సముద్రగర్భంలో హనుమంతుడు రాసిన రామాయణం!

 

 

ప్రపంచంలో మూడువందలకు పైగా రామాయణాలు ఉన్నాయని చెబుతారు. వీటి కథలలో చిన్నాచితకా తేడాలు కనిపించినా వాల్మీకి రాసిన రామాయణమే ప్రామాణికం అని భక్తుల విశ్వాసం. అలాంటిది.. వాల్మీకి కూడా అచ్చెరువొందేలా ఓ రామాయణం రూపొందింది. దానిని రాసింది ఎవరో కాదు... సాక్షాత్తూ హనుమంతుడే!

 

హనుమంతుడు సకలశాస్త్ర పారంగతుడు. అంతటి జ్ఞానానికి తోడు సృజన కూడా ఉన్నవాడు. అందుకనే రామరావణ యుద్ధం ముగిసిన తరువాత, తనివితీరేలా తనే రామకథని రాసేందుకు నిశ్చయించుకున్నాడు. ఓ పర్వతం మీద కూర్చుని అక్కడి రాళ్ల మీద తన గోళ్లతోనే రామాయణాన్ని లిఖించాడు. ఈ విషయం తెలుసుకున్న వాల్మీకీ, హనుమంతుని రామాయణాన్ని చదివేందుకు అక్కడకి చేరుకున్నాడు. మహారుషి వాల్మీకిని చూసిన హనుమంతుడు ఆదరించి, తను రాసిన రామాయణాన్ని చూపాడు.

 

ఆంజనేయుడు రాళ్ల మీద చెక్కిన రామాయణాన్ని ఓపికగా చదువుతూ వందల ఏళ్లు గడిపాడు వాల్మీకి మహర్షి. అంతా పూర్తయిన తర్వాత సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయాడు. ‘హనుమా! నీ రామాయణం అద్ధుతంగా ఉంది. నీ రామాయణం ముందు నేను రాసిన రామచరిత్ర దిగదుడుపే. కాబట్టి నా ప్రయత్నం అంతా వృధా అయిపోయినట్లే!’ అన్నాడు ఒకింత విచారంగా.

 

వాల్మీకి మాటలు విన్న హనుమంతుడు ఆలోచనలో మునిగిపోయాడు. సాటిభక్తుడు రాసిన రామకథ ప్రచారంలోకి రాకపోతే ఎలా! తన రామకథ ఎలాగూ తన గుండెల్లో ఎప్పటికీ పదిలంగానే ఉంటుంది. ఒక్క క్షణం కళ్లు మూసుకుంటే చాలు... తన మనసంతా రామగాథతో నిండిపోతుంది. అందుకే తను రామాయణాన్ని లిఖించిన పర్వతం యావత్తునీ పెకిలించి సముద్రంలోకి విసిరేశాడట! అలా హనుమంతుడు రాసిన రామాయణం సముద్రగర్భంలో కలిసిపోయింది.

 

ఈ గాథకు ప్రామాణికత లేనప్పటికీ, హనుమంతుడు రాసిన రామాయణం ఇప్పటికీ సముద్రగర్భంలోనే ఉందనీ... అందులో ఒక ముక్క మహాకవి కాళిదాసుకి దొరికిందనీ ఉత్తరాదివాసులు నమ్ముతూ ఉంటారు. అంతేకాదు! హనుమంతుని రుణాన్ని తీర్చుకునేందుకు వాల్మీకి తిరిగి తులసీదాసుగా జన్మించి, హనుమాన్ చాలీసాను లిఖించారనీ చెబుతారు.

- నిర్జర.

 

 

 

 

 


More Shri Hanuman Jayanti