తెలుగు లోగిళ్ళలో ముగ్గులు ఎందుకు...?

 

 

ముంగిళ్లు , ముఖ్యంగా తెలుగు వారి లోగిళ్లు కళకళ లాడేది ముగ్గులతోనే . వీటినే రంగ వల్లులు, రంగ వల్లికలు అని కూడా అంటారు. ఈ నాటి వారు అన్ని ప్రాంతాల వారికీ అర్థ మయ్యే విధంగా ‘రంగోలి’ అని అంటున్నారు. రంగోలీ  అన్నా,   రంగ వల్లిక అన్నా అందులో ‘రంగ’ అన్న మాట ఉంది  కదా అందుకని ఇవి రంగులతో వేసేవి అని చాలా మంది అభిప్రాయం. ముగ్గులు, లేదా రంగ వల్లులు  రంగులతో వేస్తే వేయ వచ్చును. కానీ రంగులతో మాత్రమే వేయాలనే నియమం లేదు. నిజానికి పైన ఎన్ని రంగులు వేసినా మౌలికంగా ముందు వేయాల్సింది ముగ్గుతోనే.

    ముగ్గుతో వేసినవి కనుక ముగ్గులు అన్నారో, ముగ్గులు వేయటానికి ఉపయోగ పడే చూర్ణం (పొడి) కనుక దానిని ముగ్గు అన్నారో తెలియదు కాని , రెండింటికి అవినాభావ సంబంధం. ముగ్గు వేసే పొడిని ముగ్గు పిండి అని కూడా అంటారు. ముగ్గులని గుల్ల ముగ్గుతోనూ, బియ్యపు పిండితోనూ, రెండు కలిపిన మిశ్రమంతోను కూడా వేసే పద్ధతి ఉంది. ఇంట్లో దేవుడి మందిరం దగ్గర, తులసి కోట వద్ద, పసుపు రాచిన గుమ్మాల (ద్వారానికి ఉండే గడప) మీద ముగ్గులని బియ్యపు పిండితోనే వేయటం సంప్రదాయంగా వస్తోంది.  ఇంటి బయట , పెరట్లోను, ఇతర ప్రదేశాల లోనూ వేసే ముగ్గులు ముగ్గుతో వేయటం అలవాటుగా వస్తోంది. దీనికి కూడా ఒక కారణం ఉన్నట్టుగా అనిపిస్తుంది.

 

 

వీధులలో చెత్తా చెదారం పేరుకు పోయి, మురిగి, దోమలు, నుసమలు మొదలైనవి వ్యాపించ కుండా ఉండేందుకు గ్రామ పంచాయతీ  వారు కాని,  మునిసిపాలిటీ వారు కాని, మురికి వాడలలో గుల్ల ముగ్గు చల్లటం అందరికి తెలిసిన విషయమే. దానికి కారణం ఏమిటి? గుల్ల ముగ్గు చాలా ఘాటుగా ఉంటుంది. ఎన్నో రకాలైన సూక్ష్మ జీవులు దాని ఘాటుకి మరణిస్తాయి. తేలికగా, సునాయసంగా సూక్ష్మ క్రిములను నశింప చేసే ఉపాయం ఇది. అయితే పెద్ద మొత్తం మీద చేస్తారు కనుక త్వరగా చల్లేసి పని పూర్తి చేయాలని ఉంటుంది వారికి. కనక కుప్పలు కుప్పలుగా పోస్తూ ఉంటారు. కాని ఆ దృశ్యం  చూడటానికి అసహ్యంగా  ఉంటుంది. కనుక ముగ్గులు.

