నుదుట కుంకుమ ఉంటే

నట్టింట లక్ష్మీదేవి ఉన్నట్టే

Importance of Kumkum

 

కుంకుమ బొట్టును లక్ష్మీదేవిగా భావిస్తారు. ముఖాన సిందూరం ఉంటే దృష్టి సోకదని, రోజంతా సాఫీగా సాగిపోతుందని చెప్తారు. నుదుట తిలకం లేకపోతే ముఖం కళ తప్పి బోసిగా ఉండటమే కాదు, మంచిది కాదని పండితులు ఉద్బోధించారు. కనుక కుంకుమ కేవలం సౌందర్య చిహ్నం కాదని, నర దృషి సోకకుండా ఉంటుందని అంటారు.

 

కుంకుమ లేదా తిలకం ఎర్రగా ఉంటుంది. ఎరుపు సూర్యునికి సంకేతం. నుదుట ధరించే సిందూరం సూర్యుని వేడిమి తాకకుండా చేస్తుంది. ఇంకా సూక్ష్మంగా ఆలోచిస్తే, శరీరంలోని అన్ని నాడులనూ కలుపుతూ, మెదడుకు సంకేతస్థానమై, ఎప్పుడూ చైతన్యంగా ఉండే అతి కీలకమైన "సుషుమ్న" నాడి ఉండేది లలాటం మీదనే. దాన్నే "జ్ఞాననేత్రం" అంటారు. ఈ జ్ఞాననేత్రానికి ఇతరుల దృష్టి సోకకుండా, సూర్యతాపం దానిమీద పడకుండా చేసేందుకు సిందూరం పెట్టుకునే ఆచారం జనించింది. అంటే రక్త ప్రసరణ వల్ల, ఆలోచనల వెల్లువ వల్ల కలిగే వేడి జ్ఞాననేత్రానికి తగలకుండా అది సురక్షితంగా ఉండేందుకు గానూ ఎప్పుడూ కుంకుమ ధరించి ఉండాలి అన్నారు.

 

స్త్రీలే ఎందుకు సిందూరం ధరించాలి అనే సందేహం కలగడం సహజం. ఆది నుండి ఇప్పటివరకూ పురుషుల ఆధిక్యతే (Male dominated society) నడుస్తోంది కదా! కనుక ఏ రకంగా నైనా స్త్రీలే ఎక్కువగా వత్తిడికి గురౌతారు. పురుషుల కళ్ళే స్త్రీలమీద పడతాయి, పురుషులే స్త్రీలను లోబరచుకోవాలని చూస్తారు. కనుక మగవారి దృష్టి పడకుండా, ఏ రకమైన వత్తిడికి గురవకుండా ఉండేందుకు మహిళలు నుదుట కుంకుమ ధరిస్తారు.

 

ప్రపంచంలో ఏ మారుమూల కనిపించినా హిందూ స్త్రీలను ఇట్టే గుర్తుపట్టేయోచ్చు. అలా అందరిలో విభిన్నంగా చూపుతూ, గుర్తింపును, గౌరవాన్ని పట్టి ఇచ్చేది "కట్టు - బొట్టు". అవును హిందూ స్త్రీలు నుదుట ధరించే కుంకుమ బొట్టు వారిని ఇతరుల నుండి ప్రత్యేకంగా నిలబెడుతుంది. సిందూరం ముఖానికి అందాన్ని ఇవ్వడమే కాకుండా కోట్లాదిమందిలో ప్రత్యేకంగా నిలుపుతుంది. కుంకుమ బొట్టు భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిఫలిస్తుంది. పుట్టిన పసిపాప మొదలు వృద్ధ స్త్రీల వరకూ ఆడవాళ్ళకి నుదుట తిలకం ఉంటుంది.

 

ఇతర ఏ దేశాల్లోనూ ముఖాన తిలకంబొట్టు పెట్టుకునే ఆచారం లేదు. ఈ సంప్రదాయం మనదేశంలో మాత్రమే ఉంది. భారత స్త్రీలు స్నానం చేసినప్పుడు ముఖాన సిందూరం పెట్టుకుని, ఇక ఆ బొట్టు రోజంతా ఉండేలా జాగ్రత్త పడతారు. చెమట పట్టి, లేదా ఇతర ఏ కారణం చేతనైనా నుదుట కుంకుమ చెరిగిపోతే, వెంటనే అప్రమత్తమై తిరిగి ముఖాన బొట్టు పెట్టుకుంటారు.

 

ముఖాన సిందూరం లేకపోతే అశుభం అని, నుదుట కుంకుమ ధరించిన స్త్రీలకి సౌభాగ్యం కలుగుతుందని అంటారు. పెళ్ళిళ్ళు, పేరంటాలు లాంటి శుభకార్యాలకు కుంకుమ బొట్టు పెట్టి ఆహ్వానించడం ఆచారంగా, ఆనవాయితీగా వస్తోంది. ఏ శుభ కార్యానికైనా సిందూరం నాంది. కుంకుమతో ఆహ్వానించడాన్ని శుభ సూచకంగా భావిస్తారు. ఇంట్లో ఏ శుభం జరిగినా గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు తీర్చిదిద్దుతారు. పెళ్ళిళ్ళు తదితర శుభ లేఖలకు పసుపు కుంకుమలు అద్దుతారు.

 

ఇంటికి బంధుమిత్రులు ఎవరైనా అతిథులుగా వస్తే, వారిని సాగనంపేటప్పుడు తమ శక్తికొద్దీ బట్టలు పెట్టడం లాంటి ఆచారాలు ఉన్నాయి. ఏమీ ఇవ్వలేని వారు కూడా చిటికెడు కుంకుమ పెడతారు. నిజానికి ఆ చిటికెడు కుంకుమ కోటి సంపదలతో సమానం. కుంకుమ బొట్టు లక్ష్మీదేవి కదా! కనుక నుదుట బొట్టు పెడితే సుసంపన్నంగా ఉండమని ఆశీర్వదించినట్లుగా తలచి సంతోషిస్తారు.

 

ఖరీదైన దుస్తులు లేకపోవచ్చు.. కానీ చిటికెడు కుంకుమ లేని ఇళ్ళు ఉండవు. ఆ కుంకుమే అమూల్యమైంది. అపూర్వ కళను తెచ్చిపెడుతుంది.

 

sindoor or kumkum brings prosperity, kumkum on forehead, indian tradition kumkum or sindoor, kumkum is lakshmidevi, sindoor in marriages, women and kumkum, sushumna nadi and gnana netram


More Enduku-Emiti