స్త్రీకి రక్షణ కాదు... స్త్రీయే సర్వ రక్ష!

రక్షా బంధనం... ఈ పేరు వినగానే ఇప్పుడు జనం అదేదో కేవలం అన్నా - చెల్లెళ్లు, అక్కా-తమ్ముళ్ల మధ్య వ్యవహారం అనుకుంటున్నారు. కాని, మన పురాణాల్లో ఏ స్త్రీ అయినా పురుషుడికి కట్టే రక్షా తోరాన్ని... రక్షా బంధనం అన్నారు. అంతే కాదు అసలు రక్షా బంధనం పరమార్థం పురుషుడు స్త్రీకి రక్షణ ఇవ్వటం కాదు... స్త్రీయే తన వారైన మగవారికి రక్షగా బంధం కడుతుంది.
    యుద్ధాల వంటి వాటికి పోయినప్పుడు ఆ రక్షా బంధనమే మగవార్ని రక్షిస్తూంటుంది! ఇలా మహిళలే ఎందుకు కట్టారంటే... వాళ్లని మాత్రమే హిందూ మతం శక్తి స్వరూపిణులుగా చూసింది కాబట్టి! మనల్ని ఆపత్కాలంలో రక్షించేది ఆ శక్తి మాత్రమే! ఆ శక్తికి ప్రత్యక్ష స్వరూపమే స్త్రీ!
    పురాణ కాలంలో శచీ దేవీ తన భర్త ఇంద్రుడికి రక్ష కట్టి యుద్ధానికి పంపిందని కథనం వుంది. అది మొదలు ఎన్నో సార్లు తమ వారికి పురాణ వనితలు రక్ష బంధనాలు కట్టారు. అయితే, శ్రీకృష్ణుడికి ద్రౌపతి తన చీర కొంగు చించి కట్టిందని చెప్పే కథే మన వాళ్లకి బాగా నాటుకుంది. అందుకే, అన్నా, చెల్లెళ్లు,అక్కా, తమ్ముళ్ల పండుగగా మర్చేశారు చాలా వరకూ!
    తోబుట్టువుల బాంధవ్యం మన వాంగ్మయంలో ఎంతో కీలక పాత్ర పోషించిందనే చెప్పాలి. శివ, పార్వతులు, లక్ష్మీ, నారాయణులు, సీతారాములు, రాథ, కృష్ణులు... ఇలా భార్యా, భర్తలు, ప్రేయసి, ప్రియుల బంధానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో, మన ఋషులు, అంతే గొప్పతనాన్ని ఆపాదించారు అన్నా, చెల్లెళ్లు, అక్కా, తమ్ముళ్ల ప్రేమకి!
    హిందువుల ప్రాధాన దైవాలైన విష్ణువు, శివుడు...పార్వతీ, లక్ష్మీ దేవులకి సోదరులే అంటుంది శాస్త్త్రం! విష్ణువు, పార్వతీ దేవులనైతే
నారాయణ-నారాయణి అంటుంది వేదం! అంతే కాదు, కంచిలోని కామాక్షి అమ్మవార్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాడట ఆమె అన్నా అళగర్ పెరుమాల్! అందుకే, కంచిలో అమ్మవారి గుడితో పాటూ ఆమె అన్నగారైన విష్ణుమూర్తి ఆలయమూ వుంటుంది!
    శివుడు కూడా లక్ష్మీదేవికి , సరస్వతి దేవీకి అన్న అంటాయి కొన్ని కథలు! ఇక పురాణ కాలం నుంచీ ఇతిహాస వేళకి వస్తే శ్రీరాముడికి శాంత అనే అక్క వుంది! ఆమె ఋష్యశృంగ మహా ముని భార్య!
    శ్రీకృష్ణుడైతే స్వంత చెల్లెలు సుభద్రని , దైవికమైన సోదరి ద్రౌపతిని ఇద్దర్నీ అమితంగా ప్రేమిస్తాడు! ద్రౌపతికి చీరలిచ్చి మానాన్ని కాపాడితే, సుభద్ర కడుపులోని పాండవ వారసుడైన పరీక్షిత్తుని సుదర్శన చక్రం అడ్డు వేసి ప్రాణాల్ని కాపాడుతాడు!
    అసలు పూరీ జగన్నాథ్ లో బలబధ్ర, శ్రీకృష్ణ, సుభద్రల్ని ప్రత్యేకంగా పూజిస్తారు. తెలుసు కదా! ఇలా అన్నా, చెల్లెళ్లని మహారథం ఎక్కించి పూజించటం కేవలం భారతదేశంలో తప్ప మరెక్కడా జరగదు!
    అపారమైన సంపదలకు ఆలవాలమైన లక్ష్మీ దేవీ కూడా సోదరులంటే ఎంతో మురిసిపోతుంది! ఆమెకి సహోదరుడు... సముద్రంలోనే పుట్టిన చంద్రుడు! లక్ష్మీ దేవి..... చంద్ర సహోదరే కాదు... బలి చక్రవర్తికి కూడా సోదరే! బలి చక్రవర్తి వరం పొంది విష్ణువును తన ఇంట కట్టి పెట్టుకుంటే లక్ష్మీ దేవే రాఖీ కట్టి బలిని ఒప్పించి విష్ణువుని రక్షించుకుంటుంది!
    హిందూ పురాణాల్లో ప్రకృతి సర్వం సజీవమే! అందుకే, నది అయిన యమున సూర్యుడి కూతురని, ఆయన కొడుకు యముడికి చెల్లెళ్లని చెబుతారు! యముడు, యమున అన్న పేర్లు కూడా వాళ్లు తోడబుట్టినందుకే వచ్చాయి! వీళ్లిద్దరి అన్నా, చెల్లెళ్ల అనుబంధాన్ని పురస్కరించుకునే భగిని హస్త భోజనం అనే పండుగ కూడా జరుపుకోవటం ఆనవాయితీ!
    ఇక ఒక దశలో యావత్ దేశాన్ని భక్తి పారవశ్యంలో ముంచెత్తిన సంతోషి మాతా కూడా ప్రియమైన చెల్లెలే! గణపతికి ఆయన సోదరి అయిన మానసా దేవీ రాఖీ కడితే విఘ్నేశ్వర పుత్రులు మారాం చేశారట. తమకూ రాఖీ కట్టేందుకు ఒక సోదరి కావాలని గజానన తనయులు శుభం, లాభం పట్టుబట్టారట! అప్పుడు గణాధిపతి సృష్టించిన గణేశ్వర తనయయే సంతోషి మాత! నిజంగా కూడా ఏ ఇంటికైనా ఆడపిల్లే సంతోషం కదా! ఆమె వుంటేనే కదా శుభం, లాభం ( గణపతి పుత్రులు, సంతోషి మాతా సోదరులు! ) చేకూరేది!
    పురాణ కాలంలోని రక్షా బంధం కేవలం ఒక దారపు పోగు మాత్రమే! కాని, ఇప్పుడు అందమైన రాఖీలుగా ముత్యాలు, రంగు రంగుల హొయలతో ఎంతో ఎదిగిపోయింది! ఏది ఎంతగా మారిపోయినా మారనిది మాత్రం... తోడబుట్టిన వారి మధ్య వుండే అమలినమైన అమ్మ పాలు పంచుకున్న అద్భుత ప్రేమే!

 


More Rakhi Purnima