భీష్ముడు చెప్పిన గొడుగు - చెప్పుల కథ

 

 

 

ఎండాకాలం దగ్గరపడుతోందంటే చాలు... మనకి గొడుగు గుర్తుకువస్తుంది, ఇక ఆరుబయటకి అడుగు వేయాలంటే కాలికి చెప్పులు ఉండాల్సిందే. మనిషిని ఎండ నుంచి ఇంతగా కాపాడతాయి కాబట్టే... గొడుగు, చెప్పులను దానం చేస్తే బోలెడంత పుణ్యం దక్కుతుందని చెబుతారు పెద్దలు. ఇంతకీ ఈ గొడుగు, చెప్పులను ఎవరు కనుగొన్నారన్న విషయం మీద మహాభారంతంలో ఓ ఆసక్తికరమైన కథ కనిపిస్తుంది.


కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన తరువాత భీష్ముడు ఉత్తరాయణం కోసం ఎదురుచూస్తూ అంపశయ్య మీదే నిరీక్షించాడు. ఈ సమయంలో ధర్మరాజు, భీష్ముని చెంతకు చేరి తన ధర్మసందేహాలను నివృత్తి చేసుకున్నాడు. ఆ సందర్భవశాన భీష్ముడు గొడుగులు, చెప్పులు ఏర్పడిన సంగతి గురించి చెప్పుకొచ్చాడు.


పూర్వం భృగు వంశంలో జమదగ్ని అనే తపస్సంపన్నుడు ఉండేవాడు. ఈయన భార్య పేరు రేణుకాదేవి. జమదగ్ని ఓసారి తన భార్యతో కలిసి ఆరుబయట విలువిద్యను అభ్యసిస్తున్నాడు. ఆయనకు ఎప్పటికప్పుడు బాణాలని అందిస్తానంటూ, రేణుకాదేవి ఆయనకు సాయంగా నిల్చొంది. ఇలా కాసేపు గడిచిన తరువాత జమగద్ని వెనక్కి తిరిగి చూసుకుంటే, తన భార్య కనిపించనేలేదు. తర్వాత నిదానంగా అడుగులోఅడుగు వేసుకుంటూ వచ్చిన రేణుకాదేవిని చూసి, ఆమె ఆలస్యానికి కారణం అడిగాడు.


సూర్యుడు తాపానికి తాళలేక తాను ఓ చెట్టు నీడలో నిలబడిపోయానని చెప్పుకొచ్చింది రేణుక. అంతే! జమదగ్నికి కోపం వచ్చేసింది. తన భార్యకి తాపం కలిగించిన ఆ సూర్యుడి వేడిని అడ్డుకోవాలనిపించింది. వెంటనే తన బాణాలతో ఆ సూర్యుడిని కప్పిపారేసేందుకు సిద్ధపడిపోయాడు. ఈ ప్రమాదాన్ని గ్రహించిన సూర్యుడు వెంటనే ఓ బ్రాహ్మణుని రూపంలో జమదగ్ని చెంతకు చేరుకున్నాడు.


‘మునవర్యా! మీలాంటి జ్ఞానులు ఆ సూర్యుని మీద కోపగించడం సమంజసమేనా? ఆ సూర్యుని తాపం వల్లే కదా... నీరు ఆవిరై, తిరిగి వర్షంగా కురుస్తోంది. ఆయన శక్తి కారణంగానే కదా... చెట్టూచేమా బతుకుతున్నాయి. అసలు ఆయన లేకుండా జీవం మనుగడ సాగించడం అసాధ్యం కదా!’ అంటూ జమదగ్నిని శాంతింపచేసే ప్రయత్నం చేశాడు. కానీ ఎంతగా నచ్చచెప్పినా జమదగ్ని శాంతించకపోవడంతో, చివరికి సూర్యుడు తన నిజరూపంతో దర్శనమిచ్చాడు.


‘ఓ బ్రహ్మర్షీ! నా వల్ల ఏదన్నా అపరాధం జరిగి ఉంటే క్షమించు. అంతేకానీ నీ కోపంతో నా వెలుగుని అడ్డుకుని ఈ లోకాన్ని అంధకారంలో ముంచెత్తకు,’ అని వేడుకున్నాడు. సాక్షాత్తూ ఆ సూర్యభగవానుడే క్షమని కోరడంతో, జమదగ్ని మనసు కరిగిపోయింది. సూర్యుడు కూడా తన వల్ల కలుగుతున్న తాపానికి ఉపశమనంగా గొడుగు, చెప్పులను సృష్టించి జమదగ్ని దంపతులకు కానుకగా ఇచ్చాడు. అలా గొడుగుచెప్పులను ధరించడం, వాటిని దానం ఇవ్వడం మొదలైందని మన పెద్దల నమ్మకం.

- నిర్జర.


More Purana Patralu - Mythological Stories