మయూర వాహనుడు కాలుమోపిన క్షేత్రం... మోపిదేవి

 


సుబ్రహ్మణ్యుడు అనగానే మనకు తమిళనాడు గుర్తుకు వస్తుంది. అక్కడి వారు మురుగున్ అని పిలుచుకుంటూ షణ్ముఖుడ్ని గొప్పగా కొలుస్తారు. కాని, శివనందనుడైన స్కందుని ఆరాధన దేశమంతటా వుంది. మరీ ముఖ్యంగా, దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, కర్ణాటక, మన ఆంధ్రప్రదేశ్ లో కూడా వుంది. తమిళనాడులో వున్నన్ని గుళ్లు ఇక్కడ లేకున్నా ప్రసిద్ధిమైన కుమార క్షేత్రాలు చాలా చోట్ల వున్నాయి. కర్ణాటకలోని కుక్కి అలాంటి సుబ్రహ్మణ్యేశ్వర క్షేత్రమే. ఇక తెలుగు నేలపై గణనాథుని సోదరుడు ఘనంగా వెలిసిన దివ్య క్షేత్రమే మోపిదేవి!

 

కృష్ణా జిల్లాలోని మోపిదేవి మండలం,మోపిదేవి పట్టణంలో వుంది స్వామీ వారి మహిమాన్విత ఆలయం. అయితే, ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే, కుమార స్వామి మనకు చిత్రాల్లో కనిపించినట్టుగా చేతిలో శక్తి ఆయుధం పట్టుకుని బాలుడిలాగా దర్శనం ఇవ్వడు! తండ్రి శివుని మాదిరిగా లింగాకారంలో ధన్యుల్ని చేస్తాడు! ఇక శివ లింగాలకి వున్నట్టుగా ఈ స్వామికి పానవట్టం వుండదు. దానికి బదులు ఒక పాము చుట్టలు చుట్టుకుని వున్నట్లుగా కింది భాగం వుంటుంది. దానిపైనే లింగాకారంలోని స్కందుడు కొలువై వుంటాడు...

 

మోపిదేవిలోని షణ్ముఖుడు భక్త సులభుడని ప్రతీతి. ఆయన నమ్మి కొలిచిన వారు ఇప్పటికి చాలా మంది సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. ఎలాంటి రోగమైన , దీర్ఘ వ్యాధి అయినా స్వామి వారి అనుగ్రహంతో శాంతిస్తుందని చెబుతున్నాయి పురాణాలు. అలాగే, కుజ, సర్ప, నాగ దోషాల కారణంగా పెళ్లిల్లు ఆలస్యం అవుతోన్న వారు కూడా ఇక్కడ ప్రత్యేక పూజలు చేయించుకుంటూ వుంటారు. పెళ్లైన వారు సత్ సంతానం కలిగేందుకు కూడా కుమార స్వామిని విశేషంగా ఆరాధిస్తారు.

 

తారకాసుర సంహారం చేసిన దేవసేనాధిపతి స్వయంగా ఇక్కడ తపస్సు చేశాడంటారు. అందుకే, మోపిదేవి మహా మహిమాన్విత క్షేత్రంగా విరాజిల్లుతోంది. ప్రతీ యేడూ ఇక్కడ స్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ సారి జనవరి 31 - ఫిబ్రవరి 4 మధ్యన ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా జరిగే కళ్యాణం, రథోత్సవాల్లో వేలాది మంది భక్తులు పాల్గొని తరిస్తారు.

 

మన రాష్ట్రంలోని అత్యంత అరుదైన సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో మోపిదేవి ఒకటి. అందరూ తప్పక దర్శించాల్సిన దివ్య ధామం.


 


More Festivals