• Next
  • Antera Bamardee 31

    Anthera Bammardhi 31

    బసవరాజు తన కుమార్తె ప్రవర్తనకు షాకు తిన్నాడు. ఆమె గది తలుపు తడుతూ ఎంతో ఆప్యాయంగా పిలుస్తున్నాడు.

    “అమ్మా! ఉమా! నేనమ్మా! మీ నాన్నని! తలుపు తియ్యమ్మా? ఎందుకంత భయం? తలుపుతియ్యమ్మా! అమ్మడూ!” అప్పటికే వేణు నేలమీద పడ్డ నవలను తీసి పరీక్షించాడు. ఆపని పూర్తయింతర్వాత బసవరాజుతో తాపీగా అంటున్నాడు.

    “ఉమ తలుపు తియ్యదు” బసవరాజు గబగబా వేణు దగ్గిరకొచ్చి అడిగాడు.

    “ఎందుచేత? ఎంచేత తియ్యదు! కారణం? చెప్పు నాకు! బసవరాజుకి నవల చూపిస్తూ వేణు అన్నాడు.

    “ఇదొక నవల!” అదేమిటని అడగలేదు నేను. ఉమ తలుపు ఎందుకు తియ్యదు అదిచెప్పు నాకు! కన్నతండ్రిని నన్ను చూచి ఎందుకు భయపడి పారిపోయింది. అది కూడా చెప్పు.

    ఉమ నవల చదివింది మళ్లా నవలంటావేమిటి? నవలకీ ఉమ పిచ్చి చేష్టలకీ లింకుంది! ఆశ్చర్యపోకండి! కేవలం ఈ నవల చదివిన కారణంగానే ఉమ పిచ్చిపిచ్చిగా వ్యవహరిస్తోంది. మిస్టర్ వేణూ! అరవకండి! ఏదో చదివి ఏదో విని తిక్కతిక్కగా ప్రవర్తించడం మీ ఒక్కరి ప్రత్యేకతే అనుకుని మురిసిపోకండి! మీ అమ్మాయి ప్రవర్తనకి ఈ నవల్లో కథావస్తువే మూలకారణం! ఆ కథ అలాంటిది!” ఎలాంటిది? అది చెప్పు నాకు! “ఒక తండ్రి డబ్బుకి ఆశపడి కన్నకూతుర్ని ఒక లేత వయస్సు పిల్లని వయస్సు ముదిరిన మనిషికిచ్చి పెళ్ళి చేస్తాడు!”

    “చేస్తాడయ్యా! ఏమైనా చేస్తాడు! అది కథ కథ కోసం దిక్కుమాలిన పనులు అనేకం చేస్తాడు.”

    “మీరు కూడా ఆపనే చేస్తారనే భయంతో ఆందోళన మిమ్మల్ని చూడగానే కెవ్వున అరిచి తన గదిలోకి పారిపోయింది.”

    “ఏమిటేమిటి? నేను కూడా ఉమకి అల్లాంటి పెళ్లి చేస్తానని భయపడిందా?” అని తలుపు దగ్గిరికి వెళ్లి అరుస్తున్నాడు.

    “అమ్మా! ఉమా! నువ్వు చదివిన నవల ఉత్త చెత్తమ్మా! చెత్త నవల చదివావ్! నీ తండ్రి ఆ తండ్రిలాంటి వాడు కాదు! కాలేదు! ఒక లక్షణమైన కుర్రాడితో నీ పెళ్లి ఘనంగా చేస్తానమ్మా!” వేణు బసవరాజుకి సైగ చేశాడు తన దగ్గరికి రమ్మన్నట్టు.

    బసవరాజు గంగిరెద్దు మాదిరి గబగబా వేణు దగ్గరకి నడిచాడు. .

    “పాతచింతకాయ పద్దతుల్తో పని జరగదు! ప్రతి తండ్రీ చెప్పే డైలాగులే మీరు కూడా చెబుతున్నారు. ఈ డైలాగులు ఓదార్చడానికి సూటవుతాయే గాని తలుపు తీయడానికి సహకరించవు.”

