• Next
  • హాస్టల్ జీవితం బాగు బాగు.....!

    మెడికల్ కాలేజీలో చేరేదాకా, నాకు హాస్టల్ జీవితంలోనే ఆనందాలు అనుభవించే అవకాశం రాలేదు. అప్పటిదాకా, ఇంటిపట్టునే బుద్ధిమంతుడిలా బ్రతకాల్సి వచ్చింది. మీరేమయినా అనండి "ప్రతి ఒక్కరూ కొద్దో గొప్పో హాస్టల్ జీవితం అనుభవించాల్సిందే. ఆ అనుభూతుల్ని జుర్రుకోవల్సిందే" అని నా అభిప్రాయం. చెడిపోవాలనుకుంటే హాస్టలే అక్కర్లేదు. ఎక్కడయినా దివ్యంగా భ్రష్టు పట్టవచ్చు. కానీ, మానసిక పరిధి పెరగాలన్నా, మనిషిగా పరిపక్వత చెందాలన్నా, హాస్టల్ జీవితానుభవాలు ఎంతైనా అవసరం. గుంటూరులో మా హాస్టల్ ఊరి బయట (ఆ రోజుల్లో) అమరావతి రోడ్డులో వుండేది.

    కాలేజీ ఇంకో వైపు వుండేది రోజూ 'అప్సర', 'అశ్వినీ' అనే రెండు బస్సులు మమ్మల్ని కాలేజీకి చేరుస్తుండేవి. హాస్టల్ లో ఓల్డ్ బ్లాక్, పాత పాతగా, న్యూ బ్లాక్ స్టయిల్ గా వుండేవి. ఆర్ధిక, సామాజిక, శారీరక, రాజకీయ పరపతి లేని అల్ప జీవులు ఓల్డ్ బ్లాక్ లో వుండేవాళ్ళు. ఎఛీవర్స్ అనబడే జమీందారీ గాళ్ళు న్యూ భ్లాక్ లో వుండేవాళ్ళు. ఎవడన్నా బడుగు వర్గం బ్లాక్ నుంచి 'బూర్జువా' బ్లాక్ కి మారగలిగితే (అంటే రూమ్ దొరికితే) అదో పెద్ద స్టేటస్ సింబల్. నా అదృష్టం బాగుండి, సోంపల్లి అని నా సీనియర్ స్నేహితుడి పరపతి వల్ల న్యూ బ్లాక్ లో వాడి రూమ్ లో చోటు దొరికింది.

    మ రూమ్ భోజనశాలకి దగ్గరగా వుండేది. ప్రతీ రాత్రీ మెస్ లో వెయిటింగ్ వున్నప్పుడల్లా, జనమంతా మా రూమ్ ని, మొహమాటం లేకుండా తమతమ రూముల్లాగా భావించి, చివరకు 'ప్రయాణీకులు వేచి యుండు ప్రదేశం'గా మార్చేశారు. ఆ సర్జనుల ప్రేమాభిమానాలు భరించలేక, (భో)జనాల వేళకు తాళం వేసి, బయటకు పారిపోయే వాళ్ళం. ప్రతి హాస్టల్ లో, కొంతమంది స్పెసిమన్ లు వుంటారు. వాళ్ళు లేకపోతే, జీవితంలో మజా ఏముంది గనుక. మా వింగ్ లో ఓ 'అతి శుభ్రప్రసాదు' వుండేవాడు.

    వాడెప్పుడూ జితేంద్ర స్టయిల్ లో తెల్ల బట్టలే వేసుకునే వాడు. దాని వల్ల మాకేం ఇబ్బంది లేదు కానీ, వాడికున్న ఇంకో అలవాటు వల్ల చచ్చిపోయే వాళ్ళం. వాడు ఉదయం ఓ రెండు గంటల పాటు మాత్రమే బాత్రూమ్ ని బ్లాక్ చేసేవాడు. వాష్ బేసిన్ ని ముందుగా సర్ఫ్, డెటాల్ కలిపిన నీళ్లతో కడిగేవాడు అరగంట పాటు. తర్వాత తడి లేకుండా తుడిచే వాడు, ఆ తర్వాత, దంత ధావనం. ఆ సింక్ దరిదాపుల్లోకి వెళ్ళడానికి లేదు మిగతా జనం. ఒక్కో వాష్ బేసిన్ ను, నలుగురయిదుగురు షేర్ చేసుకుంటే కానీ, కాలేజీకి టైమ్ కి చేరలేని నేపధ్యంలో, వీడి సుత్తెలా భరించే వాళ్లమో!!!