 

 

నిత్య జీవితం లోని ప్రతి అంశాన్ని కళాత్మకంగా తీర్చి దిద్దటటం భారతీయుల విశిష్టత. క్రిమి సంహారకాల విషయంకూడ అంతే . ఇంతింత ముద్దలలా లాగా  వికారంగా కన పడ కుండా ఆ ముగ్గు చల్లటాన్ని  అందంగా, ఆకర్షణీయంగా, కళాత్మకంగా  మలచారు.  ఇంటి పరిసరాల్లో నుండి ఒక్క సూక్ష్మ జీవి కూడా గుమ్మం దాటి, లోపలకు వచ్చే వీలు ఉండదు. కనుక తప్పని సరిగా ప్రతి రోజు గుమ్మంలో ముగ్గు వేసి తీరాలని పెద్దలు చెప్పిన మాట. పిండితో ముగ్గు వేయటం దేనికంటే  చీమలు మొదలైన వాటికి ఆహారం కోసం. వాటికి ఆహారం ఇవ్వటానికి కూడా కారణా లున్నాయి. ఒకటి భూత దయ. రెండవది ఆహారం దొరికింది కనుక చీమలు దానిని తిని ఇంక లోపలికి రావు అని.

 

మారీచుడు రాముని గొంతుతో అరచినప్పుడు, సీత మాట కాదనలేక లక్ష్మణుడు రామునికి సహాయంగా వెడుతూ సీత రక్షణ కోసం మూడు గీతలు గీశాడని, దాటి వెళ్ళిన సీత కష్టాల పాలయిందని, ఆ లక్ష్మణ రేఖలకి సంకేతంగా మనం ముగ్గు కర్రలు (గీతలు) వేయాలని , ఇది జరిగింది దండకారణ్యంలో కనుక దాక్షిణాత్యులకి ముగ్గు తప్పని సరి అని ఒక కారణాన్ని చెపుతుంటారు.  లక్ష్మణుడు గీతాలు గీసిందే నిజం కానప్పుడు ముగ్గు వెయ్యటానికి అది కారణం అనటం ఎంత సమంజసం? ఆరోగ్య దృష్టియే ప్రధాన మనటం సమంజసం. దీనికి ఒక ఆధారం కూడా కన  పడుతుంది. మిగిలిన కాలం అంతా ఏదో చిన్న ముగ్గు వేసి సరి పుచ్చిన వారు కూడా ధనుర్మాసం వచ్చిందంటే పెద్ద పెద్ద ముగ్గులు వేస్తారు. అది తెల్లవారు జామున. ఎందుకంటే – అప్పటికి పంట పొలాలు పంటలు ఇంటికి రావటం తో కాళీగా ఉంటాయి. వాటిని ఆశ్రయించుకొని ఉన్న రకరకాలైన సూక్ష్మ జీవులు, దోమలుమొదలైన పురుగులు రాత్రి ఎక్కడో అక్కడ తల దాచుకుని, తెల్లవారు జామున ఆశ్రయం కోసం వెదుకుతూ వస్తాయి. వాటిని రానీయకుండా ఉండాలంటే ఆవు పేడతో కళ్ళాపి చల్లి, ముగ్గు వేయాలి. ఆవు పేడకి క్రిమి సంహారక గుణం ఉంది. ఈ కారణం చేతనే ప్రతి శుభ కార్యంలోను ముందు ఆవు పేడతో ఆలికి ముగ్గు వెయ్యటం సంప్రదాయం గా వస్తోంది. దానితో అంతకు ముందున్న క్రిములు పోవటమే కాకుండా పది మంది రావటం వల్ల వచ్చే కాలుష్యం నివారించ బడుతుంది.