    “ఎలాంటి డైలాగులు చెప్పమంటావ్?”

    “కేవలం డైలాగులే కాదు. ఆ డైలాగుల్లో హామీలు కూడా వినిపించాలి.”

    “అదేనయ్యా! ఆ వరసే చెప్పమంటున్నా!”

    “నే చెప్పినట్టు చెప్పడం మీకు వీలుకాదేమో!”

    “అవుతుంది!”

    “అక్షరం పొల్లు పోకుండా చెప్పాలి!”

    “ఇన్ని శరతులేమిటయ్యా బాబూ?”

    “లేకపోతే ఉమ తలుపుతియ్యదు! ఆ నవల్లో కథా వస్తువు అల్లాంటిది. దాని ప్రభావంతో ఉమ మెదడు చెడిపోయింది. మీరు ఆలస్యం చేస్తే తలుపులు మూసివున్న ఆ గదిలో ఉమ ఏదైనా అఘాయిత్యం చేసుకోవచ్చు.”

    “వేణూ!” వేణు ఒక కాగితం తీసి బసవరాజు చేతిలో పెట్టాడు.

    అందులో ఏదో రాసి వుంది. రాసిన వాక్యాలు చదవకుండా అడిగాడు బసవరాజు.

    “ఏమిటది?”

    “మీరు చెప్పవలసిన డైలాగులు!”

    “ఎప్పుడు రాసావు?”

    “మొన్న రాశాను.”

    “ఇలాంటి సందర్భం వస్తుందని నీకు మొన్నే తెలుసా?”

    “ఖచ్చితంగా వస్తుందని తెలీదు వచ్చే ఛాన్సుందని ఊహించాను. అందుకే మీరు చెప్పవలసిన డైలాగులు పకడ్బందీగా తయారు చేసి సిద్ధంగా వుంచుకున్నాను.”

    “నీకు ముందు చూపు చాలా ఎక్కువ.”

    “ముందు మీరు చెప్పవలసిన డైలాగులు చూడుకోంది.” అని గబగబా ఉమ గదివైపు వెళ్ళిపోయాడు.

    ఆ గది తలుపు దగ్గర నిలబడి ఆ కాగితమ్మీద రాసిన డైలాగులు చదివేందుకు జేబులోంచి కళ్లజోడు తీశాడు.

    * * *

    వెంకటేశ్వర స్వామి దేవాలయం ఆ ప్రాంగణంలోకి అడుగు పెట్టాడు రంగనాధం. అక్కడికి రావాలని అతను రాలేదు. తనకి తెలీకుండానే వచ్చేశాడు. బహుశా ఘంటసాల భగవద్గీత వింటూ వచ్చాడు కాబోలు. తాను వచ్చినతర్వాత భగవద్గీత ఆగిపోయింది. ఇంతదూరం వచ్చింతర్వాత వెంకన్నను చూడకుండా వెళ్లిపోతే తప్పవుతుందనే ఉద్దేశంతో దైవదర్శనం కోసం గుళ్లోకి అడుగుపెడుతున్నాడు రంగనాధం.

