సకల శుభాలనూ అందించే మంగళగౌరి

 


తెలుగు ముత్తయిదువలకు శ్రావణ మాసం వస్తే చాలు... మంగళగౌరీ వ్రతమే గుర్తుకువస్తుంది. తమ పసుపుకుంకుమలను పదికాలాలపాటు చల్లగా చూడమంటూ ఈ వ్రతాన్ని నోచుకుంటారు. ఆ మంగళగౌరీ వ్రతానికి సంబంధించి కొన్ని విశేషాలు...

 

- మంగళగౌరీ వ్రతాన్ని సాక్షాత్తుగా ఆ శ్రీకృష్ణుడే ద్రౌపదీ దేవికి అందించాడన్నిది ఐతిహ్యం. ‘మహిళలకు వైధవ్యం కలగకుండా ఏదన్నా వ్రతాన్ని ఉపదేశించ’మని ద్రౌపది కోరగా, కృష్ణపరమాత్ముడు ఈ వ్రతవైభవాన్నీ, దాని విధానాన్నీ అందచేశాడట. రక్షాబంధనాన్ని జరుపుకొనే ఈ శ్రావణమాసంలోనే కృష్ణుడు, తన చెల్లెలు ద్రౌపది మాంగల్యాన్ని నిలిపే ఈ వ్రతాన్ని ఉపదేశించడం యాదృచ్ఛికం కాదు కదా!

 

- విష్ణుమూర్తి జన్మనక్షత్రమైన శ్రవణా నక్షత్రంలో చంద్రుడు సంచరించే మాసం శ్రావణ మాసం. అందుకని అటు శ్రీమహావిష్ణువుకీ, ఇటు ఆయన సతి లక్ష్మీదేవికీ కూడా ఇది ఇష్టమైన మాసం. భక్తులంతా స్థితికారులైన ఆ దంపతులని ఈ మాసంలో వివిధరకాలుగా పూజించుకుంటారు. ఈ మాసంలో వచ్చే శుక్రవారాలను పరమ పవిత్రంగా భావించి అమ్మవారిని కొలుచుకుంటారు. మరి లయకారులైన పార్వతీపరమేశ్వరులని కూడా ప్రసన్నం చేసుకోవాలి కదా! అందుకే గౌరి (పార్వతి)ని కొలిచే ఈ మంగళగౌరి వ్రతాన్ని కూడా ఆచరించడం సబబు.

 

- జీవితం సుఖంగా సాగిపోయేందుకు లక్ష్మీదేవి కటాక్షం అవసరం అయితే, ఆ జీవితంలో ఎలాంటి అమంగళమూ జరగకుండా చూసుకునే బాధ్యత గౌరీదేవిది. అందుకనే ఇది మంగళగౌరీ వ్రతంగా ప్రసిద్ధి! ఆర్ధనారీశ్వరులైన ఆ ఆదిదంపతులలాగా తమ దాంపత్యమూ హాయిగా సాగిపోవాలనీ, లయకారుడైన ఆ పరమేశ్వరుడు తమ పట్ల చల్లని చూపుతో ఉండాలనీ ముత్తయిదువలు కోరుకుంటారు.

 

- జ్యోతిష రీత్యా దాంపత్యానికి అధిపతి కుజుడు. ఆయన అధిపతిగా వచ్చే వారం మంగళవారం. మన జాతకచక్రంలో కుజుని స్థానం ఏమాత్రం సవ్యంగా లేకున్నా, ఆయన దాంపత్యంలో అపశ్రుతులను కలుగచేస్తాడని ఓ నమ్మకం. ముఖ్యంగా కుజదోషం ఉన్నవారు వివాహానంతరం ఇక్కట్లు ఎదుర్కొంటారని ఒక భయం. అదే సమయంలో కుజుడు ధైర్యానికీ, ఆత్మస్థైర్యానికీ కూడా ప్రసిద్ధి. మంగళగౌరి వ్రతం ద్వారా పార్వతీదేవి ఆ కుజుని దోషాలను పరిహరించి, ఆయన అందించే మంచి లక్షణాలను ఇనుమడింపచేస్తుంది అనడంలో సందేహం ఏముంది!

 

- ఐదేళ్ల దీక్షగా సాగే ఈ వ్రతంలో... మొదటి సంవత్సరం ఈ పూజని తల్లే తొలి పూజారిగా నిలిచి కూతురి చేత చేయించేందుకు సిద్ధపడతారు. పసుపుముద్దనే పార్వతీదేవిగా తలచి పూజించుకుంటారు. పత్రితోనూ, పూలతోనూ అమ్మవారిని నిండుగా అర్చించుకొని... శనగలనే ప్రసాదంగా పంచుకుంటారు. ఇలా మంగళగౌరి వ్రతాన్ని గమనించినప్పుడు... అడుగడుగునా ఆడంబరం కంటే ఆత్మశుద్ధికే ఎక్కువ ప్రాధాన్యత ఉన్నట్లు కనిపిస్తుంది. ఇది సామాన్య గృహిణులు చేసే దాపంత్య యజ్ఞంలా తోస్తుంది.

 

చివరగా... ‘మంగళగౌరి పూజ’లో పార్వతీదేవిని గౌరీదేవిగా భావించడంలో ఒక పరమార్థం కనిపిస్తుంది. గౌరీ అంటే ప్రకాశించునది అని అర్థం. ఈ వ్రతం చేసుకున్నవారి జీవితాలు కూడా సంతోషంతో ప్రకాశిస్తాయి కాబోసు! అందుకనే సాక్షాత్తు ఆ పరమశివుడు సైతం త్రిపురాసురుడనే రాక్షసుని సంహరించే ముందు మంగళగౌరిని పూజించాడని చెబుతారు. ఆ గరళకంఠుడినే కాచుకున్న గౌరి, మనల్ని మాత్రం ఎలా విస్మరిస్తుంది.

 

- నిర్జర.


More Sravana Masam - Varalakshmi Vratam