దుర్గేశ్వరి మందిరం లేక గుప్త కామాఖ్య.. అసోం

 


పురాతన కాలంనుంచీ అసోంలోని శాక్తేయులకు  ప్రధాన పూజా స్ధలం  గుప్త కామాఖ్య.  ఈ ఆలయం గౌహతికి ఉత్తర దిశలో కొండ మీద వున్నది. ఈ పర్వతాన్ని సీతాచల్ అంటారు.  కొండమీది ఆలయాన్ని చేరుకోవాలంటే 172 మెట్లు ఎక్కాలి.  మెట్లు ఎత్తు తక్కువగానే వుంటాయి. చుట్టూ చెట్లతో వాతావరణం ప్రశాంతంగా వుంటుంది.  సమయం వున్నవారు కొంత సేపు గడపటానికి చక్కని ప్రదేశం. కొండ ఎక్కేటప్పుడు దోవ పక్కన కొండ రాళ్ళమీద చెక్కిన వినాయకుడు, దుర్గ, ఇంకా ఇతర విగ్రహాలు కనబడతాయి.

 

దీనిని గుప్త కామాఖ్య అంటారు.  గౌహతిలో నీలాచల్ మీద వున్న కామాఖ్యాదేవిని వ్యక్త కామాఖ్య అని అంటారు.  అంతేకాదు .. ఈ ఆలయం 51 శక్తి పీఠాలలో ఒకటి.  అమ్మవారి కుడి తొడ ఇక్కడ పడింది అంటారు. ఆలయం గురించి అక్కడి పూజారి శ్రీ బినయ్ భక్తాచార్ జీ విశదీకరించారు.  అందులో ఆ ఆలయం గురించి మా తెలుగువారికి  తెలియబరుస్తానంటే శ్రధ్ధగా వివరాలు చెప్పారు.  ఆ వివరాలే మీతో పంచుకుంటున్నాను.

 


అస్సాంలోనే కాక భారత దేశంలోనే ప్రసిధ్ధ ఆలయం ఇది.  అమ్మవారు చాలా మహిమగల తల్లి. జోగినీ తంత్రం ప్రకారం దుర్గేశ్వరీ దృష్ట్యా సర్వకామ ఫలం.. అమ్మవారిని భక్తితో దర్శించి ప్రదక్షిణ చేస్తే జీవితాంతం సంతోషంగా వుంటారు. మార్కండేయ మహర్షి ఇక్కడ తపస్సు చేశారు.  మహర్షి తపస్సుకి మెచ్చిన దుర్గామాత ప్రత్యక్షమయి ఆయనని అన్ని యుగాలలోనూ అమరుడు కమ్మని ఆశీర్వదించింది. మార్కండేయ మహర్షి మార్కండేయ పురాణం ఇక్కడే రచించారు. ఆలయం ముందు వున్న చెట్లని బజ్రనలీ చెట్లంటారు. వాటి నూనె వంటకూ, ఔషధాల తయారీలో పనికి వస్తుంది అని చెప్పారు.

 

ఆలయంలోకి వెళ్ళటానికి ముందే ఒక మండపంలో అమ్మవారి పాదాలు, దానికి ముందు సింహం పాదాల గుర్తులూ వున్నాయి.  ఇక్కడ తాంత్రిక సాధన కూడా ఎక్కువే.  హిమాలయాలనుంచి చాలామంది సాధువులు ఇక్కడికొచ్చి సాధన చేస్తారు. అహం రాజు శివసింఘా 1659 లో ఇక్కడికొచ్చారు. పశ్చిమ బెంగాల్ నదియా, శాంతిపూర్ గ్రామంనుంచి  హల్ రామ్ ని తీసుకువచ్చి దుర్గేశ్వరీ మాత పూజా విధులకోసం పండితులుగా నియమించారు. అప్పటినుంచి వారి వంశంవారే ఆలయంలో పూజా విధులు నిర్వహిస్తున్నారు. సాయంత్ర 5-30 నుంచి 6 గం.లదాకా హారతి ఇస్తారు.  రోజూ  హారతి ఇచ్చిన తర్వాత ఒక పులి  కొండపైనుంచి వచ్చి ఇక్కడంతా తిరిగి మళ్ళీ పైకి వెళ్తుందట.  ఆ సమయంలో ఆలయ ప్రవేశ ద్వారం మూసి వేస్తారు.

 

ఆలయంలోకి ప్రవేశించాక అమ్మవారి దర్శనంకోసం ఇరవై మెట్లు కిందకి దిగాలి.  గర్భాలయంలో ఎడమవైపు వినాయకుడు 3 విగ్రహాలున్నాయి.  పక్కనే దుర్గామాత, సరస్వతి నిగ్రహాలు చిన్నవి వున్నాయి.  వాటి పక్కన దుర్గాదేవి పీఠం.  అంటే అమ్మ తొడ పడిన స్ధలం.  అక్కడ విగ్రహమేమీ వుండదు.  ఒక అడుగు లోతు, కొంచెం పేద్దు గుంటలాగా (మన మోరీ) వుంటుంది.  ఆ స్ధలానికే పూజ చేస్తారు.  అక్కడే భక్తులు తమ కోరికలను అమ్మకి విన్నవించుకుంటారు.  తర్వాత కాళీ పీఠం. కాళికాదేవి విగ్రహం, ప్రక్కన గుంటలో శివలింగం వుంటాయి.

 

గర్భాలయంలో విద్యుత్ దీపాలుండవు.  నిత్యం చేసే దీపారాధనలతోబాటు అఖండ దీపం ఎంతో కాలంనుంచి వెలుగుతూ వుంది.  వాటి వెలుతురులోనే దేవతా దర్శనం.  పూజారిగారు ప్రత్యేకించి వివరిస్తూ చూపించారుగనుక అంత వివరంగా చూడగలిగాము. గుప్తసాధనకి ఇది చక్కని ప్రదేశం అని, అనేకమంది వచ్చి ఇక్కడ సాధన చేస్తారని చెప్పారాయన.  ఈ ఆలయం గురించి కాళికా పురాణం, జోగినీ తంత్ర, దేవీ పురాణం, మార్కండేయ పురాణం, తంత్రసారం వగైరా గ్రంధాలలో పేర్కొనబడింది. అమ్మవారిని బాగేశ్వరి, చండి అని కూడా అంటారు.   ఈ తల్లిని పూజించి, పూర్వం రాజులు యుధ్ధాలలో విజయం సాధించారు.

ఉత్సవాలు:
ఇక్కడ దేవీ నవరాత్రులు అట్టహాసంగా జరుగుతాయి.  ఆ సమయంలో జంతు బలి, ముఖ్యంగా దున్నపోతులని బలి ఇస్తారు.


అస్సాం ఏన్షియంట్ మాన్యుమెంట్స్ అండ్ రికార్డ్స్ యాక్ట్ 1959 కింద దీనిని రక్షిత ప్రదేశంగా ప్రకటించారు.

ఇక్కడి పూజారిగారి పేరు
Sri Binoy Bhakto Charjy
cell Mo.  09854994785

 


పి.యస్.యమ్. లక్ష్మి
(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)


More Purana Patralu - Mythological Stories