కార్తీక‌మాసంలో ద‌క్షిణామూర్తిని పూజిస్తే ఏం జ‌రుగుతుందో తెలుసా?

 

 

కార్తీక‌మాసంలో ఎలాంటి పూజ‌లు, వ్రతాలు చేసినా చేయ‌క‌పోయినా.... శివుడిని మాత్రం త‌ప్పకుండా గుర్తుచేసుకోవాల‌ని చెబుతారు పెద్ద‌లు.  ఈ మాసంలో శివుడిని ద‌క్షిణామూర్తి రూపంలో ఆరాధిస్తే, జీవితంలో ఎలాంటి లోటూ రాదంటారు. ఇంత‌కీ కార్తీక‌మాసానికీ శివుడికీ ఏమిటి సంబంధం ఏమిటో.. ద‌క్షిణామూర్తి విశిష్ఠ‌త ఏమిటో తెలుసుకుందాం!

 

కార్తీక‌మాసంలో చ‌లి ఒక్క‌సారిగా పెరిగిపోతుంది. రాత్రుల నిడివి పెరిగిపోతుంది. చ‌లి మృత్యువుకీ, చీక‌టి అజ్ఞానానికీ చిహ్నం. అంతేకాదు అటు చ‌లీ, ఇటు చీక‌టీ మ‌నిషి మ‌న‌సు మీద కూడా ప్ర‌భావం చూపుతాయి. మ‌న‌లో తామ‌స‌గుణం పెరిగిపోతుంది. ఆలోచ‌న‌ల తీరు మారిపోతుంది. ఇలాంటి స‌మ‌యంలోనే మ‌న‌కు గురువు అవ‌స‌రం. అయితే ప్ర‌తి ఒక్క‌రికీ భౌతికంగా ఒక స‌ద్గురువు అందుబాటులో ఉండే అదృష్టం ఉండ‌క‌పోవ‌చ్చు. అందుకే శివుని ఆదిగురువుగా భావించి ఆయ‌న‌లోని గురుస్వ‌రూప‌మైన ద‌క్షిణామూర్తిగా పూజించుకుంటాము.

 

శివుడిని ఆదిగురువుగా కొలుచుకోవ‌డం వెనుక ఒక ఆంత‌ర్యం లేక‌పోలేదు. బ్ర‌హ్మ ఈ జ‌గ‌త్తుని సృష్టించ‌డం మొద‌లుపెట్టిన‌ప్పుడు, త‌న‌కి తోడుగా ఉండేందుకు స‌న‌క‌, స‌నంద‌న‌, స‌న‌త్సుజాత‌, స‌న‌త్కుమారులను సృష్టించాడు. వారు పెళ్లిళ్లు చేసుకొని, ఈ సృష్టిని కొన‌సాగించాల‌ని కోరుకున్నాడు. కానీ వారంతా సంసారం ప‌ట్ల విర‌క్తులై బ్ర‌హ్మ‌జ్ఞానం కోసం ప‌రిత‌పించారు. ఆ జ్ఞానాన్ని అందించ‌గ‌ల‌వారి కోసం తిరుగుతూ ఉండ‌గా, శివుడు మాత్ర‌మే బ్ర‌హ్మ‌జ్ఞానాన్ని అందించ‌గ‌ల స‌మ‌ర్థుడు అని తెలుసుకున్నారు. ఆయ‌న ఎదురుగా కూర్చుని కేవ‌లం ఆయ‌న మౌనం ద్వారానే త‌మ‌కు కావ‌ల్పిన జ్ఞానాన్ని పొంద‌గ‌లిగారు.

 

త‌న‌కంటూ ఎలాంటి గురువూ లేనివాడు, త‌నను ధ్యానించినంత‌మాత్రానే మ‌న‌సులో ఉన్న అజ్ఞానాన్నంతా ప‌టాపంచ‌లు చేసేవాడు కాబ‌ట్టి... శివుడిని ఆదిగురువుగా భావిస్తారు. స‌న‌క‌స‌నందాదుల‌కే కాకుండా స‌ప్త‌ర్షుల‌కు కూడా ఆయ‌న జ్ఞానాన్ని ప్ర‌సాదించిన‌ట్లు చెబుతారు. మ‌రి అలాంటి గురువు మ‌న‌లాంటి స‌మాన్యుల‌ని క‌రుణించ‌కుండా ఉంటారా! అందుకే కార్తీక‌మాస సంద‌ర్భంలో అయినా ఆయ‌న‌ను త‌ప్ప‌కుండా పూజించుకోవాలి. పైగా కార్తీక‌మాసం, కార్తికేయుని కూడా ఇష్ట‌మైన మాసం. శివుని కుమారుడైన కార్తికేయుడు కూడా గొప్ప జ్ఞానానికి అధిప‌తే. కాబ‌ట్టి ఆ నెల‌లో ద‌క్షిణామూర్తిని క‌నుక పూజిస్తే, ఆ తండ్రీకొడుకుల అనుగ్ర‌హం త‌ప్ప‌కుండా క‌లుగుతుంది.

 

మ‌రి ఇంత ప్ర‌త్యేక‌మైన ద‌క్షిణామూర్తిని ఆరాధించ‌డం ఎలా! శివుడు ద‌క్షిణానికి అభిముఖంగా, అంటే ఉత్త‌రంలో కూర్చుని ఉంటార‌ని పురాణాలు చెబుతున్నాయి. ద‌క్షిణం య‌మ‌స్థానం. ఆ య‌మ‌స్థానాన్ని ధిక్క‌రిస్తున్న‌ట్లుగా స్వామి కూర్చుని ఉంటారు. య‌మ‌స్థానం మృత్యువుని మాత్ర‌మే కాదు, అజ్ఞానాన్ని కూడా సూచిస్తుంది. పైగా ద‌క్షిణం అంటే దిగువ ప్రాంతం. అది దిగ‌జారుడుత‌నాన్ని సూచిస్తుంది. ఉత్త‌రం అభివృద్ధికి చిహ్నం. ద‌క్షిణామూర్తి భంగిమ వెనుక ఇన్ని విశేషాలు ఉన్నాయ‌న్న‌మాట‌. అలాంటి ద‌క్షిణామూర్తి ప‌టాన్ని ఉత్త‌రం వైపు నిలిపి, మ‌న‌సులో ఆయ‌న రూపాన్ని నింపుకొని, ద‌క్షిణామూర్తి స్తోత్రాన్ని క‌నుక ప‌ఠిస్తే... అకాల మృత్యువు, అనారోగ్యం, అజ్ఞానం, అవ‌మానాలు, అప్పులు.... అన్నీ ప‌టాపంచ‌లైపోతాయి.    

- నిర్జ‌ర‌.


More Karthikamasa Vaibhavam