• Next
  • సినిమాకో కథ కావాలి - 5

    Listen Audio File :

    `ఎల్లారావుకి కోపం వచ్చింది. “హీరోయిన్ ని నీ యిష్టం వచ్చినట్లు రేప్ చేయించేస్తే ఇంక కథేం వుంటుందయ్యా....?ఆ...? ఆ నలుగురు గుండాలు రేప్ చేయడానికి ప్రయత్నిస్తుండగానే గోపీ అక్కడికి వచ్చి గూండాలతో కరాటే స్టయిల్లో ఫైటింగ్ చేసి చావగొట్టి రాధని రక్షిస్తాడు... ఇదీ కథ...” అన్నాడు ఎల్లారావు ఊపిరి తీస్కుంటూ.

    'శభాష్.. సూడు రైటరూ.... కథ ఎలా బాగుంది. ఇలాగైతే మన సిన్మాలో ఓ రేపుసీను కూడా వుంటుంది. మరి అక్కడి నుంచి మిగతా కత నువ్వు చెప్పు...” అన్నాడు భేతాళరావు.

    చంచల్రావు కథ కంటిన్యూ చేశాడు. “రాధని రౌడీల బారినుండి రక్షించిన గోపీ ఆమెని ఇంటిదగ్గర దిగబెడతాడు. ఆ సమయంలో ఇంటి దగ్గర రాధ తల్లి మంచం మీద దగ్గుతూ వుంటుంది..... రాధ గోపీని తల్లికి పరిచయం చేసి తనని రౌడీలనుండి ఎలా రక్షించాడో చెప్తుంది. బాబూ.... ఇంక మా రాధకి నువ్వున్నావ్. నేనింక నిక్షేపంగా కళ్ళు మూస్తానని రాధ తల్లి రాధ చేతిని గోపీ చేతిలో పెట్టి కళ్ళు మూస్తుంది.

    దిక్కులేని రాధని గోపీ ఇంటికి తీసుకెళ్తాడు. రాధని ఇంట్లోకి రానివ్వరు గోపీ తల్లీ తండ్రీ.... గోపీ నీ ఆస్తిలో చిల్లిగవ్వ అక్కర్లేదు అని రాధతో కలిసి ఊరి బయట గుడిసెలో వుండి ఊళ్లో మిరపకాయ బజ్జీలమ్ముకుంటూ రాధని పోషిస్తుంటాడు...”

    మధ్యలో భేతాళరావు అడ్డు తగిలాడు. “కథలా సాఫీగా సాగిపోతే ఎలా... బోల్డన్ని కష్టాలు వుండాల.... సినిమా చూసే ఆడాళ్ళ కళ్ళల్లో జమ్మని నీళ్ళు తిరిగిపోవాల.... అప్పుడు పిచ్చరు హిట్టవుద్ది..”

    “హీరోయిన్ కి హీరికి మనస్పర్థలు వచ్చి విడిపోవాల... అన్నాడు కూర్మారావు. చంచల్రావు నిమిషం సేపు ఆలోచించి తల విదిలించాడు.

    'నే చెప్పనా?... హీరోయిన్ తండ్రి ఒకప్పుడు హత్య చేయబడతాడు. ఆ హత్య చేసింది హీరో తండ్రే అని హీరోయిన్ కి తెలుస్తుంది. అంతే, రాధ గోపీని వదిలిపెట్టి వెళ్ళిపోయి ఇంకో ఇంట్లో పనిమనిషిగా చేర్తుంది... సుకుమారమైన రాధ అంట్లు తోముతుంటే ప్రేక్షకుల కళ్ళనుండి కన్నీళ్ళు రాకమానవు అన్నాడు శంభులింగం.

    “అంతేకాదు.. రాధ అనుకున్నట్టు తన తండ్రిని గోపీ తండ్రి చంపడు. అసలు హంతకుడు వేరే వుంటాడు. గోపీ ఆ రహస్యాన్ని చేదించి అసలు హంతకుడిని పోలీసులకి పట్టిస్తాడు... రాధ గోపీ కలుస్తారు....” అన్నాడు కూర్మారావు ఉత్సాహంగా.

    “శభాష్.. శభాష్.. మరిక గోపీ తల్లిదండ్రుల్ని ఎలా వప్పించి రాధని పెళ్ళి చేసుకుంటాడో నువ్వు చెప్పవయ్యా రైటరూ...” అన్నాడు భేతాళరావు.

    చంచల్రావు మళ్ళీ కథని కంటిన్యూ చేశాడు. దానికి చుట్టూ చేరిన వాళ్లు కొంత కొంత కలుపుతూ వచ్చారు. కథని పూర్తిగా షేపుకి తీసుకు రావడానికి ఒక వారం రోజులు పట్టింది. చంచల్రావు భేతాళరావుని కథకి డబ్బులు అడిగాడు.

    “సినిమా రిలీజయ్యాక చూద్దాంలే...” అన్నాడు భేతాళరావు.

    రెండు నెలల్లో షూటింగ్, డబ్బింగ్, రీరికార్డింగ్ అన్నీ పూర్తిచేసుకుని సినిమా రిలీజైంది. మొదటిరోజు మొదటాటకి వెళ్ళిన చంచల్రావు డంగై పోయాడు. సినిమా కథ ఆండాళ్ళమ్మ అని టైటిల్ వేశారు. ఆరోజు భేతాళరావు ద్వారకా హోటల్లో వున్నాడని తెలిసిన చంచల్రావు అతని దగ్గరికి పరుగెత్తుకు వెళ్ళి "అన్యాయం... అక్రమం.. టైటిల్స్ లో నా పేరు లేదు....” అని అరిచాడు.

    “సాల్లేవయ్యా... ఎవరైనా వింటే నవ్వుతారు.. అసలు కథ నువ్వెక్కడ చెప్పావనీ... మొత్తం పాయింట్లన్నీ నేనూ, నా బామ్మర్ది, తమ్ముడూ, డైరెట్రూ, అసిస్టెంటు డైరెట్రూ మేమంతా కలిసి అందించినవేగా... అలా పాయింట్లన్నీ అందిస్తే కతలెవరైనా చెప్తారు. ఈ మాత్రం దానికి నీ పేరు కూడా వెయ్యాలా...? అందుకే మా యావిడ పేరును వేశాను..ఏదో ఒక వారం రోజులు మా చుట్టూ తిరిగావ్ కదా.... దానికి ఓ నాలుగొందలుంచు....” అంటూ జేబులోంచి పర్సు తీశాడు భేతాళరావు.

    చంచల్రావు తెల్లబోయాడు.

    (ఇది కేవలం సరదాకి రాసిన కథ. అంతేకాని ఎవరినీ ఉద్దేశించి రాసింది మాత్రం కాదు.)

  • Next