‘నంది’ని తప్పుకోమన్న శివభక్తుడు- నందనార్‌

 

 

హిందూమతం అనగానే ఉన్నతమైన ఆధ్మాత్మిక భావనలతో పాటుగా అందులోని కులాల కుమ్ములాటలూ గుర్తుకువస్తాయి. అంతులేని ఆచారాలూ స్పృహలోకి వస్తాయి. వీటిని దాటుకుని భగవంతుడు అందరివాడు అన్న విషయాన్ని రుజువుచేసిన ప్రయత్నమే భక్తి ఉద్యమం! పరమాత్మ పట్ల అనురక్తి ఉంటే మనసే దేవాలయం అని నిరూపించిన సాధనమే భక్తి ఉద్యమం! వైష్ణవ భక్తులైన ఆళ్వారులు, శివభక్తులైన నయనార్లు భక్తి ఉద్యమంలో కీలక పాత్రను పోషించారు. అలాంటి నయనార్లలో ఒకరైన నందనార్‌ గురించే ఇప్పెడు మనం చెప్పుకొంటున్నాది. 63మంది నయనార్లలో ఈ నందనారును 18వ శివభక్తునిగా భావిస్తారు. నయనార్లు అన్నికులాల నుంచీ వచ్చినప్పటికీ దళిత నేపథ్యం నుంచి వచ్చిన ఏకైక శివభక్తుడు ఈ నందనార్‌! నందనార్‌ ఎప్పటివాడు అనేందుకు స్పష్టమైన ఆధారాలు లేవు. కానీ ఏడు లేక ఎనిమిది శతాబ్దానికి చెందినవాడు అని చరిత్రకారుల ఊహ.

 


నందనార్‌ చోళరాజ్యంలో భాగమైన అదనూర్ అనే ప్రాంతంలో నివసించేవాడట. డోలు వంటి తోలు వాయిద్యాలను తయారుచేసే వృత్తితో జీవనం సాగించేవాడు. అతని వృత్తి ఏదైనా ప్రవృత్తి మాత్రం నిరంతరం శివుని చుట్టూనే తిరుగుతూ ఉండేది. అప్పట్లో ఆలయాలలోకి దళితులకు ప్రవేశం లేదుకాబట్టి, ఆలయం వెలుపలే నిలబడి శివుని స్తుతించేవాడట నందనార్‌. అలా ఒకసారి తిరుపున్కుర్లోని శివలోకనాథర్‌ ఆలయానికి చేరుకున్నాడు నందనార్‌. అక్కడ ఆలయం వెలుపల నిలబడి శివుని మనసారా దర్శించుకుందామంటే పాపం శివుని ఎదురుగా ఉండే నందీశ్వరుడు అడ్డువచ్చాడు. నందనార్ అవస్థని గమనించిన ఆ పరమేశ్వరుడు నందిని పక్కకి తప్పుకోమని ఆజ్ఞాపించాడట. దాంతో నంది విగ్రహం పక్కకి తప్పుకుందని చెబుతారు. అప్పటి ఘటనకు సాక్ష్యంగా ఇప్పటికీ శివలోకనాథర్‌ ఆలయంలోని నంది విగ్రహం, శివునికి అభిముఖంగా కాకుండా కాస్త పక్కకి తొలగి కనిపిస్తుంది. ఇదే ఆలయంలో నందనార్‌ స్వామివారి కోసం ఒక పుష్కరణిని తవ్వాలనుకున్నాడట. అంతటి పని ఒక్క మనిషితో సాధ్యమవుతుందా? అందుకు సాక్షాత్తూ ఆ శివపుత్రుడైన వినాయకుడు నందనారుకి సాయపడ్డాడని ఆలయ చరిత్రలో పేర్కొన్నారు.

 


ఒకపక్క నందనార్‌ శివభక్తి ప్రాచుర్యం పొందుతున్నా, మరోపక్క కులాలకు అతీతంగా గాఢమవుతున్న అతని శివానురక్తి పలువురికి కంటగింపుగా మారసాగింది. అప్పట్లో ప్రతి కులం వారూ తమదైన దైవాన్ని కొలుచుకునేవారు. హరిహరులను అగ్రవర్ణాలవారే కొలుచుకోవాలనీ, నిమ్నజాతివారు తమవైన గ్రామదేవతలను కొలుచుకోవాలనీ పట్టుదలగా ఉండేవారు. దాంతో శివుని పట్ల నందనార్‌ భక్తిప్రపత్తులు ఇటు స్వజాతివారినీ, అటు అగ్రవర్ణాల వారినీ అగ్రహపరిచాయి. నందనారుని ప్రముఖ శైవక్షేత్రమైన చిదంబరంలోకి ప్రవేశించేందుకు అనుమతినివ్వలేదు. ఇటు నందనార్‌ యజమాని కూడా ఆయన చిదంబరం వెళ్లకుండా అడ్డుకునేందుకు ఒక అసాధ్యమైన పనిని అప్పగించాడు. రాత్రికి రాత్రే తన పొలాన్ని సాగుచేసి, కోతలుకోసి వెళ్లాల్సిందే అని షరతు పెట్టాడు. అసాధ్యమైన ఆ షరతు సాధ్యమయ్యేందుకు సాక్షాత్తూ శివుని గణాలే రంగంలోకి దిగాయట. ఉదయం లేని తన పొలాన్ని చూసుకున్న యజమానికి నందనార్ మహిమ తెలిసి వచ్చింది. తన తప్పుని మన్నించమని వేడుకుంటూ... నందనార్‌ను చిదంబరానికి సాగనంపాడు.

 


నందనార్‌ చిదంబరానికి చేరుకున్నాడే కానీ మరి పట్నంలోకి ప్రవేశం ఎలా! అందుకని నందనార్‌ భక్తిని చిదంబరంలోని సనాతనవాదులకు తెలియచేసేందుకు ఆయనను అగ్నిలోంచి నడవమని ఆజ్ఞాపించాడట పరమేశ్వరుడు. అలా నందనార్‌ అగ్నితో పునీతమై తన భక్తికి కులాలే కాదు ప్రకృతి కూడా తలవంచాల్సిందే అని నిరూపించుకున్నాడు. నందనార్‌ని కేవలం ఒక శివభక్తునిగానే కాకుండా, కులాల అడ్డుగోడలను ధిక్కరించి భగవంతుని చేరుకున్న ధీరునిగా కూడా గుర్తిస్తారు. అందుకే అంబేడ్కర్‌, గాంధివంటి వారు సైతం నందనారు గురించి తమ ప్రసంగాలలో ప్రముఖంగా పేర్కొన్నారు.

 

 

- నిర్జర.


More Vyasalu