పాకిస్తాన్‌లో కృష్ణుడు ప్రతిష్టించిన శివలింగం!

 

 

భారతదేశం నుంచి పాకిస్తాన్ విడిపోయిన తరువాత అక్కడి హైందవ ఆలయాలకి తీవ్ర నష్టం కలిగింది. పాలకుల నిర్లక్ష్యం కారణంగానో, స్థానికుల నిర్లిప్తం చేతనో అక్కడి దేవాలయాలన్నీ శిథిలమైపోయాయి. చాలా వరకు కాలగర్భంలో కలిసిపోయాయి. అదృష్టవశాత్తూ అక్కడి హైందవ క్షేత్రం ఒకటి కాలపరీక్షను తట్టుకొని నిలిచింది. చివరికి పాకిస్తాన్‌ ప్రభుత్వం దిగివచ్చి ఆ ఆలయాన్ని పరిరక్షించేందుకు నడుం కట్టింది. అదే కాటస్‌రాజ్‌!

 

 

మహాభారతం- కాటస్‌రాజ్‌

కాటస్‌రాజ్ ఈనాటిది కాదు. మహాభారత కాలంలో పాండవులు ఇక్కడే చాలా రోజులు అరణ్యవాసాన్ని గడిపారని స్థలపురాణం చెబుతోంది. ఆ సమయంలో పాండవులు ఇక్కడ కొన్ని ఆలయాలను నిర్మించారని చెబుతారు. ప్రాచీన కాలం నుంచే ఇక్కడ మనుషుల సంచారం ఉంది అనేందుకు రుజువుగా... ఇక్కడ దాదాపు 9 వేల సంవత్సరాల క్రితం వాడిన కత్తులు, గొడ్డళ్లు, గాజులు బయటపడ్డాయి.

 

 

సతీదేవి కన్నీరు:  ఇస్లామాబాద్- లాహోరు రహదారి పక్కన, చాక్వాల్‌ అనే జిల్లాలో ఈ కాటస్‌రాజ్‌ క్షేత్రం ఉంది. దక్షయజ్ఞం సమయంలో సతీదేవి కన్నీటితో ఇక్కడ ఒక సరస్సు ఏర్పడిందనీ... ఆ సరస్సులోని నీరు మహిమాన్వితమైనదని చెబుతారు. అందుకనే ఆ సరస్సు చుట్టూ పాండవులు ఆలయాలు నిర్మించారట. ధర్మరాజు యక్షప్రశ్నలకు జవాబు చెప్పి తన సోదరులను బతికించుకుంది కూడా ఈ ప్రాంతంలోనే అని ఓ ఐతిహ్యం. ఇక్కడి శివాలయంలోని శివలింగాన్ని సాక్షాత్తూ ఆ కృష్ణుడే ప్రతిష్టించాడట. అందుకనే అనాదిగా ఈ క్షేత్రం హిందువులకు ఆరాధనీయంగా మారింది. ఈ ప్రాంతాన్ని పాలించే రాజులు సైతం ఇక్కడ రాజమందిరాలను నిర్మించుకున్నారు. 1947లో విభజన తరువాత ఇక్కడి హిందువులందరూ వెళ్లిపోయినా, కొందరు భక్తులు ఇప్పటికీ వ్యయప్రయాసలకు ఓర్చి ఈ క్షేత్రాన్ని చేరుకుంటూ ఉంటారు. 

 

 

మళ్లీ వైభవం: పాకిస్తాన్‌ భూభాగంలో ఉన్న కాటస్‌రాజ్‌ చాలాకాలం నిర్లక్ష్యానికి గురైంది. ఇక్కడి ముస్లింలు చాలా శాంతస్వభావులు అని పేరు ఉన్నప్పటికీ, ప్రభుత్వపు అలసత్వంతో కాటస్‌రాజ్ శిథిలదశకు చేరుకుంది. ఇక్కడి సరస్సు చెత్తాచెదారంతో నిండిపోయింది. అయితే రానురానూ ఇక్కడి నిర్మాణాల గురించి ప్రపంచవ్యాప్తంగా ప్రచారం జరగడంతో... వాటిని పట్టించుకోక తప్పలేదు. సరస్సుని శుద్ధి చేసేందుకు, ఆలయాలకి శిఖరాలను పునర్నిర్మించేందుకు, వాటిలో సరికొత్త విగ్రహాలను ప్రతిష్టించేందుకు నవాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వం ముందుకు వచ్చింది. తమకి ఇతర మతాల పట్ల కూడా సహనం ఉందని చెప్పుకొనేందుకు కాటస్‌రాజ్‌ అభివృద్ధిని వారు ఓ ఉదాహరణగా చూపిస్తున్నారు.

 

- నిర్జర.


More Purana Patralu - Mythological Stories