మన దేశంలోని ఏ మూలకి వెళ్లినా ఆశ్చర్యాన్ని కలిగించే గాథలు వినిపించక మానవు. వాటికి సాక్ష్యంగా చిత్రమైన కట్టడాలు కనిపించక మానవు. అలాంటి అద్భుతమే ఉనాకోటి. దేశంలో ఓ మూలకి ఉన్నట్లుండే త్రిపుర రాష్ట్రంలోని అగర్తలాకు 170 కిలోమీటర్ల దూరంలో ఉనాకోటి ఉంది. ఇంతకీ ఆ ప్రాంతం వెనక గాథేమిటంటే...

 

ఉనాకోటి అంటే స్థానిక భాషలో ఒకటి తక్కువ కోటి అని అర్థం. ఇక్కడ ఉన్న కొండ మీద ఒకటి తక్కువ కోటి దేవతామూర్తులు కనిపించడంతో ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది. ఈ శిల్పాలను బహుశా 7 లేక 8వ శతాబ్దంలో చెక్కి ఉంటారని ఓ అంచనా! కానీ వీటి వెనక ఉన్న సందర్భం మాత్రం అస్పష్టం. ఆ మాట అంటే స్థానికులు ఒప్పుకోరు. వారి దృష్టిలో ఈ శిల్పాల వెనక ఓ అద్భుతమైన నేపథ్యం ఉంది.

 

ఒకానొకప్పుడు పరమేశ్వరుడు కొందరు దేవతలతో కలిసి కాశీకి బయల్దేరాడు. శివునితో కలుపుకొని వారందరూ కోటిమంది ఉన్నారు. అలా కాశీకి వెళ్తూ వారంతా ఉనాకోటి సమీపంలోని కైలాశహర్‌ అనే ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ రాత్రంతా విశ్రమిద్దామనీ, సూర్యోదయానికి ముందే నిద్రలేచి కాశీయాత్రను సాగిద్దామనీ శివుడు తెలిపాడు. దానికి దేవతలంతా అంగీకరించారు కూడా! కానీ ఉదయం బారెడు పొద్దెక్కినా శివుడు తప్ప మరెవ్వరూ నిద్ర లేవలేదు. దాంతో కోపగించుకున్న పరమేశ్వరుడు... వారంతా రాతిరూపంలో అక్కడే ఉండిపోవుగాక అని శపించాడట. అప్పటి నుంచీ ఆ దేవతలందరూ రాతిరూపంలో కొండమీదే ఉండిపోయారని నమ్ముతారు.

 

 

ఇక ఇంతే అద్భుతంగా తోచే మరో కథ కూడా బహుశ ప్రచారంలో ఉంది. దీని ప్రకారం ఇక్కడ కల్లు కుమార్‌ అనే శిల్పి ఉండేవాడు. అతనికి కైలాసానికి వెళ్లి శివపార్వతుల చెంతనే ఉండాలని మహా ఆశగా ఉండేది. కానీ అది సాధ్యమయ్యే పని కాదు కదా! అయినా కూడా పట్టువిడవలేదు కల్లు కుమార్. ఓసారి శివపార్వతులు తన ఇంటి ముందర నుంచి వెళ్తుండగా వారికి తన కోరికను తెలియచేశాడు. దాంతో అతన్ని ఎలాగైనా తప్పించుకునేందుకు పార్వతీదేవి ఒక షరతుని విధించింది. తెల్లవారేలోగా ఆ ఊరి చివర ఉన్న ఉనాకోటి కొండ మీద కోటి శిల్పాలను చెక్కితే, తమతో పాటుగా కైలాసంలో నివాసం ఉండే ఆవకాశం లభిస్తుందన్నదే ఆ షరతు. తెలతెలవారుతుండగా కల్లుకుమార్‌ తన లక్ష్యానికి చేరువ కాసాగాడు. దాంతో అతనిలో తన నైపుణ్యం మీద అహంకారం జనించింది. ఆ అహంకారంలో అతను దేవతా శిల్పం బదులుగా, తన ఆకృతిని పోలిన శిల్పాన్నే చెక్కాడు. ఇంకేముంది! నిబంధన కాస్తా నీరుగారిపోయింది.

 


ఉనాకోటిలో లెక్కకు మించిన మూర్తులు ఉన్నప్పటికీ ముఖ్యదైవం మాత్రం అక్కడి కాలభైరవుడే! దీంతోపాటుగా వినాయకుని విగ్రహం కూడా పర్యటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. చుట్టూ పచ్చని చెట్లు, గలగలా పారే జలపాతాలు, కనువిందు చేసే భారీ శిల్పాలు... ఇలా ఎటుచూసినా ఉనాకోటి ఓ భిన్నమైన భక్తి ప్రపంచాన్ని తలపిస్తుంటుంది. అందుకనే వ్యయప్రయాసలకు ఓర్చి సుదూర ప్రాంతాల నుంచి వేలాదిమంది భక్తులు ఇక్కడకు చేరుకుంటూ ఉంటారు. చైత్ర మాసంలో వచ్చే అశోకాష్టమి, జనవరిలో వచ్చే మకరసంక్రాంతి సందర్బాలలో ఈ ప్రాంతమంతా జాతరలా మారిపోతుంది.

 

- నిర్జర.


More Mysteries - Miracles