గంగమ్మ అవతరించింది సంక్రాంతికే...

 

గంగావతరణం గురించిన కథ మనందరికీ సుపరిచితమే! అయినా టూకీగా చెప్పుకోవాలంటే... సూర్యవంశానికి చెందిన సగరుడు అనే రాజు ఒకసారి అశ్వమేథయాగాన్ని నిర్వహించ తలపెట్టాడు. అదే సమయంలో కపిలమహాముని తన ఆశ్రమంలో ఘోర తపస్సుని ఆచరిస్తున్నాడు. కపిలమహాముని తపస్సు కనుక సఫలం అయితే తన ఇంద్రపదవికే ఎసరు వస్తుందనుకున్నాడు ఇంద్రుడు. అందుకోసం ఆ మహర్షి తపస్సుని భగ్నం చేసేందుకు ఎలాంటి ఎత్తు వేయాలా అనే ఆలోచనలో పడ్డాడు.

 

ఈలోగా ఇంద్రుని దృష్టి సగరుడు యాగం కోసం విడిచిపెట్టిన అశ్వం మీద పడింది. ఆ అశ్వాన్ని కనుక కపిలముని ఆశ్రమంలో విడిచిపెడితే! దానిని వెతుక్కుంటూ సగరుని సైన్యం వస్తుంది. యాగ నియమం ప్రకారం ఎవరైతే యాగాశ్వాన్ని బంధిస్తారో వారితో పోరు సలిపి ఆ అశ్వాన్ని విడిపించుకోవలసి ఉంటుంది. అలా కపిలముని తపస్సు చెదరకు తప్పదు అనుకున్నాడు ఇంద్రుడు. ఆ మేరకు యాగాశ్వాన్ని దొంగిలించి కపిలముని ఆశ్రమంలో ఆ ముని చెంతనే కట్టివేశాడు.

 

యాగాశ్వాన్ని వెతుక్కుంటూ వచ్చి సగరుని అరవై వేల కుమారులకి కపిలముని ఆశ్రమంలో యాగాశ్వం కనిపించింది. దానిని కపిలమునే తీసుకువచ్చాడని భ్రమించి అతడి తపస్సుని భగ్నం చేశారు. ఘోరమైన తపస్సు ఒక్కసారిగా భగ్నం కావడంతో ఒక్కసారిగా కళ్లు తెరచాడు కపిలముని. అంతే ఆ రౌద్రానికి సగరుని కుమారులంతా భస్మమైపోయారు. అలా భస్మీపటలమైపోయిన సగరుని కుమారులకు ఉత్తమగతులు లభించాలంటే సాక్షాత్తూ ఆ గంగమ్మ తల్లే దిగిరావాలని తేలింది. కానీ ఆకాశగంగను భువి మీదకు తరలించేదెలా. ఆ ప్రయత్నంలో సగరుడు, అతని కుమారుడైన అసమంజసుడు, అసమంజసుని పుత్రుడైన అంశుమంతుడూ కూడా విఫలమయ్యారు. చివరికి అంశుమంతుని కుమారుడైన భగీరథుడు మాత్రం ఈ కార్యాన్ని సాధించగలిగాడు. భగీరథుని కోరికను మన్నించి గంగ అవతరించింది మకర సంక్రాంతి రోజునే!

 

కోల్‌కతాకు సమీపంలో ఉన్న సాగర్‌ ద్వీపం (sagar island) మీద ఆనాటి కపిల ముని ఆశ్రమం ఉందని నమ్ముతారు. అందుకు సాక్ష్యంగా అక్కడ కపిలమునికి ఒక గుడిని కూడా నిర్మించారు. అంతేకాదు! సాగర్ ద్వీపం సమీపంలోనే గంగానది బంగాళాఖాతంలో సంగమిస్తుంది. మకర సంక్రాంతి పర్వదినానాన ఈ గంగావతరనాన్ని పురస్కరించుకుని లక్షలాదిమంది సాగర్ ద్వీపానికి చేరుకుంటారు. అక్కడ గంగానదిలో స్నానం చేసి కపివముని ఆలయాన్ని దర్శించుకుంటారు. కపిలముని మహాజ్ఞాని. ఆయన సాక్షాత్తూ మహావిష్ణువు అవతారం అని పురాణాలు పేర్కొంటున్నాయి. పైగా భారతీయ తత్వచింతనలో ప్రధానమైన సాంఖ్య దర్శనాన్ని రచించింది కూడా ఈ కపిల మహర్షే.

 

గంగావతరణం రోజున ఆ గంగమ్మ ఒడిలో మునకలు వేసి, ఆ మహాత్ముని ఆలయాన్ని సందర్శించుకోవడంతో గొప్ప పుణ్యం లభిస్తుందని బెంగాలీలు నమ్ముతారు. సాగర్ ద్వీపం మీద గంగాసాగర్‌ అనే ఊళ్లో కపిలముని ఆశ్రమం ఉంది కాబట్టి, ఈ జాతరను గంగాసాగర్ జాతరగా (మేళా) పేర్కొంటారు. కుంభమేళా తర్వాత మన దేశంలో జరిగే అతి పెద్ద జాతర ఈ గంగాసాగర్‌ మేళానే. ఒకప్పుడు ఎలాగైతే గంగానది సాగరపుత్రులకు ఉత్తమగతులను కల్పించిందో, అలాగే తమ పాపాలని కూడా కడిగివేయమంటూ వేడుకుంటారు.

 

 

కేవలం గంగాసాగర్‌ దగ్గరే కాదు, మకర సంక్రాంతి రోజున నదుల్లోనూ, సముద్రాల్లోనూ పుణ్యస్నానాలని ఆచరించడం మంచిదని చెబుతుంటారు. ఆషాడము, కార్తీకం, మాఘము, వైశాఖ మాసాలతో పాటుగా సముద్రస్నానానికి సంక్రాంతిని కూడా మినహాయింపుని ఇవ్వడం గమనార్హం. మకరసంక్రాంతినాటికి సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తాడు కాబట్టి, ఈ రోజు సముద్రాలలోని ఉష్ణోగ్రతలు స్నానానికి అనుకూలంగా ఉంటాయి. దీంతో అటు సముద్రపు నీటిలోని లవణాలు, సూర్యుని నుంచి వెలువడే లేలేత కిరణాలు... శరీరానికి ఆరోగ్యాన్నందిస్తాయి.

- నిర్జర.

 


More Sankranti