అదే అసలైన హిందుత్వం..!

 

 

ఆస్తికులు దైవత్వం అనే మాటను ఉపయోగిస్తే , నాస్తికులు మానవత్వం అనే మాటను తరచూ ప్రయోగిస్తూ వుంటారు. అయితే, ఇవి రెండు విరుద్ధ పదాలు కావు. ఒకదానినుండి, మరొకటిని వేరుచేయలేని, అవిభాజ్య పదాలవి. దైవత్వం పొందటానికి, మానవత్వమే పునాది రాయి అంటారు శ్రీ స్వామి పరిపూర్ణానంద. యెంత సత్యమైన పలుకులు ఇవి. మానవత్వం పరిపూర్ణంగా వెల్లివిరియటమే దైవత్వం కాదూ. 

మనుషులూ, కనపడ్డ రాయినీ, రప్పనీ, చెట్టునీ, పుట్టనీ పూజిస్తూ ఉంటాడు, అల్లాంటిది, సాటి మనిషిని పూజించటం, ఎందుకు చెయ్యలేడు అంటే దీనికి కారణం మనిషి లో వుండే   నేను అనే  అహంకార పూరిత భావన. ఈ అహం, తానూ అందరికన్నా   ఉచ్చ స్థితిలో ఉన్నాననే భావం. అది విడిచి , సాటి మనిషి లో దైవాన్ని చూడాలన్న  ఆలోచనకు అద్దం పట్టేది హిందుత్వం లోని విగ్రహారాధన.

చరాచర జగత్తు అంతా, ప్రక్రుతి అంతా, పరమేశ్వరుని తో నిండినదే. మరి అలాంటి పరమేశ్వరుని కే ఒక రూపం ఇస్తే, ఆ రూపం తోటి మానవుడి లాగానే, కళ్ళు, ముక్కు చెవులు, కాళ్ళు, చేతులు కల్గిన నిండైన విగ్రహమైతే, అదే భగవంతుని రూపం గా ఆరాధిస్తాం.  సాటి మనిషి రూపం లోను, దైవత్వం చూడగలిగిన నాడు, మానవత్వం మన మత మైన నాడు, సమస్త ప్రపంచం దేవలోకం అవుతుంది. ప్రతి మనిషి దేవుడే అవుతాడు.

ఒక విగ్రహం లోనికి భగవంతుని ఆవాహన చేసి, పాదాలను పూజించి, పుష్పాలను అర్పించే , సాష్టాంగ పడే మనం  , సాటి మనిషి ని గుండెలకు హత్తుకోవడానికి ఎందుకు   సంకోచిస్తున్నాం? ఒక రాయి లోకి భగవంతుని  ఆవహించి మంత్రాలు జపించే మనం, నిండైన మనిషి లో దైవాన్ని చూసే లా మనసుల  ను ఎందుకు   సిద్ధం చేసుకోలేకపోతున్నాం? అంటే సమాధానం, మన అహంకారం.

ఫలానా మనిషిని నేను, ఫలానా  జాతి, మతము, కులం నావి అంటూ, హుంకరించే మనం అసుర ప్రవ్రుత్తి  తో జీవించే మనుషులం కాక మరేమిటి? భగవంతుని సృష్టి లోని అద్భుతం మానవుడైతే, ఆ మానవుడు భగవంతుని స్వరూపుడే అనుకోవడం  ఆధ్యాత్మికత. అలాంటి ఆధ్యాత్మికత ను  ఊతంగా చేసుకుంటే, సాటి వారి లో దేవుణ్ణి చూడగలిగితే అదే దైవత్వం. ఇలా మానవత్వమే, దైవత్వం అని నమ్మటమే హిందూత్వం.

-Bhavana

 


More Vyasalu