గురుపూర్ణిమ చేసుకునే పద్ధతి...

 

 

ప్రతి పండుగకీ ఏదో ఒక సంప్రదాయం ఉంటుంది. ఫలానా దేవుని పూజించాలి, ఫలానా రీతిలో పూజించాలి అన్న ఆచారం ఉంటుంది. కానీ గురుపౌర్ణమి అలా కాదు! గురుసమానులైనవారికి కృతజ్ఞత చెప్పుకోవడమే ఈ పండుగ ముఖ్య ఉద్దేశం కాబట్టి వేర్వేరు రూపాలలో ఈ పండుగ సాగుతుంది.


గురుపౌర్ణమి వ్యాసభగవానుని జన్మదినం కాబట్టి ఆశ్రమాలలో వ్యాసపూజను నిర్వహిస్తారు. ఇందుకోసం 15 మంది ఆచార్యులను మూడు బృందాలుగా కూర్చోపెట్టి పూజిస్తారు. మొదటి బృందంలోనివారిని ‘కృష్ణ పంచకం’ అని పిలుస్తారు. కృష్ణుడు ఆయనకు నాలుగు దిక్కులా ఉన్న నలుగురు ముఖ్యశిష్యులకీ ఈ అయిదుగురినీ ప్రతిరూపంగా భావిస్తారు. అలాగే రెండో బృందాన్ని వ్యాస పంచకం అనీ, మూడో బృందంలోని అయిదుగురినీ శంకరాచార్య పంచకం అనీ పిలుస్తారు.


ఇంట్లోనే గురుపౌర్ణమి పూజ చేసుకోవాలనుకునేవారు విష్ణువు, శివుడు, దత్తాత్రేయులలో ఎవరినైనా పూజించవచ్చు. వ్యాసుడు సాక్షాత్తూ విష్ణుస్వరూపుడు. అందుకే విష్ణుసహస్రనామంలో ‘వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే’ అని కనిపిస్తుంది. జ్ఞానాన్ని పరిరక్షించేందుకు విష్ణుమూర్తే ప్రతి యుగంలో వ్యాసునిగా అవతరిస్తాడని చెబుతారు. అందుకే విష్ణురూపాన్ని పూజిస్తూ విష్ణుసహస్రనామాన్ని జపిస్తూ ఈ రోజు గడపవచ్చు.


ఇక శివుని ఆదిగురువుగా భావిస్తారు కనుక ఆయనను కూడా పూజించవచ్చు. శివుడు తన జ్ఞానాన్ని తొలుత సప్తరుషులకు అందించారట. అలా శివుడే గురుశిష్యపరంపరకు నాందిపలికారని చెబుతారు. ఆ సమయంలో శివుడు దక్షిణాభిముఖంగా కూర్చుని ఉపదేశం చేశాడట. అందుకే శివుని జ్ఞానస్వరూపానికి దక్షిణామూర్తి అని పేరు. గురుపౌర్ణమి రోజున శివుని దక్షిణామూర్తిస్తోత్రంతో ఆరాధిస్తే అజ్ఞానం తొలగిపోతుందని నమ్ముతారు.


అటు విష్ణువుకీ, ఇటు శివునికీ ప్రతిరూపం కనుక దత్తాత్రేయుని ఆరాధించడమూ కనిపిస్తుంది. పైగా దత్తాత్రేయుడు ఎప్పటికప్పుడు గురురూపంలో అవతరిస్తూ ఉంటాడని నమ్మకం. అందుకే దత్తాత్రేయుని, ఆయన అవతార పరంపరను పరమగురువులుగా ఎంచి పూజిస్తూ ఉంటారు. శ్రీపాదవల్లభ, స్వామి సమర్థ, నృసింహ స్వామి వంటి దత్త అవతారాలని పూజిస్తారు. షిరిడీ సాయిబాబాని కూడా దత్తాత్రేయుని రూపంగా భావిస్తారు కాబట్టి ఈ రోజున సాయినామాన్ని జపించడం, సత్చరిత్ర పారాయణం చేయడం వల్ల బాబా ప్రసన్నులవుతారని నమ్ముతారు.


గురువంటే అజ్ఞానాన్ని దూరం చేసే దైవస్వరూపం! అందుకే వ్యాసభగవానుడు జ్ఞానాన్ని అందించే ప్రతి వ్యక్తిలోనూ తాను ఉంటానని చెప్పారు. కాబట్టి ఈ రోజున గురువులు, ఉపాధ్యాయులు, పండితులు... ఇలా జ్ఞానానికి ప్రతిరూపాలైన ప్రతి ఒక్కరినీ ఆరాధించుకోవచ్చు. వారికి పాదపూజ చేసి, వస్త్రాభరణాలను కానుకగా ఇచ్చి తమ కృతజ్ఞతను ప్రకటించవచ్చు. గురుపౌర్ణమి కృతజ్ఞతను సూచించే పండుగ కాబట్టి ఈ రోజున ఉపవాసం ఉండాలని కానీ, జాగరణ చేయాలని కానీ, ఫలానా నైవేద్యాన్నే అందించాలని కానీ ఖచ్చితమైన నియమాలు లేవు. గురువు పట్ల శ్రద్ధే ఈ రోజు ఉన్న ఏకైక నియమం!

 

- నిర్జర.


More Guru Purnima