 

 

తాంత్రిక సాధనలలో భాగమైన యంత్రాన్ని ముగ్గు అంటారు. కొన్ని రకాలైన సాధనలలో యంత్రాలని నేలపై రకరకాలైన రంగులతో తీర్చి దిద్దుతారు. వస్తువులతో పాటు బలి ఇచ్చే జంతువుని కాని, మనిషిని కాని యంత్రం (ముగ్గు) మధ్య కూర్చో పెడతారు. భవిష్యత్తు తెలుసు కోవటానికి కూడా ఎవరినైనా ఒకరిని ముగ్గులో కూర్చో పెట్టి ప్రశ్నలు వేసి సమాధానాలు రాబడతారు. అందుకే ఎవరినైనా వారి ఇష్టానికి వ్యతిరేకంగా తమకి అనుకూలంగా ప్రవర్తించేట్టు చేస్తే  ముగ్గులోకి దింపారు అనటం వింటూ ఉంటాం. ఒకప్పుడు దక్షిణాదిన అన్ని మత సంప్రదాయాలలోను తాంత్రికత అంతో  ఇంతో  ప్రవేశించింది. షట్కోణం (కుండలినికి సంకేతం) , అష్ట దళ పద్మం (పద్మానికి గుర్తు) మొదలైనవి. ఇవి గీతలు కోణాలుగా మాత్రమే ఉంటాయి. చుక్కలు పెట్టి కలపటం, లేదా చుక్కల చుట్టూ మెలి తిప్పటం ఉండవు. ఆది శంకరుల తరువాత తాంత్రిక సాధనల ప్రాచుర్యం తగ్గింది. యంత్రాలు కొన్ని ముగ్గుల రూపంలో మిగిలి ఉన్నాయి. వీటిని తప్పని సరిగా దేవుడి దగ్గర వేయటం మాత్రమే ఆచారంగా మిగిలి ఉంది.

   ముగ్గులలో కళాత్మకతయే కాదు భావుకత కూడా నిండి ఉంది. పురాణ విజ్ఞానం ఉంది. ఖగోళ పరిజ్ఞానం ఉంది. ప్రకృతి పరిశీలన, అవగాహన, తాదాత్మ్యం కనిపిస్తాయి. ముగ్గులకు పెట్టిన పేర్లు ఈ విషయాన్ని తెలియ చేస్తాయి. మారేడు దళం, అష్ట దళ పద్మం, నాగ బంధం మొదలైనవి ముగ్గులకున్న పవిత్రతను సూచిస్తాయి. చేప ముగ్గు, కూర్మం(తాబేలు) మొదలైనవి పురాణ విజ్ఞానాన్ని తెలియ చేస్తాయి. స్వర్గ ద్వారాలు, రథం ఖగోళ విజ్ఞానాన్ని సామాన్యులకి గుర్తు చేస్తాయి. ధనుర్మాస సమయంలో వేసే గుమ్మడి పండు , వరి కంకులు ఆ సమయంలో వచ్చే పంటలను  గుర్తు చేస్తాయి. ఇక మల్లె పందిరి,  ఉయ్యాల మంచం ... ఇలా స్త్రీల మనో భావాలకు దర్పణం మాత్రమే కాక వారి సృజనాత్మకతని ప్రతి బింబిస్తాయి ముగ్గులు . 

 

సమకాలిక అంశాలు, భావాలు, ఉద్యమాలు కూడా ముగ్గులలో ప్రత్యక్ష మౌతు ఉంటాయి. స్వతంత్రోద్యమ కాలంలో జెండాలు ముగ్గులలో చోటు చేసుకున్నాయి. ఇప్పటికీ స్వాతంత్ర్య దినం, గణ తంత్ర దినం వంటి సందర్భాలలో జెండాలున్న ముగ్గులు ఎన్నో కనపడతాయి. నక్షత్రాల లాంటి చుక్కలు పెట్టి వాటిని అందంగ కలుపుకుని పోతూ నక్షత్ర మండలం దిగి వచ్చిందనే భ్రాంతి కలిగించ గలరు మన మహిళా మణులు. వీధిలో ఒక ఇంటి ముగ్గు ప్రక్క ఇంటి ముగ్గుతో కలుపుతూ ఊరి చివర వరకు ఒకే ముగ్గులాగా భాసించే విధంగా వేసి సమక్యతని ప్రదర్శించ గలరు ఈ కళా స్రష్టలు

 

Dr Anantha Lakshmi

 

 

            


More Enduku-Emiti