ప్రజారంజక పాలనను ప్రజలకు పరిచయం చేసిన నాటి గాధలు ఉన్నాయి
రామరాజ్యపు ఆనవాళ్లుగా కదలాడుతున్న భౌతిక ఆధారాలు ఉన్నాయి
వేలాది సంవత్సరాల క్రితమే సుపరిపాలన సాగించిన రామకథలో చారిత్రక కోణాలెన్నో
రామపాదం మోపిన ప్రాంతాల యవనికపై వాస్తవిక దృక్పథాన్ని ఆవిష్కరించే  అద్భుతాలు ఎన్నో
అవే రామాయణపు ఆనావాళ్లుగా మన కండ్లముందు కనిపిస్తున్నాయి

వేలాది సంవత్సరాలు ప్రజారంజకంగా పరిపాలన చేసి రామరాజ్యం స్థాపించిన శ్రీరాముడి ఔనత్యాన్నిచాటే చారిత్రక ప్రదేశాలు వాస్తవిక అంశాలుగా కనిపిస్తున్నాయి. రామాయణంలోని అనేక సంఘటనలకు కేరాఫ్ గా నేపాల్ నుంచి శ్రీలంక వరకు ఎన్నో చారిత్రాత్మక ప్రాంతాలు నేటికి చెక్కుచెదరక ఉన్నాయి. రాామాయణం కల్పన కాదు వాస్తవం అని నిరూపిస్తున్నాయి. జగదభిరాముడు శ్రీరాముని జననంతో పాటు సీతామాతతో పరిణయం నుంచి రావణ సంహారం వరకు రామాయణంలోని ప్రతి ఘటనకు, సంఘటనకు సాక్షీభూతాలుగా అనేక నగరాలు, భవనాలు, కొండలు, కోటలు, వంతెనలు దర్శమనిస్తున్నాయి. వానరుల చేత కట్టబడిన లంకా వారధి రామసేతు ఆనవాళ్లను నాసా కూడా ధృవీకరించింది. ఆధునిక విజ్ఞానానికి అంతచిక్కని ఎన్నో అద్భుతాలు కండ్లముందు కనిపిస్తుంటే రామాయణం నిజమే అని ప్రతి ఒక్కరూ ఒప్పుకుని తీరాల్సిందే..

శతాబ్ధాల నిరీక్షణకు, దశాబ్దాల పోరాటానికి ఫలితంగా రామజన్మభూమిలో శ్రీరాముడి ఆలయనిర్మాణానికి అంకురార్పణ జరిగింది. రాముడు జన్మించిన అయోధ్యలో  తిరిగి రామనామం ప్రతిధ్వనించబోతుంది. యుగపురుషుడు తిరుగాడిన నేల హిందువులకు పవిత్ర క్షేత్రంగా విరాజిల్లనుంది. రామయ్య బాల్యం ఎక్కువగా ఇక్కడే గడిచిందని, 14ఏండ్ల వనవాసం తర్వాత అయోధ్యరాజధానిగా కోలస రాజ్యాన్ని పరిపాలించాడని రామాయణం చెప్తోంది.

రాముడు మా వాడు అంటూ నేపాల్ రాజు చేసిన ప్రకటన వివాదస్పదమైంది. చారిత్రక ఆధారాలను బట్టి చూస్తే జానకీమాత తండ్రి జనక మహారాజు పరిపాలన చేసిన మిధిలానగరం ప్రస్తుతం జనకపూర్ గా పిలువబడుతుంది. ఈ నగరం నేపాల్ లో ఉంది. అక్కడ సీతామందిరం అత్యంత అద్భుతనిర్మాణం. ఈ నగరంలోని రాజ్యమందిరంలోనే నిండుసభలో రాముడు శివ ధనస్సు విరిచి జానకీమాతను పరిణయమాడారు. అందుకు గుర్తుగా నిర్మించిన సీతారామ పరిణయ మండపం నేటికి చెక్కుచెదరకుండా దర్శనమిస్తోంది. అంతేకాదు ఆనాటి శివధనస్సు ఆనవాలు కూడా అక్కడ లభించాయట. విరిగిన ధనస్సులోని కింద భాగం పాతాళంలోకి చొచ్చుకుపోయి గంగ బయట పడిందని చెప్తారు. ఆ ప్రదేశాన్ని గంగా సాగర్ అని పిలుస్తారు. ధనస్సు పై భాగం రామేశ్వరం దగ్గర ధనుష్కోటి లో,  మధ్యభాగం నేపాల్ లోని ధనుషా ధామ్ లోనూ పడ్డాయని స్థానికుల కథనం. నేపాల్ రాజు ప్రకటనను కాస్త సవరించి రాముడు మా దేశ అల్లుడే అంటే బాగుండేదేమో అని కొందరు చమత్కరిస్తున్నారు.

