కాశీ కబుర్లు - 18 శ్రీ కేదార్ మందిరము

 

ఒక రోజు సాయంత్రం ఆంధ్ర ఆశ్రమానికి వెళ్ళి చూసి వద్దామనుకున్నాం, కానీ అది చాలా దూరం, నడిచే వెళ్ళాలి అనేసరికి ఆ ప్రోగ్రామ్ మానుకుని అలా రెండు రోడ్లు తిరిగి వద్దామని బయల్దేరాం.  త్రోవలో లస్సి త్రాగేసరికి కొంచెం ఓపిక వచ్చింది.  కాశీలో రోడ్లంబడ తిరగటమేమిటి కేదార్ మందిరం దగ్గరయితే వెళ్ళొద్దామనుకుని అక్కడవారిని అడిగాము.  ఈ దోవలో వెళ్ళచ్చు, పది నిముషాలు నడక అన్నారు.  ఇక బయల్దేరాము.  దోవలో అన్నీ చూసుకుంటూ, ఎంత నడిచినా, ఇక్కడే పది నిముషాల్లో వెళ్ళొచ్చు సమాధానం మారలేదు.  దోవలో ఇంకో మూడు దేవాలయాలు, కరివెన వారి సత్రం చూశాం.  (ఆ దగ్గరలోనే ఆంధ్రా సత్రంట తర్వాత తెలిసింది.)  ఆ వివరాలు.

శ్రీ చిమలేశ్వర్ మహాదేవ్ మందిరం

 

 

నడక మొదట్లోనే శ్రీ చిమలేశ్వర్ మహాదేవ్ మందిరం.  ఈ మందిరాన్ని 1808లో నిర్మించారు.  దాదాపు పది సంవత్సరాల క్రితం పాలరాతితో పునర్నిర్మించారు.  సన్నగా, పొడుగ్గా వున్న ఈ మందిరం అందంగా,  ప్రశాంతంగా వున్నది.  మందిరంలోకి వెళ్ళగానే మొదట్లో చిన్న గుంటలావుండి అందులో రెండు శివలింగాలుంటాయి.  ధర్శనం చేసుకుని ముందుకు వెళ్తే గర్భగుడిలో చిమలేశ్వర్ మహాదేవ్, అమ్మవార్ల విగ్రహాలు, చిన్న శివలింగం దర్శనమిస్తాయి.

తారాదేవి కాళీదేవి మందిరం

 

అక్కడనుంచి ఇంకొంచెం ముందుకు సాగితే పాండేఘాట్లో తారాదేవి కాళీదేవి మందిర్ అనే బోర్డు చూసి లోపలకెళ్ళాం.  ఎఱ్ఱని రంగు గోడలతో 350 ఏళ్ళ క్రితం నిర్మించబడ్డ దేవాలయం ఇది.  బెంగాల్ నెటోర్ రాణి రాణీ భవానీ దేవి కట్టించారు.  వీరివి ఇంకా చాలా ఛారిటబుల్ ట్రస్టులున్నాయి.


రామ్ గులాలేశ్వర్ మహదేవ్ ఆలయం

 

 

తర్వాత రామ్ గులాలేశ్వర్ మహదేవ్ ఆలయం  గుడి చిన్నదయినా జేగురు రంగుతో అందంగా వున్నది.  పెద్ద శివ లింగం.  మేము వెళ్ళేసరికి చీకటి  పడుతోంది.  ఆలయ నిర్మాతల పేర్లు వగైరా లోపల బోర్డులున్నాయిటగానీ చీకట్లో కనిపించలేదు.  ఆలయం ముందు బోర్డు బెంగాలీలో వుంది.  పక్క షాపులో వ్యాపారి ఈ మాత్రం వివరాలు ఇచ్చారు.

ఈ ఆలయానికి ఎదురుగానే కరివెనవారి సత్రం.  అక్కడ తెలిసినవారిని పలకరించటానికి మా పిన్ని వెళ్ళి వచ్చే లోపల ఆలయం బయట అరుగు మీద కూర్చున్నాం.  నాకు సంతోషం కలిగించే విశేషం.  అక్కడ ఒక జంట పరిచయమయ్యారు.  వారు మాకన్నా ఎక్కువగా ఎన్నో యాత్రలు చేస్తున్నారు.  మాకూ ఆ అలవాటున్నదంటే అది చూశారా, ఇది చూశారా అంటూ ఎన్నో చెప్పారు..కొన్నింటి పేర్లుకూడా వినలేదు నేను.  ఎంత వెనకబడి వున్నానో అనిపించింది.

