, బాబాపాదముల వైపు దృష్టినిగడించిరి. సాత్వికభావములు అనగా కండ్ల నీరు కారుట, రోమాంచము, వెక్కుట, గొంతుక యార్చుకొని పోవుట, మొదలగునవి వారి మనస్సులను కరగించెను. వారంద రానందించిరి. భోజనానంతరము కొంత విశ్రమించి తిరిగి మసీదుకు వచ్చిరి. బాలారామ్ బాబాకు దగ్గరగా కూర్చొని బాబా పాదము లొత్తుచుండెను. బాబా చిలుము త్రాగుచు దానిని బాలారామున కిచ్చి పీల్చుమనెను. బాలారాము చిలుము పీల్చుట అలవాటులేదు. అయినప్పటికి దానిని అందుకొని కష్టముతో పీల్చెను. దానిని తిరిగి నమస్కారములతో బాబా కందజేసెను. ఇదియే బాలారామునకు శుభసమయము. అతడు 6 సంవత్సరములనుండి ఉబ్బసము వ్యాధితో బాధపడుచుండెను. ఈ పొగ అతని వ్యాధిని పూర్తిగ నయము చేసెను. అది అతనిని తిరిగి బాధపెట్టలేదు. 6 సంవత్సరముల పిమ్మట నొకనాడు ఉబ్బసము మరల వచ్చెను. అదేరోజు అదే సమయమందు బాబా మహాసమాధి చెందెను. 

 
వారు షిరిడీకి వచ్చినది గురువారము. ఆ రాత్రి బాబా చావడియుత్సవమును జూచుభాగ్యము ధురంధరసోదరులకు కలిగెను. చావడిలో హారతి సమయమందు బాలారాము బాబా ముఖమందు పాండురంగని తేజస్సును ఆ మరుసటి ఉదయము కాకడ హారతి సమయమందు తేజో కాంతిని పాండురంగవిఠలుని ప్రకాశమును బాబా ముఖమునందు గనెను. 

బాలారామ్ ధురంధర్ మరాఠీ భాషలో తుకారామ్ జీవితమును వ్రాసెను. అది ప్రచురింపబడక మునుపే అతడు చనిపోయెను. 1928లో అతని సోదరులు దానిని ప్రచురించిరి. అందు బాలారాము జీవితము ప్రప్రథమమున వ్రాయబడెను. అందు వారు షిరిడీకి వచ్చిన విషయము చెప్పబడియున్నది. 

యాభైయవ అధ్యాయము సంపూర్ణము.


More Saibaba