తండ్రి దశరథ మహారాజు కోరిక మేరకు 14 ఏండ్ల వనవాసానికి అయోధ్య నుంచి సీతాసమేత శ్రీరాముడు, లక్ష్మణుడితో కలిసి బయలుదేరుతారు. వారిని  శృంగబేరిపురం వద్ద  గంగానదిని దాటించడానికి మత్య్సకారుడు గుహుడు సహాయం చేశాడన్నకథ అయోధ్యకాండలో కనిపిస్తుంది. శృంగబేరిపురం ఉత్తర ప్రదేశ్ లో ఉంది. రాముడు గుహుడుని గుండెలకు హత్తుకున్నసంఘటన ఇక్కడనే జరిగింది.

ఛత్తీస్ ఘడ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఉత్తరాంధ్రలో విస్తరించి ఉన్న దట్టమైన అడవి ప్రాంతాన్ని ఈ నాటికీ దండకారణ్యం పేరుతోనే మనం పిలుస్తున్నాం. ఈ అరణ్యం మీదుగా సీతారాముడు, లక్ష్మణుడు వనవాసానికి వచ్చారని రామాయణంలో ఉంది. మహారాష్ట్రలోని నాసిక్ వద్ద ఉన్న పంచవటీ ప్రాంతం రామాయణం కథను మలుపు తిప్పిన ఒక ప్రధాన సంఘటనకు వేదిక. రావణుడి చెల్లెలు శూర్పణక లక్ష్మణుడిని ఇక్కడే చూసిందట. ఆమె ముక్కుచెవులు కోసిన ప్రాంతం కావడంతో నాసిక్ అన్న పేరు వచ్చిందంటారు. పెద్దపెద్ద వటవృక్షాలతో ఉండే ఈ ప్రాంతంలోనే సీతారామలక్ష్మణులు ఉండేవారట. మాయలేడి రూపంలో రావణాసురుడు  సీతామాత అపహరించిన ప్రాంతం కూడా ఇదే. ఇక్కడ సీతా గుహలు నేటికి దర్శనమిస్తాయి.

సీతను వెతుకుంటూ వెళ్లిన రాముడికి వానరుల రాజ్యం కనిపిస్తుందట. అదే కిష్కింద. కర్ణాటకలో ఈ ప్రాంతం ఇప్పటికీ ఉంది. హనుమంతుడిని రాముడు కలిసాడు అని చెప్పబడే రుష్యముఖ పర్వతం కర్ణాటకలో ఉంది.  పంపా సరోవర్ ప్రాంతంలోనే మహాభక్తురాలు శబరి మాత  రాముడికి ఎంగిలి పండ్లు ఇచ్చిందట. ఈ ప్రాంతం కర్ణాటకలోనే ఉంది. అలాగే తమిళనాడులోని పోతిగాయ్ హిల్స్ పై  అగస్త్య మహామునిని రాముడు కలిసాడని చెప్తారు.  రావణుడు సీతామాతను అపహరించి తీసుకువెళ్ళుతుంటే అడ్డుకున్న జటాయువు రెక్కలను రావణుడు కరవాలంతో నరుకుతాడు. రెక్కలు తెగిన జటాయువు ఇక్కడే నేలకు ఒరిగిందని.. రాముడి రాకకోసం నిరీక్షించి సీతామాత ఆనవాళ్లు రాముడికి చెప్పిందని అరణ్యకాండ వివరిస్తుంది. అందుకు సాక్ష్యంగా కేరళలోని  జటాయు హిల్స్ ను చెప్పవచ్చు. వానరసైన్యాన్ని సిద్ధం చేసుకుని లంకలు బయలుదేరేముందు రాముడు దర్శించుకున్నాడు అని చెప్పబడే శివాలయం రామేశ్వరం, తమిళనాడులో ఉంది. రామేశ్వరంలోని ధనుస్కోటి నుంచి శ్రీలంకకు నిర్మించిన రామసేతు నేటికి సముద్రగర్భంలో చెక్కుచెదరకుండా  ఆధునిక ఇంజనీర్లను,  శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. నాసా తీసిన చిత్రంలోనూ రామసేతు నిర్మాణం కనిపించడం రామాయణం నిజమే అని చెప్పడానికి దృఢమైన సాక్ష్యం.

