TeluguOne Services
Copyright © 2000 -
2025
, TeluguOne - Comedy - All rights reserved.
This story is a courtesy of Padma Bhushan Varaprasad Reddy.
జంతువులకి రాణి చలిజ్వరం మనిషికెందుకొస్తుంది !? అంటూ ధ్వజమెత్తిన
“ దోమలు నల్లులు ఎలకల మహాసభ "
పానుగంటి లక్ష్మీనరసింహారావు
సాక్షి సంఘానికి ఓ ఉత్తరం చేరింది.
“ నేను ఓసారి రైల్లో ఊరు వెళుతూ పుస్తకం చదువుకుంటున్నాను. దోమలు చెవి దగ్గర చేరి గాన కాలక్షేపం ఆరంభించాయి.
నేను పడుకున్న పరుపును ఆశ్రయించి అభివృద్ధి చెందుతున్న నల్లులు తమ స్థానాన్ని ఆక్రమించినందుకు చెడామడా పోడవ సాగాయి.
టికెట్టు లేకుండా ప్రయాణం చేస్తున్న చిట్టెలుక ఒకటి " నువ్వు ఈ సెంటర్ క్లాసు పెట్టెలో కూచోడానికి అర్హుడువి కావు " అన్నట్టు చూస్తోంది.
ఇక చదువు సాగదని పుస్తకం మూసి నిద్రపోయాను.
నిద్రలో ఒక కల.
అదో పెద్ద మైదానం. నాలుగు భాగాలుగా విడగొట్టబడింది.ఒక భాగంలో లక్షలాది దోమలు వేర్వేరు గుంపులు ఉన్నాయి.అనేక జండాలు. ఆ జండాల మీద "పాలకొల్లు మశకముల విడిది ", “ కొల్లేటి మశక రాజుల మహలు ", “ అనెగొంది మశక సార్వభౌముల నికేతనం " అని వేర్వేరు గుంపులున్నాయి.
పక్కనున్న గూడారాలు చిట్టెలుకలవి.
ఇంకో విడిదినిండా నల్లులు.
సభా మధ్య ప్రదేశంలోకి ఒక నల్లి ఎర్ర ముఖముల్ కోటు వేసుకుని వచ్చి దీర్ఘవాలుడనే మూషిక శిఖామణిని సభకు అధ్యక్షుడిగా ప్రపోజ్ చేసింది.
వెంటనే బోదురు కప్పంత సైజులో ఉన్న కొల్లేటిదోమ వచ్చి, ఆ ప్రతిపాదనను సెకండ్ చేసింది. గప్పుమని ఒక్క పెట్టున దోమలన్నీ సంతోష సూచకంగా మొర పెట్టాయి.
ఎలకలన్నీ తోకలు నేలమీద కొట్టి వాలతాళ ధ్వనులు చేశాయి.
అధ్యక్షుడుగా ఎన్నికయిన ఎలుక, పెద్ద ఉపన్యాసం ఇవ్వడం మొదలు పెట్టింది.
“ నన్ను ఎన్నుకున్నందుకు దోమలకు, నల్లులకు, ధ్యాంక్స్. ఓ దోమల్లారా మీకున్న వ్యోమయాన శక్తి, కంఠస్వర మాధురీపాకము నాకు లేదు.ఓ నల్లుల్లారా మీలా శరీర సౌష్టవం , శత్రుహింసా పరాయణత నాకు లేవు.అయినా నాకు ఈ పదవి ఇచ్చి సత్కరించారు.
మనకు ముఖ్య శత్రువు నరుడు. నరజాతి అంతటి తుచ్చజాతి ఈ ప్రపంచాన లేదు.తాను మహావీరుడని పోజు ఒకటి. తేలును చూస్తే భయం. జెర్రిని చూస్తే భయం. పాముని చూస్తే పరుగు.
దోమ కరిచిపోతుందేమోనని సాయంకాలానికి దోమతెర గుడారంలో దూరతాడు. నల్లి ఒక్కటి పొడిస్తే కల్లు తాగినవాడిలా తైతక్కలాడుతాడు.
