ఇక్కడ స్త్రీలను దుర్గాదేవిగా పూజిస్తారు

 


ఈ అనంత ప్రకృతిలోని స్త్రీశక్తికి ప్రతిరూపంగా మనం దుర్గాదేవిని భావిస్తాము. ఆ దేవిని కొలుచుకునేందుకు శరన్నవరాత్రులను నిర్వహిస్తాము. కానీ కేరళలోని ఒక గుడిలో దుర్గాదేవిని కొలవడమే కాదు... ఆ దుర్గకు ప్రతీకగా స్త్రీలకు కూడా పూజలను నిర్వహిస్తారు. ఇలాంటి విశేషాలు ఎన్నో కలిగిన ఆ ఆలయమే అలప్పుజా జిల్లాలో ఉన్న ‘చక్కులత్తుకవు’ అమ్మవారి ఆలయం.

శుంభ నిశుంభులనే రాక్షసులను సంహరించేందుకు అమ్మవారు దుర్గాదేవిగా అవతరించిన విషయం తెలిసిందే! ఆ దుర్గాదేవే ఇక్కడి పంపానదీ తీరాన చక్కులత్తుకవు అమ్మవారిగా వెలిసిందని నమ్ముతారు. ఈ అమ్మవారు చాలా శక్తిమంతమైనదనీ... ఆమె ముందు ఎలాంటి కోరికను ఉంచినా చిటికెలో నెరవేరుతుందనీ భక్తుల నమ్మకం. అందుకే కేరళ నలుమూలల నుంచీ భక్తులు ఈ ఆలయానికి పోటెత్తుతారు.

 

 

ప్రతిమాసంలోనూ వచ్చే తొలి శుక్రవారాన్ని అమ్మవారికి మరింత విశిష్టంగా భావిస్తారు. మద్యం, గంజాయి లాంటి వ్యసనాల నుంచి తప్పించుకోలేని వ్యక్తులను ఈ తొలి శుక్రవారం రోజున ఆలయానికి తీసుకువస్తారు. వ్యసనాన్ని మానేస్తామంటూ వారి చేత శపథం చేయిస్తారు. ఆ రోజున వారికి ఆలయ నిర్వాహకులు ‘ఔషధ వెల్లం’ అనే ఓ ప్రత్యేకమైన తీర్థాన్ని అందిస్తారు. అనేక ఔషధాలతో చేసిన ఈ తీర్థాన్ని అమ్మవారి ముందు ఉంచగానే... సదరు తీర్థానికి అద్భుతమైన ప్రభావం లభిస్తుందట. ఆ తీర్థాన్ని తాగిన భక్తులు తమ వ్యసనం నుంచి ఇట్టే దూరమైపోతారట.

 

 

ఈ ఆలయంలో జరిగే నారీపూజది మరో విశేషం. ఆ సందర్భంగా స్త్రీలను సాక్షాత్తు ఆ అమ్మవారిగా భావించి ఆమెకు పాదపూజ చేస్తారు. ఈ కార్యక్రమంలో పాలుపంచుకునేందుకు వేలాదిమంది ఆడవారు వచ్చేస్తారు. ఇక డిసెంబరులో జరిగే ‘పొంగలా’ ఉత్సవానిది మరో ప్రత్యేకత. చాలా ఏళ్ల క్రితం ఒక వేటగాడి కుటుంబం ఉండేదట. పగలంతా అడవిలో గడిపే ఆ వేటగాడు... సాయంవేళకి ఇంటికి చేరుకుని ఆహారాన్ని వండుకుని అమ్మవారికి నివేదించేవాడు.

ఒక రోజున అడవిలో తిరుగుతున్న వేటగాడు సమయం మించిపోతున్న విషయాన్ని గ్రహించలేకపోయాడు. సాయంవేళకి చీకట్లు ముసురుకోవడంతో... ఆ వేళ అమ్మవారికి ఆహారాన్ని నివేదించలేకపోయానే అని బాధతో క్రుంగిపోయాడు. ఆ బాధతో అతను ఇంటికి చేరుకోగానే... అక్కడ ఆహారపదార్థాలన్నీ సిద్ధంగా ఉండటం కనిపించింది. ‘నా భక్తులైన మీ కోసం నేనే స్వయంగా ఈ ఆహారాన్ని వండాను’ అన్న అమ్మవారి మాటలూ వినిపించాయి. ఆ సంఘటనను గుర్తుచేసుకుంటూ ఏటా భక్తులు అమ్మవారి ఆలయం ముందు పొంగలి వండి ఆమెకు సమర్పిస్తూ వస్తున్నారు. ‘పొంగలా’ సందర్భంగా పొంగలి వండేందుకు కూర్చునే స్త్రీల వరుస కొన్ని కిలోమీటర్ల దూరం వరకూ ఉంటుందట. ఆలయపూజారి గుడిలోంచి అందించే పవిత్రాగ్నితో ఆడవారు ఒకరికొకరు అందించుకుంటూ ఈ పొంగలి వంటకాన్ని వండుతారు. ఆ సమయంలో ఆకాశంలో ఒక గద్ద తిరుగుతుండటాన్ని కూడా గమనించవచ్చునట.

ఇన్ని విశేషాలు ఉన్నాయి కాబట్టే ఈ అమ్మవారిని అసంఖ్యాకంగా భక్తులు వస్తుంటారు. అయ్యప్పస్వామిలాగానే ఈ అమ్మవారి కోసం కూడా ఇరుముడి కట్టి 12 రోజుల పాటు నిష్టగా ఓ దీక్షని పాటిస్తుంటారు.         


- నిర్జర.
 


More Durga Devi