సంపూర్ణ కార్తీక మహాపురాణము

ఇరువది మూడవ రోజు పారాయణము

 

 

పంచదశా 2ధ్యాయము:
   
వీరభద్రుని మూర్చతో వెఱ్ఱెత్తిపోయిన శివసేన పోలోమంటూ పరుగెత్తి పురహరుణ్ణి శరణు వేడింది. అభవుడయిన శివుడు అసలేమీ జరగనట్లుగానే చిరునవ్వు నవ్వుతూ తన నందివాహనా న్నదిష్టి౦చి రణభూమికి బయలుదేరాడు. అంతవరకూ భయకంపితు లైన సమస్త గణాలవాళ్ళూ కూడా __ శివ  సందర్శనంతో  ధైర్యవంతులై పునః యుద్దప్రవేశం చేశారు.  నందివాహానరూఢుడై వస్తూన్న ఆ శివుణ్ణి చూడగానే __ కార్తీక వ్రతస్థుణ్నిచూసి పారిపోయే పాపాలవలె __ రాక్షసులంతా పారిపోసాగారు. జలంధరుడు చండీశ్వరు డితో తలపడ్డాడు. శుంభనిశుంభ కాలన్మేశ్వముఖ, బాలాహక, ఖడ్గోరోమ, ప్రపండ, ఘస్మరాది రాక్షస నాయకులందరూ ఒక్కుమ్మడిగా యీశ్వరునితో తలపడ్డారు. సర్వే శ్వరుడైన శివుని వీరేపాటి? ఆయనొక గండ్రగొడ్డలితో ఖడ్గరోముడి శిరస్సును నరికేశాడు. బాలాహుకుడి తలను రెండు చెక్కలుగా చేసేసాడు. పాశప్రయోగంతో ఘస్మరుడి నేలకు పడగొట్టాడు. ఈ లోపల శివ వాహనమైన వ్ర్శషభం యొక్క శృంగ (కొమ్ముల) ఘతాలకి అనేకంమంది రాక్షసులు యమలోకానికి వెళ్ళిపోయారు. శివ ప్రతాపంతో చిల్లులు పడిపోయిన తన సేనాచక్రాన్ని చూసుకుంటూనే సుడులు తిరిగిపోయిన జలంధరుడు __ సరాసరి రుద్రుడనే తనతో యుద్దానికి పిలిచాడు. ఆహ్వాన సూచకంగా పది బలమైన బాణాలతో పశుపతిని గాయపరిచాడు. అయినా శివుని ముఖంలో చిరునవ్వు మాయలేదు.

 

 

Sampoorna Karthika Maha Purananamu 23rd Day Parayanam

 

ఆ మందహాసంతోనే జలంధరుడునీ, గుఱ్ఱాలనీ, రథాన్నీ, జెండానీ, ధనుస్సునీ నరికేశాడు. రథహీనుడైన రాక్షసుడు - ఒక గదను తీసుకుని గంగాధరుని మీదకు రాబోయాడు. శివుడా గదను తన బాణాలతో విరుగగొట్టేశాడు. నిరాయుధుడైన జలంధరుడు పిడికిలి బిగించి పినాకపాణిపై దూకబోయాడు - ఒకే ఒక్క బాణంతో వాడిని రెండు మైళ్ళ వెనుకకు పడేలా కొట్టాడు - ఉడురాట్ శిఖామణియైన శివుడు. అంతటితో జలంధరుడు, యీశ్వరుడు తనకంటే బలవంతుడని గుర్తించి సర్వ సమ్మోహనకరమైన గంధర్వ మాయను ప్రయోగించాడు. నాదమూర్తియైన నటరాజు మోహితుడయ్యాడు. గంధర్వ గానాలు, అప్సరో నాట్యాలు, దేవగణవాద్య ఘోషలతో ఆయన సమ్మోహితుడయిపోయాడు. ఆ మొహంతో ఆయన ధరించిన సమస్త ఆయుధాలు చేజారిపోయాయి. ఎప్పుడైతే మృడుడలా మోహితుడైపోయాడో ,తక్షణమే జలంధరుడు శుంభ - నిశుంభులిద్దరినీ యుద్ధంలో నిలబెట్టి తాను పార్వతీ ప్రలోభంలో శివ మందిరానికి బయలుదేరాడు. వెళ్ళేముందు - శివ స్వరూపాన్ని ఏకాగ్రంగా అవలోకించాడు. 'మాయ' తప్ప బలం పనికిరాదని గ్రహించిన జలంధరుడు పంచముఖాలతోనూ, పది చేతులతోనూ, జటలతోనూ, అచ్చం శివుడు ధరించిన ఆయుధాల వంటి ఆయుధాలతోనూ - ఒకానొక మాయా వృషభం మీద శివమందిరమైన పార్వతీదేవి అంతఃపురానికి బయలుదేరాడు.

