అంతులేని విశేషాల‌కు నిల‌యం - బిరాజ‌దేవి ఆల‌యం!

 

 


అష్టాద‌శ శ‌క్తిపీఠాల వెన‌క ఉన్న క‌థ అంద‌రికీ తెలిసిందే! ద‌క్షుని య‌జ్ఞంలో జ‌రిగిన అవ‌మానానికిగాను త‌న‌ని తాను ద‌హించివేసుకున్న స‌తీదేవి శ‌రీరాన్ని చేప‌ట్టి, శివుడు తాండ‌వాన్ని ఆడ‌సాగాడు. ఆ శ‌రీరాన్ని విడ‌దీసి, శివుని సాధార‌ణ‌స్థితికి తెచ్చేందుకు విష్ణుమూర్తి త‌న సుద‌ర్శ‌న చ‌క్రాన్ని ప్ర‌యోగించాడు. ఆ సుద‌ర్శ‌న చక్రం స‌తీదేవి శ‌రీరాన్ని చిన్నాభిన్నం చేసింది. ఆ శ‌రీర‌భాగాలు ప‌డిన ప్రాంతాల‌ను మ‌నం అష్టాద‌శ పీఠాలుగా కొలుస్తున్నాము. వాటిలో ఒక‌టి ఒడిషా రాష్ట్రంలో ఉన్న బిరాజ‌దేవి. ఈమెనే గిరిజాదేవిగా కూడా పిలుస్తారు. ఆ క్షేత్ర విశేషాలు...


ఒడిషాలోని భువేనేశ్వ‌ర్‌కు 120 కిలోమీట‌ర్ల దూరంలో జైపూర్ అనే ప‌ట్నం ఉంది. ఆ ప‌ట్నాన్ని ఒక‌ప్పుడు జ‌గ‌తి కేశ‌రి అనే రాజు పాలించాడ‌ట‌. అందుకే దీనికి ఆ పేరు వ‌చ్చింద‌ని చెబుతారు. ఆ జ‌గ‌తి కేశ‌రే ఇక్క‌డి గిరిజా అమ్మ‌వారి ఆల‌యాన్ని పున‌రుద్ధ‌రించార‌ని అంటారు. అష్టాద‌శ శ‌క్తిపీఠంగానే కాకుండా ఈ క్షేత్రానికి ఇత‌ర‌త్రా ప్ర‌త్యేక‌త‌లు కూడా చాలానే క‌నిపిస్తాయి. వాటిలో కొన్ని...
- మ‌హాభార‌త యుద్ధానంత‌రం ఇక్క‌డ భీముని గ‌ద ఉండిపోయింద‌ట‌. అందుకే దీనిని గ‌దాక్షేత్రంగా పిలుస్తారు.
- గ‌యాసురుడు అనే రాక్ష‌సుని దేవ‌త‌లు సంహ‌రించిన‌ప్పుడు... ఆయ‌న త‌ల గ‌య‌లోనూ, పాదాలు పిఠాపురంలోనూ, నాభి ఇక్క‌డి జైపూర్‌లోనూ ప‌డ్డాయ‌ని ఐతిహ్యం. అందుకే పిఠాపురాన్ని పాద‌గ‌య‌గానూ, జైపూర్ క్షేత్రాన్ని నాభిగ‌య‌గానూ పేర్కొంటారు.
- ఈ జైపూర్ ప‌ట్నం చివ‌ర వైత‌ర‌ణి న‌ది ప్ర‌వ‌హిస్తోంది. ఆ వైత‌ర‌ణి న‌ది తీరాన బ్ర‌హ్మ‌దేవుడు అమ్మవారి కోసం య‌జ్ఞం చేసిన‌ప్పుడు, అమ్మ‌వారు పార్వ‌తీదేవి ప్ర‌త్య‌క్షం అయ్యింద‌ట‌.

 

 


ఇక్క‌డ గిరిజాదేవి అమ్మ‌వారు మ‌హిషాసుర‌మ‌ర్దిని రూపంలో క‌నిపిస్తుంది. అయితే అమ్మ‌వారి అలంకారం త‌ర్వాత కేవ‌లం, ఆమె మోము మాత్ర‌మే క‌నిపిస్తుంది. ఈ అమ్మ‌వారిని పూజించేందుకు ఏడాది పొడ‌వునా ఏదో ఒక ప్ర‌త్యేక సంద‌ర్భాలు ఉంటూనే క‌నిపిస్తాయి. ముఖ్యంగా ఇక్క‌డ అమ్మ‌వారు మాఘ అమావాస్యకి అవ‌త‌రించార‌ని అంటారు. అందుకే ఆరోజున త్రివేణీ అమావాస్య పేరుతో ఘ‌నంగా ఉత్స‌వాలు నిర్వ‌హిస్తారు. ఇక ద‌స‌రా స‌మ‌యంలో అయితే చెప్ప‌నే అక్క‌ర్లేదు. ఏకంగా ప‌ద‌హారు రోజుల పాటు ఇక్క‌డ ద‌స‌రా మ‌హోత్స‌వాల‌ను నిర్వ‌హిస్తారు. అమ్మ‌వారిని 16 క‌ళ‌ల‌కు అధినేత్రిగా పేర్కొంటారు క‌దా! బ‌హుశా అందుక‌నే ఇలా 16 రోజుల పండుగ‌ను నిర్వ‌హిస్తారేమో. ఆ స‌మ‌యంలో సింహ‌ధ్వ‌జం మీద అమ్మ‌వారిని ఊరేగించే వేడుక‌ను చూసేందుకు ల‌క్ష‌లాది మంది జ‌నం త‌ర‌లివ‌స్తారు.


బిర‌జాదేవి ఆల‌యంలో క‌నిపించే మ‌రో ప్ర‌త్యేక‌త అక్క‌డి పిండ‌ప్ర‌దానం. బిర‌జాదేవి ఆల‌యానికి స‌మీపంలో ఒక బావి ఉంటుంద‌ట‌. ఆ బావిలో పెద్ద‌ల‌కు త‌ర్ప‌ణాల‌ను విడ‌వ‌డం శుభ‌స్క‌రం అని ఓ న‌మ్మ‌కం. ఇలా విడిచిన త‌ర్ప‌ణాలు నేరుగా కాశీకి చేర‌తాయ‌ట‌. ఒక‌ప్పుడు ఒడిషా ప్రాంతాన్ని ఉత్క‌ళ‌దేశంగా పేర్కొనేవారు. అప్ప‌ట్లో బిర‌జాదేవిని ఆ ఉత్క‌ళ‌దేశాన్ని చ‌ల్ల‌గా కాచుకునే రాజ్యదేవ‌త‌గా భావించేవారు. కాలం మారినా, రాజ్యాలు చెదిరినా కూడా ఇప్ప‌టికీ బిర‌జాదేవి అమ్మ‌వారిని త‌మ జీవితాల‌ను పాలించే అనుగ్ర‌హ‌దేవ‌త‌గానే న‌మ్ముతున్నారు. ఆ న‌మ్మ‌కంతోనే ల‌క్ష‌లాది మంది జ‌నం ఏటా బిర‌జాదేవి ఆల‌యాన్ని చేరుకుంటారు. వారి న‌మ్మ‌కాలు ఎప్పుడూ వ‌మ్ము కాలేద‌న్న‌ది భ‌క్తుల మాట‌.

- నిర్జ‌ర‌.

 


More Dasara - Navaratrulu