హనుమంతుని ఆరాధించిన మత్స్య కన్య

 

 

భారతీయ చరిత్రలో రామాయణం ఒక మర్చిపోలేని అధ్యాయం. దానిని అక్షరబద్ధం చేసిన వాల్మీకి ఆదికవిగా నిలిచిపోయాడు. కానీ ఆ రామాయణం కేవలం మన దేశ సరిహద్దులలోనే ఆగిపోలేదు. రాముని గుణగణాలు, లక్ష్మణుని వినయం, రావణాసురుని అహంకారం, సీతమ్మ తల్లి ఓరిమి, హనుమంతుని స్వామిభక్తి.... ఇవన్నీ ప్రపంచంలోని ప్రతి మనిషినీ కదిలించేవే. అందుకే వాల్మీకి రామాయణం ఆధారంగా వందలాది రామాయణాలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే వాటిలోకి స్థానిక కవుల కల్పనలూ, అక్కడి జానపద గాధలు కూడా చొచ్చుకుపోయాయి. అలా వాల్మీకి రాసిన మూల రామాయణంలో కనిపించని పాత్రలు కూడా కొన్ని చేరిపోయాయి. వాటిలో ఒక ముఖ్యపాత్రే సువర్ణమచ్ఛ! ధాయలాండ్, కంబోడియా వంటి దేశాల రామాయణంలో ఈ సువర్ణమచ్ఛ పాత్ర చాలా ప్రముఖంగా కనిపిస్తుంది.

 

హనుమంతులవారు సీతమ్మ తల్లి జాడ కనుగొని, రాముడికి సమాచారాన్ని అందిస్తారు. రావణాసురుని చెరలో సీతమ్మ ఉందని స్పష్టమైన తరువాత, లంకకు చేరుకునేందుకు సముద్రం మీద వారధిని నిర్మించమని రాములవారు ఆజ్ఞాపిస్తారు. రాముని ఆజ్ఞ మేరకు వానరులంతా సముద్రం మీద రాళ్లని వేస్తూ ఉంటారు. కానీ అదేం చిత్రమో! రాత్రి వేసిన రాళ్లు పొద్దుటికల్లా కనిపించకుండా పోతుండేవి. దాంతో ఈ విషయాన్ని హనుమంతునికి విన్నవిస్తారు వానరులు.

 

 

రాళ్లు మాయం కావడం వెనుక ఉన్న రహస్యాన్ని తెలుసుకొనేందుకు హనుమంతులవారు బయల్దేరతారు. అలా సముద్రంలో ఈదుతూ నలుదిశలా పరిశీలిస్తున్న ఆంజనేయునికి ఒక మత్స్యకన్యల గుంపు కనిపిస్తుంది. వారందరి చేతా రాళ్లని తీయించివేస్తున్న ఒక నాయకురాలూ తటస్థపడుతుంది. బంగారువర్ణంలో మెరిసిపోతున్న ఆ మత్స్యకన్యని వెంబడించేందుకు వాయుపుత్రుడు చేసిన ప్రయత్నాలన్నీ వృధా అయిపోతాయి. కానీ నిదానంగా ఆ మత్స్యకన్య,హనుమంతుని చూసి మోహిస్తుంది. తానే హనుమంతుని దగ్గరకు చేరుకుంటుంది.

 

తన దగ్గరకి వచ్చిన మత్స్య కన్యను చూసిన హనుమంతుడు, ఆమె రాళ్లను మాయం చేయడం వెనుక ఉన్న కారణాన్ని అడుగుతాడు. తాను రావణాసురుని కుమార్తెననీ, ఆయన ఆజ్ఞమేరకు ఇలా వారధిని నిర్మించే ప్రయత్నాన్ని అడ్డుకొంటున్నాననీ చెప్పుకొస్తుంది మత్స్యకన్య. కానీ తాము రావణాసురుని మీద ఎందుకు యుద్ధం చేయాలనుకుంటున్నామో హనుమంతుడు వివరించేసరికి, ఆమె మనసు మారిపోతుంది. సీతమ్మ తల్లిని రక్షించుకునేందుకు జరుగుతున్న ప్రయత్నాలను ఇక మీదట అడ్డుకోమని చెబుతుంది. మత్స్యకన్య, ఆంజనేయుడు అక్కడి నుంచి విడిపోయినా... హనుమంతుని తేజస్సుతో ఆమె ఒక బిడ్డకు జన్మనిస్తుంది.

 

 

హనుమంతుని అభిమానానికి పాత్రురాలైన సువర్ణమచ్ఛను అదృష్టానికి ప్రతిరూపంగా భావిస్తారు. చైనాలో లాఫింగ్‌ బుద్ధా ప్రతిమలను ఎలాగైతే ఉంచుకుంటారో, ధాయ్‌లాండ్‌లో సువర్ణమచ్ఛ ప్రతిరూపాలు ఇంటింటా కనిపిస్తాయి. సువర్ణమచ్ఛ రూపం వారి సంస్కృతిలోనూ, కళలలోనూ భాగంగా నిలిచిపోయింది.

 

 

- నిర్జర.

 


More Hanuman