 

Sampoorna Karthika Maha Purananamu 23rd Day Parayanam

 

 

అలా వస్తూ వున్న - మాయా జలంధరుడిని చూసి - అంతవరకూ పరదృష్టి గోచరం గాని పార్వతి - వాడి దృష్టి పథంలో పడింది. అందానికి మారుపేరైన ఆ పార్వతిని చూస్తూనే - జలంధరుడు వీర్యస్ఖలనం చేసుకున్నాడు. ఎప్పుడయితే వాడు వీర్యస్ఖలనం చేసుకున్నాడో - అప్పుడే వాడి మాయావిద్య నశించిపోయింది. వాడు రాక్షసుడనే విషయం పార్వతికి అర్ధమైపోయింది. అంతటితో ఆమె అంతర్హితయై మానస సరోవర తీరాన్ని చేరి విష్ణువును ధ్యానించింది. తక్షణమే ప్రత్యక్షమయ్యాడు. విష్ణువు, ప్రత్యక్షమయిన విష్ణువిలా చెప్పాడు, 'తల్లీ! పార్వతీ! - వాడు చూపించిన దారిలోనే నేను కూడా ప్రయాణించాల్సి వుంది. దిగులుపడకు. అని ఆమెకు ఓదార్చేడు. "నీ పాతివ్రత్య మహిమ వలన పశుపతి యెలా జయింపరానివాడో, అలాగే ఆ జలంధరుడి భార్య యొక్క పాతివ్రత్య మహిమ వలన వాడు కూడా జయించరానివాడుగా తయారయ్యాడు. వాడు నీపట్ల రాక్షసమాయను ప్రదర్శించినట్లే, నేను వాడి యిల్లాలి ముందు నా విష్ణుమాయను ప్రయోగిస్తాను" అని ధైర్యం చెప్పి రాక్షసలోకానికి బయల్దేరాడు విష్ణువు.పంచదశోధ్యాయ సమాప్తః (పదనైదవ అధ్యాయము సమాప్తము)

షోడశ్కోధ్యాయః 

 

 

Sampoorna Karthika Maha Purananamu 23rd Day Parayanam

 

ఆ విధంగా విష్ణువు బయలుదేరినది మొదలు - అక్కడ - ఆ రాక్షస రాజ్యంలో - జలంధరుని భార్యయైన బృందకు దుస్స్వప్నాలు కలుగసాగాయి. ఆమె కలలలో జలంధరుడు దున్నపోతు మీద యెక్కి తిరుగుతున్నట్లూ, దిగంబరుడయినట్లూ, వళ్ళంతా నూనె పూసుకుని తిరుగుతున్నట్లూ, నల్లని రంగు పువ్వులతో అలంకరించబడినట్లూ, పూర్తిగా ముండనం (గుండు) చేయించుకున్నట్లూ దక్షిణ దిక్కుగా ప్రయాణిస్తున్నట్లూ, తనతో సహా తమ పట్టణమంతా సముద్రంలో మునిగిపోతున్నట్లూ - కలలు వచ్చాయి. అంతలోనే మేల్కొనిన బృంద - ఉదయ సూర్యుణ్ణి దర్శించి, తను చూసినది కలేనని తెలుసుకొని అది అశుభమని తలపోసి - చింతించసాగింది. ఐనా అది మొదలామెకు మనశ్శాంతి లేకుండా పోయింది. అరిష్టాన్ని తలబోస్తూ అస్థిరమతియై నలుదెసలా మసలసాగింది. ఆ విధంగా ఒకానొకవేళ వన విహారం చేస్తూండగా సింహం వంటి ముఖాలు కలిగిన ఇద్దరు రాక్షసులు కనుపించారు. వారిని చూసి భీతాత్మురాలిన బృంద - వెనుదిరిగి పారిపోతూ - ఆ వనమందే శిష్య సమేతుడై వున్న ఒకానొక ముని యొక్క కంఠాన్ని చుట్టుకొని, "ఓ మునివర్యా! నన్ను రక్షించు నాకు నీవే శరణు" అని కేకలు వేయసాగింది.