    * * *

    ఉమ గది ముందు మూసిన తలుపుల దగ్గర నిలబడి వేణు యిచ్చిన కాగితంలోని అక్షరాలను శ్రద్ధగా చదువుతున్నాడు బసవరాజు. “అమ్మా ఉమా! తొందరపడి అఘాయిత్యం చేసుకోవద్దు! నువ్వు చదివింది ఒకానొక చెత్త నవల! ఆ నవల్లో తండ్రి ఒక చెత్త తండ్రి. అతని నిర్ణయం పరమ చెత్త నిర్ణయం. ఆ మొత్తం చెత్తనంతా చదివి మనసు పాడుచేసుకున్నావు కాబోలు. నీ తండ్రి ఆ తండ్రిలాంటి కసాయివాడు కాదు. కాలేడు. అందుచేత నీ పెళ్లి విషయంలో ఎల్లాంటి ఆందోళన పడవద్దు. నీ పెళ్లి నీ యిష్ట ప్రకారమే జరుగుతుంది. నువ్వు ప్రేమించిన కుర్రాడితో నీ పెళ్లి చేసేందుకు నేను సిద్ధంగా వున్నాను. ఈమాట నేను త్రికరణశుద్ధిగా చెబుతున్నానమ్మా. పంచభూతాల సాక్షిగా చెబుతున్నాను.” బసవరాజు చదవడం పూర్తి చేసి ఆయాసపడుతుండగా సడన్ గా గది తలుపులు తెరుచుకున్నాయి.

    ఉమ ఆగదిలోంచి బయటకు వచ్చి బసవరాజు పాదాల్ని తాకింది. చిట్కా పనిచేసినందుకు బసవరాజు ఆనందించాడు. అందువల్ల వేణుని క్రీగంట చూస్తూ థ్యాంక్స్ అన్నాడు.

    * * *

    శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో రంగనాధం హారతి కళ్లకద్దుకున్నాడు. పూజారి యిచ్చిన కొబ్బరి చిప్పను తీసుకుని కదిలాడు. మంటప్పమ్మీదికొచ్చి మంటపం అంచున కూచున్నాడు. కొబ్బరి చిప్పను పగలగొట్టే ప్రయత్నంలో వుండగా ‘నన్ను క్షమించరా సింగినాధం’ అని వినిపించింది.

    రంగనాధం ఉలిక్కిపడ్డాడు. ఆ శబ్దం ఎక్కడ్నుంచి వచ్చిందో తెలీక కొబ్బరి చిప్ప వైపు క్షణం పాటు చూచి దాన్ని చెవి దగ్గర పెట్టుకున్నాడు.

    “క్షమించమని అడిగింది కొబ్బరి చిప్పకాదు. నేను!” ఆ మాటకి అటూ యిటూ చూస్తుండగా మంటపం మీదికి వస్తున్న బసవరాజు కనిపించాడు.

    బసవరాజుని చూడగానే రంగనాధం గబిక్కున లేచి నించున్నాడు. చేతులు రెండూ ముందుకు చాచి ‘బసివీ’ అని ఆత్మీయంగా పిలిచాడు. “దేవుడ్ని చూద్దామని వచ్చేనురా. ఇక్కడ నువ్వు కనిపిస్తావనుకోలేదు.” అన్నాడు బసవరాజు.

    “అనుకోకుండా వచ్చాను.”

    “అందుకే కలుసుకున్నాం.”

    “బావున్నావా?”

    “ఏమడుగుతావులే! వార్తలు చదివించుకుని వాతలు పెట్టించుకుని వాజమ్మగా బతుకుతున్నాను. నువేట్లా వున్నావ్?”

    “చూస్తూ అడుగుతావే? అకాస్మాత్తుగా రవుడీ అవతారం ఎత్తి ప్రాణమిత్రుల ఉసురు పోసుకున్నాను.” నువ్వు మంచివాడివేరా? నేనే దుర్మార్గుడిని! రౌడీని! నాకోసం నా ఆఫీసుకి వచ్చిన నిన్ను ఏదో దిక్కుమాలిన వార్త ప్రభావంతో బయటకు గెంటించిన పొగరుబోతు రౌడీ వెధవని! నాకు బుద్ధి వచ్చిందిరా సింగినాధం. ఎక్కడో ఏదో జరిగిందనే వార్త చదివి అదే నాకూ జరుగుతుందనే సిద్ధాంతం పరమ తప్పని తెలుసుకున్నాను.”

    “తన కోపమే తనకి శత్రువనే నీతి వాక్యానికి నీళ్లొదిలేయడం మహా పాపమని నేను కూడా తెలుసుకున్నానురా.”