ఇక రావణుడి రాజ్యమైన శ్రీలంకలో అనేక అద్భుతమైన కోటలు ఉన్నాయి. వాటిలో సిగిరియా కోటను రావణుడి ఆంతరంగిక మందిరంగా చెప్తారు. సీతమ్మ తల్లిని బంధించిన అశోక వాటిక, అక్కడ హనుమంతుడి జాడలు నేటికి చూడవచ్చు. శ్రీలంకలోని అశోకవాటికలో  సీతామాత మందిరం నేటికి భక్తులను అలరిస్తోంది. రామరావణ యుద్ధం జరిగిన ప్రదేశంగా చెప్పబడే పర్వతప్రాంతాన్ని రామబోడ, రావణబోడ పర్వతాలుగా అక్కడి ప్రజలు పిలుస్తారు. రామరావణ యుద్ధంలో లక్ష్మణుడు మూర్ఛపోగా హనుమంతుడు సంజీవిని పర్వతాన్ని తీసుకువచ్చిన సంఘటన రామాయణంలోని యుద్ధకాండలో కనిపిస్తుంది. అందుకు సాక్ష్యంగా డోలుకాండ సంజీవిని పర్వతం శ్రీలంకలో కనిపిస్తుంది. ఈ పర్వతశ్రేణుల్లో ఎలాంటి వ్యాధులనైనా నయం చేసే ఔషధమొక్కలు ఉన్నాయని అక్కడి ప్రజలు నమ్మకం. రావణ సంహారం తర్వాత విభూషణుడికి పట్టాభిషేకం చేసిన ప్రాంతంగా చెప్పబడే  కేలానియా రాజా మహా విహారా కూడా శ్రీలంకలోనే ఉంది.

ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణలోని భద్రాచలంలో, పర్ణశాల ప్రాంతంలో సీతమ్మ ఆరేసిన వస్త్రాల ఆనవాలు ఇప్పటికీ కనిపిస్తాయి. ఆంధ్రప్రదేశ్ లోని కడపజిల్లాలో ఒంటిమిట్ట ప్రాంతం సీతమ్మ దాహాన్నితీర్చడానికి రాముడు తన బాణంతో పాతాళగంగను పైకి రప్పించారట. ఇక్కడ ఉన్న కోదండ రామాలయంలోని ఒకే శిలలో శ్రీరామున్ని సీతను లక్ష్మణుని చూడవచ్చు. అంతేకాదు ఇక్కడ ఉన్న శ్రీరామ తీర్ధం రామబాణంతో ఉబికి వచ్చిన గంగమ్మగా చెప్తారు.
రాముడు నిజం.. రామాయణం వాస్తవం అని చెప్పడానికి ఎన్నో మరెన్నో సాక్ష్యాలు సజీవంగా ఉన్నాయి.

అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తి అయిన తర్వాత కేంద్రప్రభుత్వం శ్రీరాముడు నడయాడిన ప్రాంతాలన్నింటికీ ప్రత్యేక పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలన్న డిమాండ్ రామభక్తుల నుంచి వస్తుంది. ఈ ప్రాంతాన్నింటినీ కలుపుతూ స్పెషల్ రామాయణ టూర్ ఏర్పాటుచేస్తే రామాయణంలోని ప్రధాన సంఘటనలు జరిగిన ప్రాంతాలను చూసి తరించాలన్న తపన రామభక్తుల్లో కనిపిస్తోంది.


More Purana Patralu - Mythological Stories