• Next
  • అందరూ దొంగలే - 95

    Listen Audio File :

    అప్పుడే లోపలినుండి బయటికి వచ్చిన అతని భార్య "ఈయనతో చస్తున్నానయ్యా బాబూ! ఎప్పుడు ఏ రూపం మార్చుకుంటారో చెప్పయినా ఏడవరు. రేపొద్దున ఈయన లేని టైం చూస్కుని ఎవడైనా ఇంట్లో దూరి ఇల్లంతా దోచుకోనూవచ్చు - లేదా ఏకంగా నా శీలమే దోచుకోవచ్చు!” అంది నెత్తి కొట్టుకుంటూ.

    రాంబాబు, చిన్నారావ్ లు కిసుక్కున నవ్వారు.

    "ఊ........ ఊ..... ఓవర్ యాక్షన్ చాలు గానీ, నువ్వు లోపలికి వెళ్ళు" అన్నాడు భార్యతో విల్సన్. ఆమె మూతి తిప్పుకుంటూ లోపలికి వెళ్ళింది.

    “ఏంటి ఇలా వచ్చారు?” అడిగాడు విల్సన్.

    “మా పని అయిపొయింది. గజదొంగ మంగుల్ని, రాకాని జైల్లో తోయించేశాం. దీపని కమిషనర్ గారికి అప్పగించేశాం....” అన్నాడు రాంబాబు.

    “కంగ్రాట్స్...” అన్నాడు విల్సన్ వాళ్ళకి షేక్ హాండ్ ఇస్తూ.

    “మాకు ఇంక ఇన్స్ పెక్టర్ అప్పారావ్, కానిస్టేబుల్ 420 రూపాలు అక్కర్లేదు. మా రూపాలు మాకు తెప్పించేయండి అన్నాడు చిన్నారావ్. "హోస్... అదేంత పని?.... లోపలికి పదండి....” అన్నాడు విల్సన్.

    విల్సన్ దగ్గర తమ ఒరిజినల్ రూపాలు పొందిన రాంబాబు, చిన్నారావ్ తిన్నగా డిప్పల్లో నర్శింగ్ హోం కి వెళ్ళి సరోజ, సునీతల్ని కలిశారు.

    “హమ్మయ్య.... రక్షించారు! ఇలా మిమ్మల్ని ఒరిజినల్ రూపాల్లో చూస్తుంటే హాయిగా వుంది!” అంది సరోజ. “అసలు మళ్ళీ మిమ్మల్ని మీ రూపాల్లో చూడగలమో లేదోనని చాలా టెన్షన్ పడ్డాం" అంది సునీత.

    “ఎందుకూ టెన్షన్? విల్సన్ వుండగా మాకేం ప్రాబ్లం లేదు" అన్నాడు చిన్నారావ్.

    “విల్సన్ కేమైనా అయినా, లేదా అనుకోకుండా ఎక్కడికో మీకు తెలీని చోటికి హఠాత్తుగా వెళ్ళిపోయినా... మీ పరిస్థితి ఏమయ్యేది.....?” అడిగింది సునీత.

    రాంబాబు, చిన్నారావ్ కి క్షణంపాటు ఒళ్ళు గగుర్పొడిచింది. ఆ విషయం గురించి వాళ్ళసలు ఆలోచించలేదు.... “పోనీలే... ఇప్పుడలా అవ్వలేదుకదా!” అన్నాడు రాంబాబు

    “సర్లే... ఇప్పుడు అసలు విషయానికొద్దాం.... మీకో గుడ్ న్యూస్. మేము మన మ్యారేజ్ డేట్స్ కూడా ఫిక్స్ చేస్కుని వచ్చాం....” అన్నాడు చిన్నారావ్.

    సరోజ, సునీత సంతోషంతో కెవ్వుమని అరిచారు.

    హాల్లో కమీషనర్ లింగారావ్, శ్రీలక్ష్మి దీపతో ఆడుకుంటుండగా రాంబాబు, చిన్నారావ్? సరోజ, సునీత అక్కడికి వచ్చారు.

    “రండి... రండి...” అన్నాడు కమీషనర్ లింగారావ్ వాళ్ళని ఆదరంగా లోపలికి ఆహ్వానించి. “కూర్చోండి....” అన్నాడు.

    “ఫరవాలేదు లేదు!” మొహమాట పడ్తూ అన్నాడు రాంబాబు.

    “కూర్చోవయ్యా బాబూ....” అంది శ్రీలక్ష్మి.