మనం చూడండి. తుఫాను పట్టినా, అగ్ని పర్వతం పేలినా హాయిగా తిరుగుతాం. వాడి బుద్ది చూడండి. ఎలకలను చంపడానికి ఎన్ని మార్గాలు పడతాడో చూడండి. కర్ర బోనులు, లోపల గారె ముక్కలు, వాడి మాయమండ, ఎందుకీ దగాబాజీ ? తిండి పేరు చెప్పి ఆశ పెట్టి చంపుతున్నాడే.
మన దోమసోదరులకు సామూహిక మరణం ప్రసాదించడానికి పౌడర్లు చల్లుతున్నాడే !ఇంత టక్కరి వేరెవరైనా ఉన్నారా ? వాడి విశ్వాస ఘాతుకత్వం చూడండి. మన సోదరులలో ఒక దోమను తీసుకోండి.
ఒకసారి ఒక మనిషిని కరిచిందనుకోండి. మళ్ళీ ఎప్పుడైనా వదులుతుండా? బట్టతో విదిలించినా, చేతితో తోసేసినా, చెవులు మూసుకున్నా వెళ్ళిపోతుందా ? మంచో, చెడో మళ్ళీ మళ్ళీ అతన్నే కరుస్తూ అతని దగ్గరే పడివుంటుంది కానీ విశ్వాసం మరచిపోయి వెళ్ళిపోదు.
అదే విధంగా నల్లులు పాతదో, కొత్తదో, ఓ తుంగచాపను గాని, ఓ కుర్చీని గాని, మంచాన్ని గాని, ఆశ్రయించుకుని ఉంటే హరీమనే వరకు దానిని వదిలిపెట్టవు కదా ! దాని మీద పడుకున్న మనిషి రక్తం ఎంత కొద్దిగా తాగినా ఆ విశ్వాసం మరవదు.
ఎండలో పెట్టి మోదినా, ఉడుకు నీళ్ళు పెట్టి తడిపినా, ఆ క్షణానికి అప్పటికప్పుడు చచ్చినట్టుపడి వుండి, మర్నాటి కల్లా పదునెక్కి అతను చేసిన ఆకృత్యాలను లెక్క పెట్టకుండా అతన్నే ఆశ్రయించుకొని అంటకాగి ఉంటాయి.కానీ అవతలికి పోతాయా ?
మా ఎలుకల గురించి చెప్పాలంటే ఫలహారం బీరువాలోనో ధాన్యపు గాదెలోనో ఒకసారి దూరితే బయటపడటం ఉంటుందా ? ఇంట్లో దాసీ చీపురు కట్టతో కొట్టినా, పిల్లాడు ఓ ముక్క ఉండ్రం ముక్క పెట్టి కొట్టినా సమానంగానే చూస్తాం.
కానీ కృతజ్ఞత చూపుతామా ? మరి మనిషి సంగతి... మహారాజు. శాలువాలిచ్చినప్పుడు పుచ్చుకుంటాడా, ఒక్క మాట అంటే చాలు విడిచిపెట్టి పోతాడు.”
అలా అధ్యక్షోపన్యాసంలో నరుల్ని తిట్టి పోసిన మూషిక శిఖామణి ప్రధానోపన్యాసం తరువాత కీచురావు అనే దోమను పిలిచారు.
దాని ఉపన్యాసం ఇలా సాగింది.
“ అధ్యక్షులు చెప్పినట్టు మనిషి భయస్తుడు, దుర్భుద్ది, విశ్వాసఘాతకుడు మాత్రమే కాదు.పెద్ద తెలివైనవాడిలా పోజుకొడతాడు కూడా.సృష్టి మొదలులో ఉన్నది మనమా ? వాడా ?మనం పుట్టిన ఎన్నో తరాల తర్వాత పుట్టుకోచ్చాడు.
మనల్ని చూసి అనేక విద్యలు నేర్చుకున్నాడు.అసలు గానం ఎవరి దగ్గర నేర్చుకున్నాడు? మన దోమ సోదరుల వద్దనే కదా ! ఏవియేషన్ అనేది ఇప్పుడు తనే కనిపెట్టినట్టు ఎగిరెగిరి పడుతున్నాడు.
