ఇక్కడి దేవతను తిడతారు

 


కేరళ అనగానే పచ్చని ప్రకృతి గుర్తుకువస్తుంది. అక్కడి ప్రజల భిన్నమైన జీవినశైలీ గుర్తుకువస్తుంది. కానీ మిగతా ఏ రాష్ట్రానికీ తీసిపోని విధంగా అక్కడ ప్రాచీన ఆలయాలు ఎన్నో ఉన్నాయన్న విషయం మాత్రం చాలామందికి తెలియదు. అలాంటి ఓ అరుదైన ఆలయమే ‘కొడుంగల్లుర్‌ భగవతి’ ఆలయం.

 

కేరళలోని ముఖ్య పట్నం కొచ్చిన్‌కి కేవలం 29 కిలోమీటర్ల దూరంలో కొడుంగల్లుర్‌ అనే ఊరు ఉంది. ఆ ఊరిలో ఉన్న అతి ప్రాచీన ఆలయమే కొడుంగల్లుర్‌ అమ్మవారి ఆలయం. విష్ణువు అవతారమైన పరశురాముడు, కేరళను సముద్రం నుంచి వెలికితీసిన విషయం తెలిసిందే! అందుకే ఈ రాష్ట్రానికి ‘పరశురామ క్షేత్రం’ అన్న పేరు కూడా ఉంది. అయితే ఇలా వెలికితీసిన తరువాత కేరళను దారుక అనే రాక్షసుడు పట్టిపీడించసాగాడట. అతని నుంచి ఎలాగైనా రక్షించమంటూ పరశురాముడు, ఆ మహాదేవుని ప్రార్థించాడు. అంతట ఆ పరమేశ్వరుడు ‘భద్రకాళి’ని ప్రతిష్టించమని సూచించాడట. ఆ సూచన మేరకు పరశురాముడు కొడుంగల్లుర్‌ ఊరిలో భద్రకాళి అమ్మవారిని ప్రతిష్టించారని చెబుతారు. ఆ అమ్మవారి అనుగ్రహంతో దారుక రాక్షసుడు మృత్యువాత పడ్డాడు.

 

 

 

కొడుంగల్లుర్‌ భద్రకాళి ఆలయం చాలా ప్రాచీనమైనది అని చెప్పేందుకు ఇక్కడి ఆచారాలే సాక్ష్యం. రాష్ట్రంలో, ఆ మాటకు వస్తే దేశంలోనే ఎక్కడా కనిపించని చిత్రమైన ఆచారాలు ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడి అమ్మవారికి ఒకప్పుడు విపరీతంగా బలి ఇచ్చేవారట. కానీ ప్రస్తుతం బలులను నిషేధించడంతో... బలికి సూచనగా ఎర్రటి ఎరుపు రంగులో ఉన్న ధోవతీలను అమ్మవారికి సమర్పిస్తుంటారు. ఇక ‘కావు తీండల్‌’ అనే ఉత్సవం సందర్భంగా భక్తులు కర్రలు చేతపట్టుకుని గుడిచుట్టూ ముమ్మారులు ప్రదక్షిణ చేసే ఆచారం కనిపిస్తుంది. ఒకప్పుడు అమ్మవారు ఆయుధాలను ధరించి రాక్షసుల మీద పోరుకి వెళ్లిన సందర్భానికి ప్రతీకగా భక్తులు ఇలా చేస్తారని కొందరి విశ్లేషణ. వీటన్నింటికంటే చిత్రమైన ఆచారం ‘భరణి ఉత్సవం’లో కనిపిస్తుంది. మార్చి- ఏప్రిల్‌ నెలల మధ్య వచ్చే ఈ ఉత్సవం సందర్భంగా పూనకం వచ్చినవారంతా గుడిలో పరుగులు పెడుతూ అమ్మవారిని దుర్భాషలాడతారు.

 

 

కొడుంగల్లుర్‌ అమ్మవారి ఆలయం కూడా చాలా విభిన్నంగా ఉంటుంది. పది ఎకరాల సువిశాలమైన విస్తీర్ణంలో, మహావృక్షాల నీడలో ఈ ఆలయం కనిపిస్తుంది. ఈ ఆలయంలోని అమ్మవారు కూడా ఏడడుగుల చెక్క విగ్రహంలో కనిపిస్తారు. మన సింహాచలంలోలాగా ఇక్కడి అమ్మవారి విగ్రహానికి కూడా ఏటా చందనోత్సవాన్ని జరుపుతారు. ఆలయంలో అమ్మవారితో పాటుగా సప్తమాతృకలు, వీరభద్రుడు, గణపతి విగ్రహాలు కనిపిస్తాయి.

 

 

తరతరాలుగా కొడుంగల్లుర్‌ సంస్థానానికి చెందిన రాజులు ఈ ఆలయాన్ని పర్యవేక్షిస్తున్నారు. ప్రభుత్వాలు మారినా, ఇప్పటికీ ఈ ఆలయం మీద వారిదే పైచేయిగా ఉంటోంది. కేవలం కొడుంగల్లుర్‌ రాజులే కాదు... కేరళను పాలించిన రాజులెందరో ఈ అమ్మవారిని తమ కులదేవతగా భావించేవారు. అందుకనే తమిళ ప్రాచీన గ్రంథం ‘శిలప్పదిగారం’లో కూడా ఈ దేవత ప్రస్తావన కనిపిస్తుందట. ఇంత విశిష్టమైన ఆలయం కాబట్టే కేరళవాసుల వేల సంఖ్యలో నిత్యం ఈ అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు.

 

 

- నిర్జర.


More Purana Patralu - Mythological Stories