• Next
  • సంపూర్ణ గోలాయణం 88

    Listen Audio File :

    మర్నాడు పొద్దున్నే తన కంపెనీకి వెళ్ళగానే ఇప్పుడున్న మేనేజర్ని పిలిపించి అతన్ని బ్రతిమాలి బామాలి అతనికో ఏడాది జీతం ఇచ్చి, అతని చేత రిజిగ్నేషన్ ఇప్పించాడు చిట్టిబాబు, ఆ జాగాలో మోహన్ ని వచ్చి జాయిన్ అవ్వమన్నాడు. కొత్త స్కూటర్ కూడా ఇచ్చేసి తనమాట నిలబెట్టు కున్నాడు.

    ప్రొఫెసర్ గారింట్లో ఆ వేళ బోలెడంత హడావిడి. మోహన్ దీపికా, శ్యామ్ భారతీ అక్కడే ఉన్నారు. ఎన్నో సంవత్సరాలుగా పేరుకు పోయిన కాగితాలన్నీ బయటికి తీసి పాత కాగితాలవాళ్ళని పిలిపించి అమ్మేశారు.

    పురుగుల తినేసినవి పోగా మిగిలిన కాగితాలకి పన్నెండొందల రూపాయలు వచ్చింది. ఆ డబ్బుతో ఇంటికి సున్నం వేయిస్తామని చెప్పారు ఆయన. ఇనుప బీరువాలు, పెద్ద పెద్ద బల్లలు ఒక లైబ్రరీకి ఇచ్చేశారు. ఇల్లు సున్నం అదీ కొట్టించాక మంచిరోజు చూసి మోహన్ దీపికా ఆ ఇంట్లో కాపురం పెడతారు. ప్రొఫెసర్ గారు కొడుకు దగ్గరకు వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారు. వెళ్ళేదాకా మోహన్ దగ్గరే వుంటానని చెప్పారు మీరు వెళ్ళాక నెల నెలా ఇంటి అద్దె మీకు పంపిస్తాను అన్న మోహన్ మీద దెబ్బలాడారు.

    నువ్వు నా కొడుకులాంటి వాడివి. నీ దగ్గర అద్దె తీసుకుంటానా? నువ్వు నిశ్చితంగా ఇంట్లో వుండి మంచి వృద్ధిలోకి వచ్చి స్వంత ఇల్లు కట్టుకున్నాక అందులోకి వెళ్ళు. అప్పుడు ఈ ఇల్లు అమ్మేసి ఆ డబ్బు నాకు పంపించు. నా కొడుక్కి యిస్తాను ఆన్నారు. ప్రొఫెసర్ గారి ఇల్లు సర్దడానికి హైరానాపడ్డ శ్యామ్ కి తన రూం ఖాళీ చెయ్యడం ఏమాత్రం శ్రమ అనిపించలేదు. అరగంటలో అన్నీ సర్దేశాడు.

    వుట్టిలక్ష్మి ఆ పూట వాళ్ళింటిలోనే భోజనం పెట్టింది "నే చెప్పలేదుటండీ, ఈ యిల్లు మహా మంచింది. రెండు నేలలు తిరక్కుండా లక్షాధికారికి అల్లుడిగా వెళ్ళిపోతున్నారు" అంది. రిక్షాల్లో సామాను వేసుకుని తిన్నగా సూర్యంగారింటికి చేరి మోహన్ ఖాళీ చేసిన గదిలో ప్రవేశించాడు శ్యామ్. ఇంటి అద్దె లేదు కాబట్టి పార్ట్ టైం జాబ్ అవసరం లేదు. అయినా అర్ధాంతరంగా మానేస్తే వాళ్ళకి కష్టం కాబట్టి వాళ్ళకి మరో మంచి టీచర్ దొరికేదాకా చేస్తానని చెప్పాడు.

    అయితే రోజు లైబ్రరీనించి పుస్తకాలు తేవడం మాత్రం మానేశాడు. భారతికి రోజు పొద్దున పూట కమ్మని కతలు తనే కల్పించి స్వయంగా చెప్తున్నాడు. సూర్యం, సత్యం, అది వరకులాగా పొద్దునే లేచి ఒకే పేపర్ తెప్పించుకుని యిద్దరూ చెరో ముక్కా చదువుకుంటున్నారు. అదివరకులాగే కలిసి మెలిసి ఉంటున్నారు. క్రిష్ణ రాధ లేకపోతే బొత్తిగా తోచడం లేదు

    "రాధ వెళ్ళాక ఇల్లు చిన్నబోయింది కదమ్మా!” అన్నాడు తల్లితో.

    వాత్సల్యంగా నవ్వింది ఆవిడ "ఎంతరా! ఇంకొద్ది రోజులేగా. ఈ సారి తీసుకొస్తే యిక పంపొద్దు దాన్ని. ఇక్కడే ఉంచుకుందాం" అనేసింది.

    తలొంచుకుని వెళ్ళిపోయాడు కృషి. ఒక దారికి వచ్చిన తన సంసారాన్ని చూసుకుని తృప్తిగా నిట్టూర్చింది ఆవిడ.

  • Next