    “మనం చాలా చాలా తెలుసుకున్నాంరా.”

    “అందుకే గుళ్ళో కలుసుకున్నాం.”

    “ఒరే సింగినాధం! వెళ్ళిపోదాం! వెనక్కి వెళ్లిపోదాం!” రంగనాధం తన వెనుక చూసుకున్నాడు.

    మంటపం అంచున నిలబడినట్టు తెలుసుకుని “వద్దురా! బసివీ! వెనక్కి వెళ్లలేం!”

    “నామాట విను!”

    “వెనక్కి వెళితే పడిపోతాం రా!”

    “ఫర్లేదు! వెనక్కి పద!”

    “ఈ వయస్సులో కిందపడితే మళ్లా లేవలేం!”

    “అయినా సరే! పదా వెనక్కి!”

    “నా మాట విను! పడితే నడుం విరుగుతుంది. నీ దగ్గిర డబ్బుంది గనక అమెరికాలో వైద్యం చేయించుకుని హాయిగా తిరగ్గలవు! నా దగ్గర డబ్బులేదు గనక అనకాపల్లి కూడా వెళ్లలేక మంచాన పడతా.”

    బసవరాజుకి అనుమానం కలిగి అడిగాడు “ఏం మాటాడుతున్నావ్ నువ్వు?”

    రంగానాధానిక్కూడా అనుమానం కలిగి “ఏమడుగుతున్నావ్ నువ్వు?” అన్నాడు.

    “మళ్లా మన కాలేజీ రోజుల్లోకి అడుగుపెడదామంటున్నాను. నువ్వేం మాటాడుతున్నావ్?”

    “మంటపం అంచున నిలబడ్డాం గదా! వెనక్కి వెడితే పడిపోతామని చెబుతున్నా.” ఆ మాట వినగానే బసవరాజు ఒక స్థంభం దగ్గిరికి వెళ్లి ఆ స్థంభాన్ని ఆనుకుని అన్నాడు.

    “అంతేరా అంతే. పార్థం చేసుకోవడం నీకు మొదట్నుంచీ అలవాటే.” అప్పటికే రంగనాధం ఇంకో స్థంభాన్ని వెతుక్కోడం అక్కడికి గబగబా వెళ్లిపోవడం జరిగింది.

    అందుచేత ఆటను కూడా స్థంభాన్ని ఆసరా చేసుకుని అంటున్నాడు. “అర్థం లేకుండా వాగడం నీకూ అలవాటే.” ఇంకా ఏమి విసుర్లు చోటు చేసుకుని వుండేవో అని సరిగ్గా అప్పుడే గుళ్లో గంట మోగింది. ఇంకా మోగుతూనే ఉంది. ఇద్దరూ అటువైపు చూశారు.

    వేణు ఉమ కలిసి జాయింటుగా గంటకొడుతున్నారు. ఆపని పూర్తిగాకానే ఇద్దరూ జాయింటుగానే ప్రదక్షిణలు ప్రారంభించారు. బసవరాజు స్థంభాన్ని విడిచిపెట్టకుండా అంటున్నాడు.

    ఆ అమ్మాయి నా కూతురు. పేరు ఉమ. రంగనాధం కూడా స్థంభాన్ని విడిచిపెట్టకుండానే అంటున్నాడు.

    “ఆ అబ్బాయి నాకు బామ్మర్ది. పేరు వేణు.”

    “మీ బామ్మర్ది చమత్కారి. కాగితంలో రాసింది చదవమంటే చదివాను. దాని ఫలితం గుళ్లో గంట కొట్టాడమని ఇప్పుడే తెలుస్తోంది.”

    “నువ్వు చెబుతున్నదేమిటో అక్షరం కూడా అర్థం కాలేదు. అందుకే అర్థం లేకుండా వాగడం నీకు అలవాటేనని ఇంతకు మునుపే అన్నాను.” బసవరాజు ఏమి చెప్పేవాడో కానీ సడన్ గా పాణి మంటపమెక్కేసి బసవరాజుతో అంటున్నాడు.

