అగ్నిని మించినవాడు అంగీరసుడు

 

 


వేల సంవత్సరాల హైందవ సంస్కృతిని సుసంపన్నం చేసిన రుషులెందరో! అందుకే ఇప్పటికీ వారిని పేరుపేరునా తలచుకొంటూ ఉంటాము. వారి వారసులమని గర్విస్తుంటాము. అలాంటి మహానుభావులలో ఒకరు- అంగీరస మహర్షి!

 

నవబ్రహ్మలలో ఒకరు

బ్రహ్మ తాను కొనసాగిస్తున్న సృష్టిలో సహకరించేందుకు, తన మానసం నుంచి పదిమంది కుమారులకు జన్మనిచ్చాడు.వీరందరినీ బ్రహ్మ మానసపుత్రులని అంటారు. వీరిలో మూడవవాడు అంగీరసుడు. ఈ పదిమంది కుమారులలోనూ నారదుడు ఆజన్మ బ్రహ్మచారిగా ఉండిపోయి సృష్టికార్యానికి దూరంగా ఉన్నాడు. మిగిలిన తొమ్మిదిమందీ గృహస్థు ధర్మాన్ని పాటించి సంతానాన్ని వృద్ధి చేశారు. అందుకని వారిని నవబ్రహ్మలుగా పిలుస్తారు. వారిలో అంగీరసుడు కూడా ఒకరు.

 

శ్రద్ధతో వివాహం

అంగీరసుని భార్యల గురించి పలు ప్రస్తావనలు కనిపిస్తాయి. కానీ వాటిలో ప్రముఖమైనది మాత్రం కర్దమ ప్రజాపతి కూతురు శ్రద్ధతో ఆయన వివాహం. కర్దమ ప్రజాపతికి తొమ్మిదిమంది కుమార్తెలు. వీరందరినీ సమర్ధులకు ఇచ్చి వివాహం జరిపించే ప్రయత్నంలో ఆయనకు నవబ్రహ్మల గురించి తెలిసింది. దాంతో తన తొమ్మిదిమంది కూతుళ్లనీ వారికి ఇచ్చి వివాహం చేశారు. వారిలో శ్రద్ధ అనే కుమార్తెని అంగీసునికి ఇచ్చారు. మహాపతివ్రతలుగా పేరొందిన అనసూయ, అరుంధతులు ఈ శ్రద్ధకు తోబుట్టువులే!

 

అగ్నిని మించి

అంగీరసునికి సంబంధించి ఒక చిత్రమైన కథ పురాణాలలో కనిపిస్తుంది. ఒకనాడు అగ్నిదేవుడు, తన తోటి దేవతల మీద అలగి ఏకాంతంలోకి వెళ్లిపోయాడట. అగ్ని లేకపోవడంతో ప్రపంచం అతలాకుతలం అయిపోయింది. ఏ ఇంటా పొయ్యి వెలగలేదు. ఏ హోమంలోనూ నిప్పు రాజుకోలేదు. దాంతో బ్రహ్మదేవుడు ఒక ఉపాయాన్ని ఆలోచించాడు. అగ్నిని మించిన తేజోవంతుడైన అంగీరసుడు, అగ్ని స్థానాన్ని భర్తీ చేయగలడని సూచించాడు. దాంతో అగ్ని నిర్వహించే బాధ్యతలను అంగీరసుడ తలకెత్తుకొన్నాడు. తాను లేకపోయినా కూడా లోకం యథావిధిగా సాగిపోవడం చూసి అగ్నికి ఏం చేయాలో పాలుపోలేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రజలు తనని మర్చిపోతారన్న భయం వేసింది. దాంతో తిరిగి తన బాధ్యతలను నిర్వహించేందుకు బయటకు వచ్చాడు. అగ్నిని చూసిన అంగీరసుడు పల్లెత్తు మాట అనలేదు సరికదా, అతని బాధ్యతలను తిరిగి సంతోషంగా అతనికే అందించివేశాడు. ఈ కథ ద్వారా ఎంతటివారికైనా గర్వభంగం తప్పదనీ, వినయం ఉన్నవారినే విజయం వరిస్తుందనీ తెలుస్తోంది.

 

వంశాభివృద్ధి

అంగీరసుడు గృహస్థుగా తన ధర్మాన్ని ఏనాడూ విస్మరించలేదు. ఈయనకు ఏడుగురు కొడుకులు, ఏడుగురు కుమార్తెలు. దేవతల గురువైన బృహస్పతి అంగీరసుని పుత్రుడే! మరో కుమారుడైన సంవర్తుడు విరాగిగా ఇప్పటికీ కాశీ చుట్టుపక్కల సంచరిస్తున్నాడని ఓ నమ్మకం. అంగీరసుని ద్వారా వృద్ధి చెందిన వంశంలోనివారిని అంగీరసులు అంటారు. వీరు కాకుండా ముద్గల పురాణాన్ని రాసిన ముద్గల రుషి కూడా అంగీరసుని చేతుల మీదుగా పెరిగినవాడే.

 

బ్రహ్మజ్ఞాని

అటు గృహస్థుగానే కాదు ఇటు జ్ఞానిగానూ అంగీరసుడు ప్రఖ్యాతుడు. అందుకే ఆయనను సప్తర్షులలో ఒకరిగా ఎంచుతారు. మానవ జీవితాన్ని నిర్దేశిస్తూ లిఖించిన స్మృతులలనే గ్రంథాలలో అంగీరస మహర్షి రాసిన అంగీరసస్మృతి కూడా ఒకటి. ఇక ఉపనిషత్తులలోనూ అంగీరసుని ప్రస్తావన కనిపిస్తుంది. అంగీరసుడు శౌనకునికి ఉపదేశించిన బ్రహ్మజ్ఞాన సారం ముండకోపనిషత్తులో ప్రముఖంగా వినిపిస్తుంది. అలాంటి అంగీరసుని భారతీయ సంస్కృతి ఎలా మరచిపోగలదు?

 

 

- నిర్జర.


More Purana Patralu - Mythological Stories