దుర్యోధనుడి భార్య గురించి విన్నారా?


నిలువెత్తు అహంకారం, అధికారం కోసం ఎంతకైనా తెగించే తత్వం, ఆస్తి కోసం బంధువులని చంపే క్రూరత్వం... ఇలాంటి లక్షణాలు ఇప్పుడు చాలామందిలోనే కనిపిస్తున్నాయి. కానీ మనుషులు ఇలా కూడా ఉంటారు అనేందుకు వేలసంవత్సరాల క్రితమే రుజువు కనిపిస్తుంది. ఆ పాత్రే దుర్యోధనుడు. దుర్యోధనుడు రంగం మీద ఉంటే, కథంతా అతని చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అందుకనే దుర్యోధనుడి భార్య గురించి చాలా తక్కువ వివరాలే కనిపిస్తాయి.

పాంచాల దేశ రాజకుమారి ద్రౌపది స్వయంవరానికి వెళ్లి, అక్కడ అర్జునుడి ముందు ఓడిపోతాడు దుర్యోధనుడు. ఆ ఓటమిని తల్చుకుని కుమిలిపోతుండగా కళింగ రాజు కుమార్తె భానుమతి స్వయంవరం జరగనున్న విషయం తెలుస్తుంది. దాంతో తన ప్రియనేస్తం కర్ణునితో కలిసి ఆ స్వయంవరానికి చేరుకుంటాడు. స్వయంవరంలో పాల్గొనేందుకు శశిపాలుడు, జరాసంధుడు, రుక్మి వంటి మహామహులెందరో వచ్చి ఉంటారు.

స్వయంవరం ఆరంభమవుతుంది. తన చెలికత్తెలతో కలిసి సభలోకి ప్రవేశిస్తుంది భానుమతి. ఆమె పక్కనున్న చెలురు ఒకొక్క రాజకుమారుడి గురించీ వర్ణిస్తూ ఉండగా, వారిని పరికిస్తూ ముందుకు సాగుతుంటుంది. దుర్యోధనుడి వంతు వచ్చేసరికి అతణ్ని కూడా చూసీ చూడనట్లుగా ముందుకు సాగిపోతుంది. ఆ చర్యతో దుర్యోధనుడి అహంకారం దెబ్బతింటుంది. ఆ తిరస్కారాన్ని భరించలేకపోతాడు. వెంటనే భానుమతిని అమాంతంగా ఎత్తుకుని హస్తిన వైపు బయల్దేరతాడు. దుర్యోధనుడిని అడ్డుకునేందుకు వచ్చిన రాజకుమారులని ఓడించే బాధ్యత కర్ణుడు తీసుకుంటాడు.

అలా భానుమతిని బలవంతంగా హస్తినకు తీసుకువచ్చి, అక్కడ ఆమెను వివాహం చేసుకుంటాడు దుర్యోధనుడు. ఇదేమిటంటూ ప్రశ్నించినవారిని ‘ఒకప్పుడు తాత భీష్ముడు కూడా కాశిరాజు కుమార్తెలైన అంబ, అంబిక, అంబాలికలను ఇలాగే ఎత్తుకువచ్చాడు కదా!’ అంటూ నోరుమూయిస్తాడు. కొన్ని కథనాల ప్రకారం స్వయంవరం కోసం దర్బారులోకి ప్రవేశించిన భానుమతి కర్ణుడిని చూసీచూడగానే అతని మీద మనసు పారేసుకుంటుంది. అతడినే వరించాలని అనుకుంటుంది. కానీ దురదృష్టవశాత్తూ ఆమె దుర్యోధనుడికి నచ్చడంతో ఆమె కోరిక నెరవేరకుండా పోతుంది.

భానుమతి, దుర్యోధనులకు ఇద్దరు సంతానం. కూతురు లక్షణ, కొడుకు లక్ష్మణ కుమారుడు. వీరి గురించి కూడా మనకు తెలిసింది తక్కువే! కృష్ణుని కుమారుడైన సాంబుడు లక్ష్మణను చేసుకున్నాడన్న విషయం మాత్రమే ప్రచారంలో ఉంది. తెలుగునాట మాత్రం లక్ష్మణకుమారుడి గురించి కొన్ని గాథలు ప్రచారంలో ఉన్నాయి. బలరాముడి కుమార్తె శశిరేఖను, లక్ష్మణకుమారుడికి ఇచ్చి కట్టపెట్టాలని పెద్దలు నిర్ణయించుకుంటారు. కానీ ఆ పాటికే శశిరేఖ, అర్జునుడి కుమారుడైన అభిమన్యుని ప్రేమిస్తుంది. దాంతో అభిమన్యుడు, ఘటోత్కచుని సాయంతో పెద్దలు తలపెట్టిన పెళ్లిన చెడగొట్టి శశిరేఖను వివాహం చేసుకుంటాడు. ‘శశిరేఖా పరిణయం’ పేరుతో వినిపించే ఈ కథ తెలుగువారికే సొంతం. తర్వాత కురుక్షేత్ర సంగ్రామంలో లక్ష్మణకుమారుడిని, అభిమన్యుడు సంహరిస్తాడు.

- నిర్జర.


More Purana Patralu - Mythological Stories