ఇంతకూ ఎందరు దేవుళ్ళు...?

 

 

ఒక మత బోధకుడు దేశ సంచారం చేస్తూ చేస్తూ ఒక గ్రామానికి చేరుకున్నాడు. ఆ ఊరి ప్రజలకు ఎందరో  దేవుళ్ళ గురించి ఎన్నో కథలు చెప్పాడు. అందరు ఎంతో ఆశక్తితో విన్నారు. ఆయన చెప్పిన తీరుతో దేవుళ్ళందరూ తమతోనే ఉంటున్నారని గట్టిగా నమ్మడం మొదలుపెట్టారు.  కొన్ని రోజులు అయ్యాయి.  ఆ ఊళ్ళోకి మరొకడు  వచ్చాడు. అతను అసలు దేవుడనే వాడు లేనే లేడు...మతబోధకుడు మాత్రమే కాదు ఎవరు ఏం చెప్పినా నమ్మకండి అని అన్నాడు. దేవుడు ఎందుకు లేడో అని నమ్మించేందుకు రకరకాల కథలు చెప్పాడు. అతను చెప్పే  మాటలు విన్న వారిలో చాలా మంది అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. నిన్నమొన్నటివరకు వాళ్ళందరూ మతబోధకుడు చెప్పిన మాటలు విని భయం భయంగా రోజులు గడపడం మొదలుపెట్టారు. తాము చేసే తప్పులకు దేవుడు ఎక్కడ శిక్షిస్తాడో అని భయపడ్డ వారందరూ ఇప్పుడు  దేవుడనే వాడు అసలు లేనే లేడు అని చెప్పిన వ్యక్తి మాటలతో కాస్తంత శాంతించారు. తాము చేసిన తప్పులకు శిక్ష పడదనుకున్నారు. కొన్ని రోజులు గడిచాయి. కొత్తగా మరో వ్యక్తి వచ్చాడు. దేవుడనే వాడు ఒక్కడే ఉన్నాడు. తన మాట నమ్మించడానికి అతను ఎన్నో విషయాలు చెప్పాడు. అతని మాటలు విన్న వాళ్ళందరూ మళ్ళీ ఆలోచనలో పడ్డారు. అనేక మంది దేవుళ్ళు ఉంటే కొందరు దేవుళ్ళైనా తమ తప్పులు పట్టించుకోరని, చూసీచూడనట్టు ఉండిపోతారని అనుకున్నారు. కానీ ఒకడే దేవుడంటే తాము చేసిన తప్పుల నుంచి ఎలా బయటపడాలి అనుకుని భయపడ్డారు.

ఇంతలో ఇంకో మనిషి వచ్చాడు ఆ ఊరికి. అతను వచ్చీ రావడంతోనే దేవుళ్ళు ముగ్గురు ఉన్నారని, వారికి కరుణకు మారుపేరైన  ఒక తల్లి ఉందని చెప్పాడు. ఇప్పుడు ఆ ఊరి ప్రజలకు కాస్త ఊరట కలిగింది. దేవుళ్ళు ముగ్గురు ఉండటం వల్ల తాము చేసింది తప్పో పాపమో కాదో అనే విషయంలో కచ్చితమైన నిర్ణయానికి వాళ్ళు రాలేకపోతారని, ఒకవేళ వాళ్ళు తాము చేసింది తప్పని ఒక నిర్ణయానికి వచ్చినా కరుణకు ప్రతిరూపమైన వారి తల్లి తమను దయ తలచి విడిచిపెడుతుందని అనుకున్నారు. ఈ విషయమంతా అలా ఉంటే ఆ ఊరి ప్రజలు  ఇప్పటిదాకా మొత్తం ఎందరు దేవుళ్ళు ఉన్నారో అనే దానిపై ఒక నిర్ణయానికి రాలేక సతమతమవుతున్నారు. దేవుడు అసలు ఉన్నాడా లేడా తెలియని అయోమయస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. తప్పులు చేసిన వాళ్ళందరూ సందిగ్ధంలో పడ్డారు.  ఈ ఊరి జనంలాగే మనలో ఎక్కువ శాతం మంది ఇతరులు చెప్పే మాటలకు అతిగా విలువ ఇచ్చి వాళ్ళంతట వాళ్ళు ఒక నిర్ణయానికి రాలేక అలా ఉండచ్చు ఇలా ఉండచ్చు అనే అనుమానాలతో బతుకుతుంటారు. ఏవేవో ఆలోచనలతో ఉంటారు. కనుక ఎవరికి వారు ధ్యాన మార్గంలో జవాబు కనుక్కోవడం ఉత్తమం. లేకుంటే పిచ్చి పిచ్చి ఆలోచనలకు రెక్కలు వచ్చి అవి మనల్ని స్థిరంగా ఉండనివ్వక ఊపిరాడనివ్వక నజ్జుగుజ్జు చేస్తుందని తెలుసుకుని చైతన్యవంతంతో బతకాలన్నదే ఈ కథ సారాంశం.

- యామిజాల జగదీశ్


More Good Word Of The Day