    ఈ సదరు ప్రసాద్ ఒక్కడే వుండేవాడు రూమ్ లో. ఎందుకంటే మామూలు మనుష్యులెవ్వరూ వాడి రూమ్మేటుగా వుండలేరు కనుక. 'తిండిపోతు తాతారావు' అని ఇంకో క్యారక్టర్ వుండేవాడు. వాడికి రెండో ఫిలాసఫీలు జీవితంలో. ఒకటి 'బ్రతుకుట తినుట కొరకే', రెండోది 'తిండి అంటే పక్కవాడి తిండి మాత్రమే', ప్రతి రూమ్ కి వచ్చి సిగ్గు పడకుండా (సిగ్గు లేకుండా అని చదువుకోవాలి), వెతికి మరీ తినుబండారాల్ని అన్నింటినీ రుచి చూసి వెళ్ళేవాడు.

    వాడి జిహ్యకి భయపడి చాలా మంది తాయిలాల్ని, ఏ ఎముకల పెట్టెల్లోనో, పరుపుల కిందో దాస్తుండేవాళ్ళు. 'కుళ్ళుబోతు కూర్మారావు' కథ వేరు. వాడు శుభ్రంగా ముందస్తుగా అన్నీ చదివేసుకుని, తర్వాత పక్క రూములో ఎవడు చదువుతున్నాడా అని ఆరా తీసి, వాళ్లందర్నీ వంతుల వారీగా, డిస్టర్బ్ చేసేసి, పండగ చేసుకునే వాడు. వీళ్లందరూ ఒక ఎత్తు. 'చేతివాటం చలపతి' ఇంకో ఎత్తు. వాడు రూమ్ కి వచ్చివెళ్లాడంటే ఏదో ఒకటి మిస్ అయినట్లే. దువ్వెన దగ్గర నుంచి 'డేవిడ్ సన్' టెక్ట్స్ బుక్ దాకా వాడి చేతివాటానికి కాదేదీ అనర్హం. ఇలాంటి అసాధారణ, ప్రతిభావంతుల మధ్య బ్రతకడం నిజంగా ఓ గొప్ప అదృష్టం. ప్రతి ఏడూ హాస్టల్ డే జరిగేది.

    ఆరోజు, అమ్మాయిల్ని గెస్ట్ గా ఆహ్వానించే సదుపాయం ఉండేది. ఆరోజు చూడండి, ప్రతి రూమ్ అద్దంలా వుండేది. మాసిపోయిన బెడ్ షీట్స్, కంపుకొట్టే టవల్స్, వీటన్నింటికీ సెలవు దొరికేది ఆరోజు. గోడల మీద శ్రీదేవి, సిల్కుస్మితల పోస్టర్స్ బెడ్ కిందకి వెళ్ళిపోయేవి. వాళ్ల స్థానంలో మదర్ థెరిస్సాలు, మహాత్మా గాంధీలు ప్రత్యక్షమయ్యే వాళ్లు. మరి అమ్మాయిల ముందు మన కారక్టర్ కి లిఫ్ట్ ఇవ్వాలి కదా. మా రూమ్మేట్ సోంపల్లి గాడయితే ఏకంగా 'టాల్ స్టాయ్' పుస్తకాలు, 'కెన్నెత్ గాల్ బ్రెత్' పుస్తకాలు హోల్ సేల్ గా కొనుక్కొచ్చి రూమ్ నింపేసేవాడు. 'అబ్బా ఏమి టెస్టు అండీ మీది' అని ఆ అమాయక అతివలందరూ వీడిని పొగిడేస్తుంటే, తెగ మెలికలు తిరిగే వాడు.

    వీడి అసలు టెస్టు 'శ్రీభగవాన్ డిటెక్టివ్ పుస్తకాలండీ బాబూ' అని చెప్పాలని నోటిదాకా వచ్చేది కానీ, సంస్కార వంతుడ్ని కదా... నా షెల్ఫ్ లో కూడా 'ప్రైడ్ అండ్ ప్రెజుడిస్', 'మై ఎక్స్ పెరిమంట్స్ విత్ ట్రూత్' లాంటి పుస్తకాలు వున్నాయి కదా. రాత్రిళ్ళు సెకండ్ షోలకి వెళ్ళడం, వాచ్ మెన్ లకి 'ఆమ్యామ్యా' సమర్పించుకొని, రూముల్లోకి దూరడం, అతిసాధారణమైన విషయం. పరీక్షలప్పుడు మంటలే మంటలు. గడ్డాలు పెంచుకొనీ మరీ చదివే వాళ్లం. ఇలా ఆడుతూ, పడుతూ బ్రతుకు సాగిపోతున్న సమయంలో ఓ ఘోరం జరిగిపోయింది.

    దాంతో, నా హాస్టల్ జీవితం, మొగ్గలోనేతుంచి వేయబడింది. ఆ ఘోరమేమిటో తెలుసుకోవాలంటే వచ్చేవారం దాకా ఎదురు చూడాల్సిందే.

  • Next