మాయ అంటే?


స్వామి రామా గురించి ప్రత్యేకమైన పరిచయ వ్యాక్యాలు అవసరం లేదు. హిమలయాల ఒడిలో తన భౌతిక, ఆధ్మాత్మిక జీవితాన్ని గడిపిన భాగ్యశాలి రామా. తన అనుభవాలతోనూ Living with the Himalayan Masters (హిమాలయ పరమగురువులతో జీవనం) అనే పుస్తకాన్ని రాశారు. అందులో స్వామి రామా, మాయ గురించి తన గురువుగారితో జరిపిన సంభాషణ చాలా ఆసక్తిగానూ, ఉపయుక్తంగానూ కనిపిస్తుంది.


‘గురువుగారు! అవిద్య, మాయ రెండూ ఒకటేనని నేను చదువుతూ వచ్చాను. కానీ అసలు మాయ అంటే ఏమిటో అర్థం చేసుకోలేకపోతున్నాను’ అని అడిగారు స్వామి రామా.


‘రేపు ఉదయమే నీకు మాయ అంటే ఏమిటో చూపిస్తాను’ అంటూ బదులిచ్చారు గురువుగారు. గురువుగారు తరచూ ఏదో ఒక ప్రత్యక్ష ప్రమాణంతో సందేహాలను తీరుస్తూ ఉంటారని రామాకు తెలుసు.


గురువుగారి మాటలతో ఆ రాత్రి స్వామి రామాకు నిద్ర పట్టనే లేదు. ‘మర్నాడు ఉదయం మాయను చూడబోతున్నాను’ అన్న తలంపుతో అతని మనసు నిండిపోయింది.


మర్నాడు ఉదయం కాలకృత్యాలను కూడా హడావిడిగానే ముగించేశారు స్వామి రామా. స్నానానంతరం ఎప్పటిలాగే ధ్యానానికి కూర్చున్నారే కానీ అన్యమనస్కంగానే ఉండిపోయారు.


ధ్యాన సమయం ముగిసిన తరువాత స్వామి రామా, గురువుగారితో కలసి తమ స్థావరానికి తిరుగుముఖం పట్టారు. ఇంతలో... గురువుగారు హఠాత్తుగా ఒక పెద్ద చెట్టు వైపు పరిగెత్తుకుంటూ వెళ్లి దానిని చుట్టుకుపోయారు. గురువుగారు అంత వేగంగా పరుగులెత్తడం స్వామి రామా అంతవరకూ చూడనేలేదు.


‘నువ్వు నా శిష్యుడివేనా! అయితే వచ్చి రక్షించు!’ అంటూ అరిచారు గురువుగారు.


దానికి రామా ‘మీరే ఎంతోమందికి సాయం చేశారు. కానీ ఇవాళ మీకు నా సాయం అవసరం అవడమేంటి? ఏమైంది మీకు?’ అని అడిగారు. ఆపాటికే స్వామి రామాలో ఆ చెట్టంటే భయం ఏర్పడిపోయింది. అది తనను కూడా చుట్టేసుకుంటుదన్న అనుమానం మొదలైంది. ఒకవేళ ఇద్దరూ ఆ చెట్టుకి అతుక్కుపోతే తమని రక్షించేది ఎవరు అనుకున్నారు.


ఇంతలో గురువుగారు ‘వచ్చి నన్ను కాపాడు. నా కాళ్లని పట్టుకుని ఇవతలికి లాగడానికి వీలైనంతగా ప్రయత్నించు’ అంటూ మరోసారి అరిచారు.


స్వామి రామా గురువుగారు చెప్పినట్లే ఆయనను ఇవతలికి లాగడానికి ప్రయత్నించారు. కానీ ఆయనను చెట్టు నుంచి ఏమాత్రం విడదీయలేకపోయారు.


చివరికి విసిగివేసారిపోయి బుర్రకు పనిచెప్పారు రామా ‘అసలు ఇదెలా సాధ్యం! ఆ చెట్టుకి మిమ్మల్ని బంధించేంత శక్తి లేదు కదా! మీరేం చేస్తున్నారు?’ అంటూ గురువుగారిని అడిగారు.


దానికి గురువుగారు చిరునవ్వుతో ‘మాయ అంటే ఇదే!’ అంటూ చెప్పుకొచ్చారు. లేనిది ఉన్నట్లుగా భ్రమించి అందులోనే చిక్కుకోవడమే మాయ అనీ మోహానికి అతీతంగా, నిత్యం జాగరూకతతో ఉంటే దాన్ని జయించగలమనీ ఉపదేశించారు.
ప్రత్యక్ష ఉపమానాలతో గురువుగారు చేసిన ఉపదేశం స్వామి రామా మనసులో హత్తుకుపోయింది. ఆధ్మాత్మిక పురోగతిలో విలువైన సూచనగా మిగిలిపోయింది.

- నిర్జర.

 


More Good Word Of The Day