• Next
  • శివతాండవం - 66

    Read and enjoy latest telugu comedy serials, telugu funny serials with funny images

     

    66వ భాగం

     

    శివుడూ పంకజం కూడా మెట్లెక్కుతున్నారు. డేవిడ్ వాళ్ళని ఉద్దేశించి గాండ్రించాడు.
    "అటు చూడండి మీకంటే లేత జంటా ! మీలాగానే అడ్డం పడ్డాడు. నా చేతుల్లో కైమా అయిపోయారు. అడుగు ముందుకు వేస్తె మిమ్మల్ని ఏకంగా కూరొండుకు తినేస్తాను."
    ఆ హెచ్చరికతో శివుడి క్కోపం వచ్చింది. తన బలసంపద గుర్తుకొచ్చింది. హనుమంతుడి ముందా ఈ కుప్పి గంతలు ఈ ఆలోచన రాగానే ఆటోమేటిగ్గా రోషం వచ్చేసింది. అంచేత గంభీరంగా అన్నాడు.
    "డేవిడ్ ! ఎవరు ఎవర్ని కైమా చేస్తారో, కూరొండుకు తింటారో అవన్నీ ఇప్పుడొద్దు ! ఇప్పుడు కావలసిందల్లా నా మాట వినడమే ! గంటలు కొట్టొద్దు!"
    "కొట్టొద్దు!" అంటూ శివుడు గబగబా మెట్లెక్కేశాడు.
    డేవిడ్ చేతిలో పిస్తోలు చూసి, శివుడు కొయ్యబారి పోయాడు.
    డేవిడ్ పకపకా విలన్ గా నవ్వుతూ అన్నాడు "మీ జంటల గోలతో నా ఉద్యోగం పోతుందని నాకు బాగా తెలుసు. నా ఉద్యోగం పోగొట్టు కోకుండా జాగ్రత్త పడేందుకే ఈ పిస్తోలు తెచ్చుకున్నాను. నన్ను రెచ్చగొట్టారో పిట్టల్ని కాల్చినట్టు కాల్చిపారేస్తాను. ఖబడ్దార్!...అంటూ గంట కొట్టాడు.
    "డేవిడ్!" అన్నాడు శివుడు నీరసంగా.
    (ఆ గంటని కిష్టుడూ, వసుంధర ఇద్దరూ తమ మెడలకు ఉరి తగిలించుకుంటూ 'ఒకటి' అనుకున్నారు.)
    ఒక చేత్తో పిస్తోలు పట్టుకుని మరోచేత్తో రెండో గంట కొట్టాడు డేవిడ్.
    పంకజం ఏడుస్తూ రెండు చేతులూ జోడించి ప్రాథేయపడుతోంది
    "వాళ్ళని బతకనివ్వు డేవిడ్ ! ఇకనైనా గంటలు కొట్టడం మాను!"
    డేవిడ్ పిచ్చిగా నవ్వుతూ మూడో గంటకూడా మోగించాడు.
    (మూడు అనుకున్నారు కిష్టుడూ, వసుంధరా!)
    "నీ కాళ్ళు పట్టుకుంటాను డేవిడ్...గంటలాపు !" అంటూ పంకజం డేవిడ్ కాళ్ళవైపు కదిలింది.
    డేవిడ్ ఆమె వైపు పిస్తోలు గురిపెట్టి అన్నాడు "నన్ను ముట్టు కోవద్దు ! ముట్టుకున్నావంటే కాల్చిపారేస్తాను!" అంటూ నాలుగో గంట మోగించాడు.
    శివుడు ఇంక ఓర్చుకోలేకపోయాడు.
    తాను ఏమైపోయిన ఫర్లేదు కిష్టుడు బతకాలి? వసుంధర బతకాలి! అంతే....
    శివుడు అమాంతం డేవిడ్ మీదకి దూకాడు.
    డేవిడ్ చేతిలో పిస్తోలు పేలింది.
    పంకజం అర్తనాదం చేసింది. 'శివుడూ' అంటూ శివుడ్ని కౌగలించేసుకుంది.
    డేవిడ్ అయిదో గంట కొట్టాడు.
    (అయిదు అనుకున్నారు కిష్టుడూ, వసుంధర)
    పంకజం కౌగిట్లో వున్న శివుడు మెల్లిగా కళ్ళు విప్పాడు. అప్పుడు గాని ఆ ఇద్దరికీ అర్థం కాలేదు. అర్థమైన తర్వాత ఇద్దరూ ఒకేసారి బొమ్మ పిస్తోలు అని గావుకేక పెట్టారు. అంతే!
    శివుడు సాక్షాత్తు రుద్రుడే అయ్యాడు. ఇక తాండవం ప్రారంభమయ్యింది. డేవిడ్ కడుపులో ఒక గుద్దు గుద్దాడు. ఆ దెబ్బతో డేవిడ్ కి ముల్లోకాలు ఒకేసారి కనిపించాయి.
    అయినా సరే అతను తన డ్యూటీ విడిచిపెట్టలేదు. తూలిపోతూ కూడా ఆరో గంట మోగించాడు. శివుడు డేవిడ్ మెడమీద గుద్దాడు. దాంతో డేవిడ్ కళ్ళు చీకట్లు కమ్మేశాయి. వెయ్యి అమావాస్యాలకు అర్థమేమిటో తెలిసింది.
    అప్పటిక్కూడా డేవిడ్ తన డ్యూటీని బాగా జ్ఞాపకం పెట్టుకున్నాడు. చాలా ఓపిగ్గా ఏడో గంట కొట్టాడు.
    'ఈ దెబ్బతో నవనాడులూ కృంగిపోవాలి' అంటూ తన రెండు చేతులతో డేవిడ్ రెండు భుజాల మీదా ఒకేసారి దెబ్బ కొట్టాడు కత్తిలాగా.
    డేవిడ్ స్పృహ తప్పి పడిపోతూ ఎనిమిదోగంట మోగించి మరి పడ్డాడు.
    "ఇంక తొమ్మిదో గంట కొట్టలేడు!" అన్నాడు శివుడు ఆనందంగా !
    (ఎనిమిది....ఎనిమిది అని అరిగిపోయిన రికార్డు మల్లె గొణుక్కుంటున్నారు కిష్టుడూ వసుంధరా!)
    తొమ్మిదో గంట కొట్టలేక పోయిన డేవిడ్ శరీరాన్ని శివుడూ పంకజం మోసుకోస్తూ గంట స్థంభం దిగుతున్నారు!
    (అంటే...తొమ్మిదోగంట ఇక వినిపించదని అర్థం. అనగా కిష్టుడూ, వసుంధరా క్షేమంగా ఉంటారని తెలిసిపోయింది. ఆ తర్వాత కథ అంటారా? మామూలే! మూడు జంటలూ....వారి వివాహాలు ...వంటినిండా కట్లుతో .....డేవిడ్ ఆశీస్సులు....మొదటిరాత్రి....పూలపాన్పులు...చందమామ...విరబూసిన వెన్నెల స్వీట్ నాన్ సెన్స్...సెలవా మరి!)

    (సమాప్తం)

  • Next