అది మా దోమల వద్ద నుండి హరించిన కళ కాదా ? భూమిని తవ్వే 'జియాలజీ 'ఎవరి వద్ద సంగ్రహించాడు.మా ఎలుకల వద్ద కాదా ? ధాన్యపు మరల్లో. ఇతర యంత్రాలలో పెట్టిన పళ్ళ చక్రాల ఐడియా ఎలకలను చూసి కదా నేర్చుకున్నది ? మేం కరిస్తే మలేరియా వస్తుందన్న కొత్త సిద్దాంతం లేవదీసి మమ్ముల్ని చంపడాన్ని సమర్థించుకుంటున్నాడు.
సింహం మొదలు చీమ వరకు మా కాటుతినని జంతువుందా ? వాటిన్నింటికి రాణి చలి జ్వరం వీడికెలా వచ్చింది ? పైగా అందరికీ రాలేదేం ? వీళ్ళలోనే విషజాతి ఏదైనా ఉందేమో ! మాట వరసకి మనవల్ల అతనికి బోదకాలు వచ్చిందనే అనుకుందాం.మరి అతని రక్తం తాగడం వల్ల మనకు ఎని వ్యాధులు వచ్చాయో తెలుసా ?
నరరక్తం తాగడం వలన మా పుట్టి మునిగింది.ఆ రక్తంలో ఉన్న దోషాలు మాకు సంక్రమించాయి.మేం ఎప్పుడు వర్ణ భేదం ఎరగం.ఇప్పుడు ఇది ప్రారంభమయింది.?
నల్ల దోమలట, ఎర్ర దోమలట, ఎర్ర దోమలకంటే నల్ల దోమలు ఎక్కువట.మశక బ్రహ్మ మూతి మీసాల నుండి పుట్టినదొక జాతట.రెక్కల నుండి ఒక జాతట.ఇది సాపడిన పేడకడి అది తాకకూడదు.
అది తాగిన మురికి నీరిది తాకకూడదు. దీనికంతా కారణం మానవరక్తం.”
ఆ తర్వాత ఉపన్యాసం ఇచ్చినది మత్కుణ మహారాజ మంజుళాచార్యుల వారు.
“ మాకు మనిషి రక్తంతో కడుపు నింపుకోవడం కంటే తిండికి వేరే మార్గం లేదు.అందుచేత మనిషికి ఉండే అవగుణాలన్నీ మాలో సంపూర్ణంగా ఉన్నాయి. చేతల కంటె మాటలు ఎక్కువయ్యాయి.
నల్లజాతి అభివృద్ధి గురించి ఉపన్యాసాలు దంచుతున్నారు.కానీ ఆచరణ మాటలేదు.నరుని రక్తం తాగకూడదని ఉపన్యసించేవారే అది త్రాగి, త్రాగి అజీర్తి బాధ తెచ్చుకుంటున్నారు. మలేరియా, ప్లేగు పేరు చెప్పి దోమలను, ఎలుకలను చంపినట్టే కాలాహజారుని మేము వ్యాపింప చేస్తున్నామని చెప్పి మమ్ముల్ని చంపుతున్నాడు.
అన్ని జాతి జంతువులను చంపి వీడొక్కడే ప్రపంచంలో ఏం చేయదలచుకున్నాడు.” అని అంటుండగానే తెల్లవారనారంభించింది.
దాంతో కలకలం !
“ అమ్మో..తెల్లవారితే నరుడు లేస్తాడు. మన పని ఆఖరు. అదిగో నరుడు ! పొండి పొండి పారిపోండి, ఎగిరిపొండి...” అని అవి అరుస్తుండగానే నాకు మెలకువ వచ్చేసింది.
కల కరిగిపోయింది.
లేచి చూస్తే ఒక ఎలుక నా కాలిపైకి ఎక్కింది.అమ్మయ్యో అని లేచిపోయి చూద్దును కదా ! నేను, చేరవలసిన ఊరు వచ్చేసింది.
(హాస్యం సౌజన్యంతో )