అక్కడ బుల్లెట్ను పూజిస్తారు... మద్యం నివేదిస్తారు!

 

 

రాజస్థాన్లోని జోధ్పూర్ నగరం. ఆ నగరం నుంచి పాలీకి వెళ్లే రహదారి పక్కన ఓ చిన్న ఆలయం. బస్సు ప్రయాణికులు, మోటర్ సైకిళ్ల మీద వెళ్లేవారు, ట్యాక్సీవాలాలు, లారీ డ్రైవర్లు- ఇలా ఒకరేంటి, ఆ దారిన వెళ్లే ప్రతి ఒక్కరూ ఆ ఆలయం దగ్గర ఆగి తీరుతారు. ఇంతకీ ఆ ఆలయం ఏ బాబాదో, అమ్మవారిదో కాదు! మరి ఏమిటో ఆలయం ప్రత్యేకత!!! 1991 డిసెంబరు, 2. ఆ రోజున ఓమ్ సింగ్ రాథోడ్ అనే ఆయన చోటిలా అనే గ్రామానికి వెళ్తున్నాడు. ఆయన ప్రయాణిస్తున్న వాహనం మరికాసేపటిలో చోటిలా గ్రామంలోకి ప్రవేశిస్తుంది అనగా…. ఊహించని ప్రమాదం జరిగింది. రాథోడ్ వాహనం ఓ చెట్టుకి గుద్దుకుంది. ఆయనేమో పక్కనే ఉన్న ఓ గోతిలో పడిపోయాడు. జరిగిన ప్రమాదానికి రాథోడ్ ప్రాణం వెంటనే గాల్లో కలిసిపోయింది. కానీ అక్కడే మొదలైంది అసలు కథ!

 

 

యాక్సిడెంట్ జరిగిన ప్రదేశానికి పోలీసులు చేరుకున్నారు. ప్రమాదానికి కారణం అయిన వాహనాన్ని జప్తు చేసి స్టేషనుకి తరలించారు. కానీ తెల్లవారేసరికి ఆ బండి తిరిగి ప్రమాదం జరిగిన చోటుకే చేరుకుంది. ఎవరో ఆకతాయి కావాలని ఇలా స్టేషన్ నుంచి బండి తీసుకువచ్చాడని అనుకున్నారు పోలీసులు. ఈసారి బండిలో పెట్రోలు తీసేసి, తాళాలు బిగించి, గొలుసులు కట్టి మరీ స్టేషనులో ఉంచారు. కానీ ఆశ్చర్యం! మళ్లీ బండి ప్రమాదస్థలానికి తిరగివచ్చింది. ఇలా ఎన్నిసార్లు చేసినా తెల్లవారేసరికి బండి ప్రమాదస్థలానికే చేరుకునేది. దీంతో రాథోడ్ ఆత్మ ఆ వాహనాన్ని ఆవహించిందన్న నమ్మకం మొదలైపోయింది. అప్పటి నుంచి ఓం సింగ్ రాథోడ్ను ఓం బన్నా అని గౌరవంగా పిల్చుకోవడం మొదలుపెట్టారు. ఆయన వాహనమైన ఆ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ని ఓం బన్నాకు ప్రతిరూపంగా భావించసాగారు.

 

ఓం బన్నా ఏ గోతిలో అయితే పడి చనిపోయారో, ఆ గోతిని చదును చేసి... దాని మీద ఆయన వాహనానికి గుడి కట్టారు. ఆయన వాహనం గుద్దుకున్న చెట్టుకి కూడా నిత్యం పూజలు చేస్తూ ఉంటారు. మొదట్లో ఈ గుడిని ఎవరూ పెద్దగా పట్టించుకునేవారు కాదు. కానీ కొంతమంది యాత్రికులు తాము ‘ఓం బన్నా ఆత్మను బుల్లెట్ మీద తిరుగుతూ చూశాం!’ అని చెప్పడంతో ఆయన మీద నమ్మకం పెరిగిపోయింది. పైగా ఆ దారిన ఏ ప్రమాదం జరిగినా కూడా ఓం బన్నా వెంటనే ప్రత్యక్షమై ఆదుకుంటున్నాడన్న ప్రచారమూ మొదలైంది. దాంతో ఆ దారిన వెళ్లే ప్రతి యాత్రికుడూ ఓం బన్నా ఆలయం దగ్గర ఆగి, ఆయన బుల్లెట్ని దర్శించుకునికానీ వెళ్లరు. అలా ఒకవేళ ఎవరన్నా ఓం బన్నా ఆలయాన్ని దర్శించకుండా దాన్ని దాటుకుని వెళ్తే, వాళ్లకి ఏదో ఒక అనర్థం జరుగుతందని అంటారు.

 

 

ఓం బన్నా ఆలయం చిన్నదే అయినా అక్కడ కోలాహలానికి ఏమీ తక్కువ లేదు. ఆయనని ప్రార్థిస్తూ రాసిన భజనల సీడీలు, ఓం బన్నా ఫొటో ఉన్న పటాలు అక్కడ విరివిగా దొరుకుతాయి. ఆలయానికి చేరుకున్న భక్తులు అక్కడి బుల్లెట్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. దానికి అగరొత్తులు వెలిగిస్తారు. ఓం బన్నాకు నైవేద్యంగా మద్యాన్ని సమర్పించడం ఇక్కడ కనిపించే మరో విచిత్రం. వినేవారికి ఇక్కడి పూజలు, పద్ధతులు ఎంత చిత్రంగా ఉన్నా... ఓం బన్నాను నమ్ముకునేవారు ఎలాంటి ప్రమాదానికీ గురి కారు అన్నది పంజాబీల విశ్వాసం. అందుకే దారిన వెళ్లేవారే కాకుండా, పంజాబ్ నలుమూలల నుంచి యాత్రికులు ఈ బుల్లెట్ బాబాను చూసేందుకు చోటిలా గ్రామానికి చేరుకుంటూ ఉంటారు.

- నిర్జర.

 

 


More Vyasalu