 

 

Sampoorna Karthika Maha Purananamu 23rd Day Parayanam

అప్పుడా ముని - భయగ్రస్తయైన ఆమెనూ, ఆమెని వెన్నంటి వస్తూన్న రక్కసుల్నీ చూసి - ఒక్క హుంకార మాత్రం చేత ఆ రాక్షసులు పారిపోయేలా చేశాడు. అంతటితో ధైర్యం చేజిక్కిన బృంద ఆ మునికి దండవత్తుగా ప్రణమిల్లి "ఓ ఋషీంద్రా! ఈ గండం నుండి నన్ను కాపాడిన దయాళుడవు గనుక నేను నా సంశయాలను కొన్నిటిని నీ ముందుంచుతున్నాను. నా భర్తయైన జలంధరుండీశ్వరునితో యుద్ధానికి వెళ్ళాడు. అక్కడాయన పరిస్థితి యెలా వుందో దయచేసి నాకు తెలియజేయి" అని ప్రార్ధించింది. కరుణాకరమైన దృష్టులను ప్రసరిస్తూ ఆ బుషి ఆకాశం వంక చూశాడు. వెంటనే ఇద్దరు వానరుల వచ్చారు. ముని వారికి కనుబొమలతోనే కర్తవ్యాన్ని ఆజ్ఞాపించాడు. ఆ రెండు కోతులూ మళ్లా ఆకాశాని కెగిరి - అతి స్వల్ప కాలంలోనే - తెగ వేయబడిన జలంధరుడి చేతులనూ, మొండెమునూ, తలనూ తెచ్చి - వారి ముందుంచాయి. తన భర్త యొక్క ఖండితావయవాలను చూసి బృంద ఘొల్లుమని యేడ్చింది. అక్కడే వున్న బుషి పాదాలపై బడి - తన భర్తను బ్రతికించవలసినదిగా ప్రార్ధించింది.

 

 

Sampoorna Karthika Maha Purananamu 23rd Day Parayanam

 

అందుకా ముని నవ్వుతూ "శివోపహతులైన వాళ్ళని బ్రతికించడం యెవ్వరికీ సాధ్యం కాదు, అయినా నాకు నీ పట్ల ఏర్పడిన అవ్యాజమైన కరుణ వలన తప్పక బతికిస్తాను' అంటూనే అంతర్హితుడయ్యాడు. అతనలా మాయమైందే తడవుగా జలంధరుడి  అవయవాలన్నీ అతుక్కుని, అతడు సజీవుడయ్యాడు. ఖిన్నురాలై వున్న బృందను కౌగిలించుకుని, ఆమె ముఖాన్ని  పదే పదే  ముద్దాడాడు. పునర్జీవితుడైన భర్తపట్ల అనురాగంతో బృంద పులకరించి పోయింది. వారిద్దరూ ఆ వనంలోనే వివిధ రకాలుగా సురత క్రీడలలో మునిగిపోయారు. మరణించిన మనోహరుడు మరలా బ్రతికి వచ్చాడనే ఆనందంలో -  బృంద - వెంటనే గుర్తు పట్టలేక పోయినా - ఒకానోక సురత సుఖానంతరం ఆమె అతనిని విష్ణువుగా  గుర్తించి వేసింది. మగని వేషంలో వచ్చి తన పాతివ్రత్యాన్ని మంటగలిపిన ఆ మాధవునిపై విపరీతంగా ఆగ్రహించింది. 'ఓ  విష్ణుమూర్తీ! పరస్త్రీగామివై చరించిన నీ ప్రవర్తన నిందింపబడును గాక! నువ్వు భార్యా వియోగ దుఃఖితుడవై, నీ శిష్యుడైన ఆదిశేషునితో సహితుడవై అడవులలో, పడి తిరుగుతూ - వానర  సహాయమే గతియైన వాడివి ఆ గురువుగాక!' అని శపించి, తన నభిలషిస్తూ చేరువవుతూన్న శ్రీహరి నుండి తప్పుకుని, అగ్నిని కల్పించుకుని, అందులో పడి బూడిదై పోయింది. అందుకు చింతించిన విష్ణువు మాటి మాటికీ ఆ బృందనే స్మరింఛసాగాడు. నిలువునా కాలిపోయిన ఆమె  యొక్క చితాభస్మాన్ని తన తనువంతా పూనుకుని విలపింపసాగాడు. సిద్దులు, బుషులు -  ఎందరెన్ని విధాల చెప్పినా విష్ణువు శాంతిని పొందలేకపోయాడు. అశాంతితో అల్లాడిపోసాగాడు.

పదునైదవ, పదునారవ అధ్యాయములు:

 

Sampoorna Karthika Maha Purananamu 23rd Day Parayanam

 

23 వ రోజు

నిషిద్ధములు :- ఉసిరి, తులసి

దానములు :- మంగళ ద్రవ్యాలు

పూజించాల్సిన దైవము :- అష్టమాతృకలు

జపించాల్సిన మంత్రము :- ఓం శ్రీమాత్రే నమః , అష్టమాతృ కాయ స్వాహా

ఫలితము :- మాతృరక్షణం, 


ఇరువదిమూడవ(బహుళ అష్టమి) రోజు పారాయణము సమాప్తము

 


More Kartika Maha Puranam