• Prev
  • నేనూ - ఇంటాయన 1

    Listen Audio File :

    Mallik Audio Telugu Short Stories: Latest Collection of  Telugu Short Stories Comedy Three in One by Teluguone

     

    నేనూ - ఇంటాయన - 1

     

    - మల్లిక్

     


    ఆ ఇంటిముందు 'టు లెట్' బోర్డు చూసి ఆగాను.
    గేటు తీసుకుని లోపలికి వెళ్ళి కాలింగ్ బెల్ నొక్కాను. లోపల ఎక్కడో బెల్ మ్రోగడం వినబడింది.
    ఒక నిముషం టైమిచ్చి మళ్ళీ నొక్కాను.
    "రంబా హ్హో హ్హ్హో హ్హో ... సాంబా హ్హో హ్హో హ్హో ...''
    ఒక చేత్తో చెవి దగ్గర ట్రాన్సిస్టరు పెట్టుకుని రెండో చేత్తో తెరిచినా తలుపు పట్టుకుని నిలబడి ఉన్నాడు ఆయన.
    అతని బట్టతల తళతళా మెరుస్తోంది. చీర బోర్డర్ లాగా బుర్ర చుట్టూరా కొన్ని వెంట్రుకలు పలచగా ఉన్నాయ్. బోండాం ముక్కక్రింద తుమ్మెదలాగా ఫ్రెంచ్ కట్ మీసం.
    అతనికి బహుశా తలమీద పెరగాల్సిన వెంట్రుకలు కాళ్ళమీద పెరిగినట్టునాయ్ - రెప్పలు చాలా గుబురుగా ఉన్నాయ్.
    "టు లెట్ బోర్డు చూసి వచ్చాను ...'' అన్నాను.
    "సాంబ హ్హో హ్హో హ్హో ...''
    ట్రాన్సిస్టరు హోరెత్తి పోతూంది. అయినా దాన్ని చెవికి ఆనించి పట్టుకున్నాడు ఆ మహానుభావుడు.
    "ఏమిటంటారూ?''
    "టు లెట్ బోర్డు చూసి వచ్చాను''
    "ఆ?''
    "రంబా హ్హో హ్హో హ్హో ...''
    "టు లెట్ ... టు లెట్ ....'' సాధ్యమైనంత గట్టిగా అన్నాను అరిస్తే గది అద్దెకివ్వనని ఎక్కడ అంటాడో అని భయపడ్తూ.
    "గది అద్దెకిస్తారా?'' మళ్ళీ గట్టిగా అడిగాను.
    "ఏమేవ్ ... నిన్నే ...''
    ఆయన లోపలికి చూస్తూ ఓ గావుకేక పెట్టాడు.
    ఆ ఏమే అనబడే ఆవిడ వచ్చింది.
    "చూడూ ... ఈ అబ్బాయికి గది అద్దెకు కావాలంట''
    ఆవిడ నన్ను ఎగాదిగా చూసింది. క్షణాల్లో ఆవిడ కళ్ళు పెద్దవి అయ్యాయి. ఆవిడ ముక్కుపుటాలు అదురుతున్నాయ్. పెదాలు వణుకుతున్నాయ్ ... కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయ్.
    "బాబూ ...''
    గట్టిగా అరిచింది. నేను ఉలిక్కిపడ్డాను.
    ఏం జరుగుతుందో అర్థం అయ్యేలోగా నేను ఆవిడ కౌగిట్లో ఉన్నాను.
    "వదలండి ... వదలండి ... ఏమిటిది?''
    గింజుకుని ఎలాగైతేనేం ఆవిడ పట్టునుంచి విడిపించుకున్నాను. ఆవిడ కళ్ళు తుడుచుకుంటూ నిలబడింది.
    "మరేం లేదబ్బాయ్ ... నీ వయసు గల కుర్రాళ్ళు కనబడితే ఆవిడకు మిలటరీలో ఉన్న మా అబ్బాయే గుర్తుకు వస్తాడు'' అన్నాడు యింటాయన.
    "రా బాబూ ... గది చూద్దువుగాని'' అంటూ ఆవిడ ముందుకు కదిలింది.
    నన్ను చూస్తే వాళ్ళ అబ్బాయి గుర్తుకు వస్తున్నాడు కాబట్టి నాకు గది అద్దెకు దొరకడం ఖాయం అనుకుంటూ ఆవిడను అనుసరించాను.
    గది నీటుగా ఉంది. ఎటాచ్డ్ బాత్రూమ్. పెద్ద పెద్ద కిటికీలు రెండు ఉండటం చేత గదిలోకి గాలీ వెలుతురూ బాగానే వస్తుంది.
    "అద్దెంతండీ?''
    "ఎంతోనా ... నెలకు నూటేభై నాయనా. కరెంటు ఎగస్ట్రా ...'' అందావిడ సాగదీస్తూ.
    నూటయాభయ్యే!!
    "నన్ను చూస్తుంటే మీ అబ్బాయి గుర్తుకు వస్తున్నాడని అన్నారు ... అద్దె మరీ అంతెక్కువ చేస్తే ఎలాగండీ ... హిహిహి''
    "లాభంలేదు బాబూ ... మా ఆవిడ డబ్బుదగ్గర చాలా ఖచ్చితమైన మనిషి'' అన్నాడు యింటి యజమాని.
    "అదే బాబూ నా బలహీనత'' అంది ఆవిడ ముక్కు చీదుతూ.
    ఏదో కొడుకు గుర్తుకు వస్తున్నాడంటే ఆశపడ్డానుగానీ హైదరాబాదు నగరంలో అంతకు తక్కువలో గది అద్దెకు దొరకడం సాధ్యంకాని పని. ప్రస్తుతం నేను అద్దెకు ఉంటున్న గది అద్దెకూడా నూటయాభై రూపాయలే. కానీ కరెంటు ఛార్జీ లేదు. ఈ గది దానికంటే ఎన్నో రెట్లు మేలు. ఇంటాయన వేలు విడిచిన మేనల్లుడెవరో వస్తున్నాడని నన్ను గది ఖాళీ చేయమన్నాడు.
    "సరేనండీ ... నేను ఫస్టుకు గదిలో దిగుతాను''
    "ఇంతకీ నీ పేరు చెప్పలేదేం బాబూ?''
    "బుచ్చిబాబు ...'' అన్నాను.
    ఆవిడ ముక్కుపుటాలు అదిరాయి ... పెదాలు వణకసాగాయి ... "మా అబ్బాయి పేరు ...''
    నాకు భయం వేసింది.
    "నేనిక వస్తానండి ...''
    సర్రున బయటికి వచ్చేశాను.
    ఒకటవతేదీ ఆదివారం కావడం మూలాన ఆరోజే నేను నా గది మారేను. నా స్నేహితుడు చంచల్రావుకూడా సాయం పట్టాడు సామాన్లు చేరవేయడంలో.
    అప్పుడు వరండాలో ఉన్న నేమ్ ప్లేటు చూశాను.
    వరదరాజులు బి.ఎ.
    అయితే ఇంటాయన పేరు వరదరాజన్న మాట!'' అన్నాడు చంచల్రావు.
    "అనుకుంటా ... నేనూ ఆ బోర్డు ఇప్పుడే చూశాను''
    "మరి ఆవిడ పేరో?''
    "ఏమో ... నాకు తెలీదు. బహుశా ఏమేవ్ అనుకుంటా'' అన్నాను.
    చంచల్రావు కళ్ళప్పగించి చూశాడు నా వేపు.
    "ఆయన ఆవిడని అలానే పిలుస్తాడు'' అన్నాను.

  • Prev