అక్కడనుండి నెమ్మదిగా కేదారేశ్వర్ ఆలయం చేరాం.  ఆలయం విశాలంగా, బాగుంటుంది.   ఇక్కడ ఘాట్ ని కేదార్ ఘాట్ అంటారు.  ఆలయం వెనుక గంగ ఒడ్డుకి వెళ్తే  ఆలయాన్ని ఆనుకుని వున్న ఉపాలయంలో పెద్ద శివలింగం హరిశ్చంద్ర ప్రతిష్ట అని చెప్తారు.  ఇక్కడనుంచి హరిశ్చంద్ర ఘాట్ లో (పక్కనే వున్నది) శవాలు కాలటం కనబడుతుంది.

కేదారేశ్వర్ మందిరంలో శివలింగం ఎత్తు తక్కువే. వెడల్పుగా కొంచం గగ్గులు గగ్గులుగా వుంటుంది.  చాలా మహత్తుగల స్వామి అంటారు.  అంతకు ముందే ఎవరో స్వామికి అన్నంతో అభిషేకం చేశారుట.  కొంచెం ముందు వస్తే చూసేవాళ్ళమే అనుకున్నాము.

పుణ్య క్షేత్రాలకి వెళ్ళినప్పుడు అమ్మవారికి పసుపు కుంకుమ, జాకెట్ బట్ట సమర్పిస్తూ వుంటాను.  అలాగే అక్కడా ఇస్తే అక్కడ వున్న ఒకావిడ దక్షిణ పెట్టమన్నది.  నేను అపోహ పడ్డాను.  వాళ్ళు ఎక్కువ దక్షిణ లాగటానికి అలా అడుగుతున్నారని, అవ్వన్నీ ఇస్తున్నాను కదా ఇంకా దక్షిణ ఎందుకు అన్నాను.  అక్కడి వారి విశ్వాసం .. దక్షిణ లేను పూజ పని చేయదని  ..  మీరు ఎంత పెడితే అంతే పెట్టండి కానీ దక్షిణ లేకుండా ఇవ్వ కూడదు అని తీసుకోలేదు.  నేను అంతకన్నా మొండిగా ఒక రూపాయి పెట్టిచ్చాను.  ఆవిడ మాట్లాడకుండా తీసుకుంది.  తర్వాత నేను పొరపాటు చేశానని బాధ పడ్డాను.  అందుకని మీరు ఒక విషయం గుర్తు పెట్టుకొండి.  కాశీలో మీరు ఎంత ఇచ్చినా వాళ్ళిదేమని అడగరు.  పుణ్య క్షేత్రం.  భగవంతుణ్ణి తలచుకుని దానం చెయ్యండి.

మేము దైవ దర్శనం చేసుకుని వచ్చేసరికి చిన్న కలకలం.  అక్కడ ఎవరో ఒకాయన చనిపోయాడు.  వెంటనే అక్కడనుంచి తీసుకెళ్ళారుట.  ఆలయంలోనే పోయాడని కొందరన్నారు.  ఎంత అదృష్టవంతుడో అనుకుంటున్నారు అక్కడివాళ్ళు.  మాకు సరైన సమాచారం తెలియలేదుగానీ ఆలయంలో అయితే శుధ్ధి వగైరాలు చెయ్యరా.  అక్కడైతే వారి మాటలు తప్పితే అలాంటి ఘటన జరిగిన సూచన కూడా ఏమీ లేదు.   ఏమో, కాశీని మహా శ్మశానం అని కూడా అంటారుట.  కొందరయితే అక్కడికెళ్ళొచ్చాక తీసుకెళ్ళిన వస్తువులన్నీ తడిపి, తల స్నానం చేస్తేగానీ ఇంట్లోకి రారుట.  ఎవరి అభిప్రాయాలు వారివి.


అంత దూరం నడిచి వచ్చామేమో, దర్శనమయ్యాక అక్కడనుంచి ఒక్క అడుగు కూడా వేసే ఓపిక లేక పోయింది.  నడిచీ నడిచీ అంత అలిసిపోయాము.  కొంచెం దూరం తప్పనిసరిగా కాళ్ళీడ్చుకుంటూ నడిచి ఎలాగో ఒక ఆటోలో వేరే  దోవలో సత్రం చేరాం.

 

-పి.యస్.యమ్. లక్ష్మి

 (తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)

 

 


More Kashi Yatra