    “క్షమించాలి”

    “నువ్వెందుకొచ్చావ్?” అన్నాడు బసవరాజు.

    “కన్నడం పేపర్లో మోడరన్ కళ్యాణం గురించి ఒక మంచి వార్త పడింది. సార్! ఆ వార్త నాచేత చదివించుకుని ఆ ప్రకారమే తమ కళ్యాణం కూడా జరగాలని మిస్ ఉమ, మిస్టర్ వేణు దేవుడ్ని వేడుకోవడానికి వచ్చారు సార్. ఈ వార్త మీ చేవినేద్దామని” బసవరాజు రంగనాధంతో అంటున్నాడు.

    “విన్నావా? మీ వాడూ మా అమ్మాయీ పెళ్లి చేసుకుంటారట? “ఆమాట దేవుడ్తో కాకుండా మనతో చెప్పివుంటే బాగుండేది.

    ” అంతలో డాక్టర్ మురళి దంపతులు కూడా మంటపమెక్కారు. “మీ పెద్దవాళ్ల తరపున మేము చిన్నవాళ్ళం ఒకె అనేసేం.” అన్నాడు డాక్టర్ మురళి.

    “పెద్దలూ పెద్దమనసు చేసుకుని వాళ్ల పెళ్లికి అంగీకరించండి.” అన్నది పద్మ.

    చివరికి జానకీ అన్నపూర్ణమ్మలు కూడా మంతపమేక్కారు. ఆడవాళ్లం. ఇంటికి దీపాల్లాంటి వాళ్లం. వాళ్ల పెళ్లికి మేమిద్దరం అంగీకరించాం.” అన్నది జానకి. మీ మాదిరి తొందరపడే స్వభావం మాకులేదు. అంచేత మా నిర్ణయం కాదనకండి.” అన్నది అన్నపూర్ణమ్మ.

    రంగడు కూడా మంటపమెక్కి అంటున్నాడు. “అయ్యా! ఊ అనండయ్యా! ఆళ్ల కారుకి డ్రైవరుగా కొలువు చేసుకుంటా.” బసవరాజు రంగనాధంలు మొహమొహాలు చూసుకుంటున్నారు. మళ్లా గుళ్లో గంటలు వినిపిస్తున్నాయి. మళ్లా వేణు ఉమలు గంట కొడుతున్నారు. బసవరాజు భార్యని అడిగాడు. ఇంతకీ వాళ్ల పెళ్లి వాళ్లే చేసుకుంటారా? మేము జరిపించాలా? అది చెప్పు నాకు.” “మీ అంగీకారంతోనే ముహూర్తం పెట్టుకుందాం.” అన్నది జానకి.

    రంగనాధం అన్నపూర్ణమ్మతో అంటున్నాడు. ముహూర్తాలు పెట్టుకోకుండా అడ్వాన్సుగా గంటలు కొడుతున్నారంటే ఇదంతా మీ తమ్ముడి నిర్వాకమని ఈజీగా అర్థమవుతోంది. స్పీడు తగ్గించుకోమని చెప్పు”

    “ఎందుకు తగ్గించుకోవాలి? అదిచెప్పు నాకు.” అన్నాడు బసవరాజు.

    “అంతేనంటావా?” అన్నాడు రంగనాధం.

    “అంతే.” అన్నాడు బసవరాజు.

    గుళ్లో వున్న బావమరిదిని ఉద్దేశించి అంటున్నాడు రంగనాధం. “అంతేరా బామ్మర్దీ. నీ రూటే కరెక్టు.” ఆ మాటకి అందరూ హాయిగా నవ్వుకుంటున్నారు. ఇక సెలవు. చిత్తగించగలరు.

    (శుభం)

    ( హాసం సౌజన్యంతో )

  • Next