అంతరిక్ష పితామహుడు - ఆర్యభటుడు

 

 

ఇప్పుడు ప్రపంచమంతా భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో గురించే మాట్లాడుకుంటోంది. వందకు మించిన ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపి, సాటిదేశాలనే మించిపోయిందని పొగుడుతోంది. కానీ విజ్ఞానరంగంలో భారతీయుల ఘనత ఈనాటిది కాదు! ఒకప్పటి మన పూర్వీకులు చూపించిన మార్గాన్నే ఇప్పుడు ఇస్రో అనుసరిస్తోంది. అందుకు గౌరవసూచకంగా తను ప్రయోగించిన తొలి ఉపగ్రహానికి ఆర్యభట అన్న పేరు పెట్టింది.

 

1500 ఏళ్లకు పూర్వమే!

 

ఆర్యభట ఈనాటివాడు కాడు. ఎప్పుడో క్రీ.శ 476లో పుట్టాడని ఓ అంచనా. ఆయన బీహారుకి చెందిన పాటలీపుత్రం సమీపంలో జన్మించి ఉంటాడని భావిస్తున్నారు. ప్రపంచంలోనే జ్ఞానానికి కేంద్రంగా ఉన్న అక్కడి నలంద విశ్వవిద్యాలయానికి ఆర్యభట నాయకత్వం వహించి ఉంటాడని కూడా ఓ అంచనా! అటు లెక్కల్లోనూ, ఇటు ఖగోళ శాస్త్రంలోనూ ఆర్యభట నిరూపించిన విషయాలు అసమాన్యమైనవి. మూఢనమ్మకాలు రాజ్యమేలే ఆ కాలంలో ప్రతిదానికీ ఓ కారణాన్ని వివరించి చూపిన ఆయన తెగువ అసాధారణం.

 

లెక్కకు మించిన సిద్ధాంతాలు

 

ప్రపంచంలో ప్రసిద్ధ గణితశాస్త్రవేత్తలు ఎవరంటే ఆర్కిమెడిస్ అనో పైథాగరస్ అనో రకరకాల పేర్లు చెబుతూ ఉంటాము. కానీ ఆర్యభట అన్న పేరుని గర్వంగా చెప్పుకొనేందుకు భారతీయులు కూడా జంకుతారు. నిజానికి గణితశాస్త్రంలో అనేక సిద్ధాంతాలకు ఆద్యుడు ఆర్యభటుడే! ఆయన 23 ఏళ్ల వయసులోనే రాసిన ఆర్యభట్టీయం అనే గ్రంథంలో గణితానికి చెందిన సిద్ధాంతాలెన్నో పొందుపరచబడ్డాయి. ఆల్జీబ్రా, జామెట్రీ, ట్రిగ్నామెట్రీ వంటి విభాగాలకు సంబంధించిన మౌలికమైన భావనలు ఆర్యభట్టీయంలో కనిపిస్తాయి. ట్రిగ్నామెట్రీలో కీలకమైన సైన్, కోసైన్ విలువలను సైతం ఆర్యభటుడే రూపొందించాడని చెబుతారు. ఇక π (పై) మీద కూడా ఆర్యభట అనేక పరిశీలనలు చేశాడు. πని ఒక నిష్పత్తి రూపంలో (ratio) రాయడం సాధ్యం కాదని తేల్చిన మొదటి వ్యక్తి ఆయనే! ఇక భారతీయులంతా గర్వించే సున్నాకి (0) ఆద్యుడు కూడా ఆర్యభటుడే అంటారు. సున్నా గురించి ఆర్యభటకి ఉన్న ఆలోచనలని, ఆయన శిష్యుడైన భాస్కరుడు విస్తృత ప్రచారంలోకి తీసుకువచ్చాడు.

 

 

అంతరిక్షాన్ని తాకే ఆలోచనలు

 

గణితంలోనే కాదు, ఖగోళశాస్త్రంలో కూడా ఆర్యభట అద్వితీయమైన ప్రతిభను చూపారు. భూమధ్యరేఖ (equator) అనే భావనని ప్రతిపాదించిన తొలి భారతీయుడు ఆర్యభటుడే అని కొందరి నమ్మకం. గ్రహాలు వృత్తాకారంలో కాకుండా దీర్ఘవృత్తాకారంలో (elliptical) తిరుగుతున్నాయని కూడా ఆయన ప్రతిపాదించారు. ఇక అప్పటివరకూ భూమి చుట్టూ ఆకాశం తిరుగుతోందనే భావనకు విరుద్ధంగా, భూమి తన చుట్టూ తాను తిరగడం వల్లే నక్షత్రాలు కదులుతున్నట్లు కనిపిస్తున్నాయని చెప్పినవాడూ ఆయనే.

 

ఈ విషయం పాశ్చాత్యులు గ్రహించడానికి మరో వేయి సంవత్సరాలు పట్టింది. భూమి తన చుట్టూ తాను తిరుగుతోందని చెప్పడమే కాదు... ఆ సమయాన్ని ఖచ్చితంగా గుణించాడు కూడా. 23 గంటల, 56 నిమిషాల నాలుగు సెకన్లుగా పేర్కొన్న ఈ సమయం ఇప్పటి లెక్కలకు సరిగ్గా సరిపోతోంది. అంతేకాదు! అప్పటివరకూ ఓ రహస్యంగా ఉన్న సూర్య, చంద్ర గ్రహణాల వెనుక కారణాన్ని కూడా ఛేదించారు. గ్రహాల కదలికల వల్లే గ్రహణాలు ఏర్పడుతున్నాయే కానీ, రహుకేతువుల వల్ల కాదని తేల్చిచెప్పారు.

 

ఎప్పుడో ఐదో శతాబ్దంలో ఆర్యభట పేర్కొన్న సిద్ధాంతాలనే తరువాత కాలంలో ఆరబ్బులు ప్రచారంలోకి తీసుకువచ్చారు. అల్ క్వారిజ్మీ, అల్ బెరూనీ వంటి అరబ్బు శాస్త్రవేత్తల ద్వారా ఇవి ప్రపంచంలోకి దూసుకుపోయాయి. ఈ సిద్ధాంతాలన్నింటినీ నెత్తికెత్తుకున్న ప్రపంచం, వాటి వెనుక ఉన్న భారతీయులను మాత్రం విస్మరించింది. అయితేనేం! ఇప్పుడు మన ప్రాచీనుల ఘనతని మరోసారి గగనతలంలోకి ఎగరవేసేందుకు ఇస్రో కంకణం కట్టుకున్నట్లే ఉంది.

- నిర్జర.

 

 


More Purana Patralu - Mythological Stories