మునిగితేలుతూ ఉండే శివాలయం – స్తంభేశ్వర మహాదేవ్

 

సముద్రతీరంలో నిర్మించిన ఆలయాలు కాలక్రమేణా మునిగిపోవడం సహజమే. నీటిమట్టం తగ్గి ఆ ఆలయం బయటపడినప్పుడు భక్తులు వెళ్లి దర్శనం చేసుకోవడమూ సహజమే! కానీ అలల తాకిడికి అనుగుణంగా ఆలయం అదృశ్యం అయిపోతూ, అంతలోనే కనిపిస్తూ ఉండే అరుదైన దృశ్యం చూడాలంటే మాత్రం గుజరాత్లోని స్తంభేశ్వర ఆలయాన్ని దర్శించాల్సిందే!

స్కందపురాణంలో ప్రసక్తి

ఈ ఆలయం గుజరాత్లోని వడోదరా నుంచి 50 కిలోమీటర్ల దూరంలోని కవికంబోయి అనే గ్రామంలో ఉంది. అక్కడి అరేబియా సముద్రతీరంలో ఉన్న ఈ ఆలయం గురించి స్కందపురాణంలో కూడా ప్రసక్తి ఉందంటున్నారు ఆలయ నిర్వాహకులు. శివుని కుమారుడైన కార్తికేయుడు, తారకాసురుడు అనే రాక్షసుని సంహరించిన విషయం తెలిసిందే! తారకాసురుడు లోకకంటకుడే కావచ్చు. కానీ అతను మహాశివభక్తుడు. అలాంటి శివభక్తుని తన చేతులతో సంహరించినందుకు కార్తికేయుడు పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. తను చేసిన పనికి ఏదన్నా ప్రాయశ్చిత్తం చేసుకోవాలని తపించిపోయాడు. కార్తికేయుని దుగ్ధను గమనించిన విష్ణుమూర్తి ‘శివభక్తుని పట్ల జరిగిన అపచారం శివపూజతోనే తొలగిపోతుందని’ సూచించాడు. అప్పుడు కార్తికేయుడు దేవతల శిల్పి అయిన విశ్వకర్మ చేత మూడు శివలింగాలను చెక్కించి వాటిని పూజించాడు. వాటిలో ఒక శివలింగమే స్తంభేశ్వర ఆలయంలోని మూలవిరాట్టు.

 

 

అలలకు అనుగుణంగా

స్తంభేశ్వర ఆలయంలోని శివలింగం ప్రాచీనమైనదే అయినా, దీని చుట్టూ ఉన్న ఆలయాన్ని మాత్రం ఓ 150 ఏళ్ల క్రితమే నిర్మించారు. చాలా సాదాసీదాగా కనిపించే ఈ ఆలయం అద్భుత నిర్మాణం ఏమీ కాదు. కానీ ఈ ఆలయం వెనుక ఉన్న స్థలపురాణం వల్లనే వేలాదిగా భక్తులు ఇక్కడికి చేరుకుంటూ ఉంటారు. సముద్రపు అలలకు అనుగుణంగా ఈ ఆలయం కనిపించడం మరో విశేషం. అలలు తక్కువగా ఉన్నప్పుడు ఒకొక్క అంగుళమే ఈ ఆలయం బయటయపడుతూ చివరికి భక్తులు అందులోకి వెళ్లే అవకాశం లభిస్తుంది. మళ్లీ అదే క్రమంలో నిదానంగా సముద్రంలోకి మునిగిపోతుంది. ఆలయం బయటకు రావడం దగ్గర్నుంచీ సముద్రగర్భంలోకి వెళ్లిపోవడం వరకూ మొత్తం క్రమాన్ని గమనించేందుకు భక్తులు ఉదయం నుంచీ సాయంత్రం వరకూ తీరం వద్దనే వేచి ఉంటారు. చంద్రుని కళలను అనుసరించి ఒకో రోజు ఒకో తీరుగా ఆలయం దర్శనమిస్తుంది. సముద్రం మంచి పోటు మీద ఉండే అమవాస్య/ పౌర్ణమి రోజులలో శివుని దర్శనం కోసం కాస్త ఎక్కువసేపు వేచి ఉండాల్సి వస్తుంది.

 


ఇదీ స్తంభేశ్వర ఆలయ వివరం. ఈ ఆలయాన్ని కావాలనే ఇలా నిర్మించారా లేకపోతే కాలక్రమేణా ఈ తీరుగా మారిందా అనేది చెప్పడం కష్టం. ఏమైనా శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి నిత్యం ఆ సముద్రుడే ఆయనకు అభిషేకించి తరిస్తున్నాడని భావించవచ్చు. ఈ ఆలయం సమీపంలోనే మహీనది అరేబియా సముద్రంలో కలవడం మరో విశేషం. ఆ సంగమ ప్రాంతంలో స్నానాలు చేసి స్తంభేశ్వరుని దర్శించుకునేందుకు వేలాదిమంది ఇక్కడకు చేరుకుంటారు. శివపుత్రుడైన కార్తికేయుడు ఇక్కడి శివలింగాన్ని పూజించి సర్వదోషాల నుంచి విముక్తుడైన విధంగానే... ఈ లింగాన్ని దర్శించుకున్నవారు కూడా తెలిసీతెలియక చేసిన తప్పుల నుంచి విముక్తులవుతారని భక్తుల నమ్మకం.

- నిర్జర.


More Punya Kshetralu