    అందరూ లింగారావ్, శ్రీలక్ష్మి ఎదురుగా సోఫాల్లో కూర్చున్నారు.

    “నాకు చాలా సిగ్గుగా వుందయ్యా... అనవసరంగా నిన్ను అనుమానించాను. ఇన్స్ పెక్టర్ అప్పారావ్ వల్ల మా దీప మాకు ప్రాణాలతో దక్కింది. కానీ ఓ విషయం విచిత్రంగా వుందయ్యా! ఇన్స్ పెక్టర్ అప్పారావ్ దీపని మాకు అప్పగించాక మాయమైపోయాడు. అతనితోపాటు కానిస్టేబుల్ 420 కూడా కనిపించడం లేదు. అసలు వాళ్ళు ఎక్కడ వున్నారో మాకు అంతుపట్టడం లేదు.....” అన్నాడు కమీషనర్ లింగారావ్.

    “ఏమైతేనేం... మా దీప మాకు దక్కింది....." అంటూ శ్రీలక్ష్మి రెండు చేతులూ జోడించి కళ్ళు మూస్కుంది. "స్వామీ! మా దీప క్షేమంగా దక్కినందుకు నీకు నా తల నీలాలు సమర్పించుకుంటాను స్వామీ!”

    కమీషనర్ లింగారావ్ ఆశ్చర్యంగా శ్రీలక్ష్మి వంక చూశాడు. “అదేవిటే... ఎప్పుడూ నాకాలో చెయ్యో సమర్పించుకుంటానని మొక్కేదానివి కదా.... ఈవేళ ఆశ్చర్యంగా నీ తల నీలాలు సమర్పించుకుంటానని మొక్కావ్....?” అన్నాడు.

    “అదా? మొక్కడానికి ఇంకేం మిగల్లేదండీ... మీ అంగాలన్నీ ఇది వరకే మొక్కేశానుగా?”అంది శ్రీలక్ష్మి.

    అందరూ నవ్వేశారు.

    “అదేంటి దీప గుర్రం ఆట ఆడ్దాం, ఉయ్యలాట ఆడ్దాం అని అనకుండా బుడిగా కూర్చుంది!” అన్నాడు రాంబాబు.

    “దానికి ఇన్ని రోజులూ ఆ దొంగలందరితో ఇరవై నాలుగ్గంటలూ ఆ ఆటలు ఆడి వాటిమీద విరక్తి వచ్చేసింది" అన్నాడు కమీషనర్. అందరూ మళ్ళీనవ్వారు.

    “సార్.. వచ్చే ఆదివారం ఉదయం పదిగంటలకి వెంకటేశ్వర ఆలయంలో మా పెళ్ళి... మీరు తప్పకుండా రావాలి సార్...!” అంటూ రాంబాబు కమీషనర్ లింగారావ్ దంపతుల్ని ఆహ్వానించాడు.

    లింగారావ్ దంపతులు ఆ రెండు జంటల్నీ అభినందించారు.

    ఆదివారం ఉదయం సరోజ, రాంబాబు, సునీత, చిన్నారావ్ ల పెళ్ళి అయిపొయింది.

    సాయంత్రం.....

    ఒకటో నెంబర్ ప్లాట్ ఫాం మీద గోదావరి ఎక్స్ ప్రెస్ బయలు దేరడానికి సిద్ధంగా వుంది. జనరల్ కంపార్టుమెంటులో రాంబాబు, చిన్నారావ్ ల రూపాల్లో వున్న ఇన్స్ పెక్టర్ అప్పారావ్, కానిస్టేబుల్ 420 చేతులకి బేడీలు వేసి వున్నాయ్.... వాళ్ళకి కాపలాగా నలుగురు కానిస్టేబుల్స్ వున్నారు. కొద్దిరోజులక్రితం వాళ్ళు జైల్లోంచి తప్పించుకుని మళ్ళీ పట్టుబడ్డ కారణంగా.... పనిష్మెంట్ క్రింద హైదరాబాద్ నుండి రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలిస్తున్నారు.

    గోదావరి ఎక్స్ ప్రెస్ కదిలింది. “మా సమస్య తీరేదెప్పుడ్రా దేవుడా' అంటూ ఇన్స్ పెక్టర్ అప్పారావ్, కానిస్టేబుల్ 420 బాధగా అరిచారు. వాళ్ళ అరుపు రైలు కూతలో కలిసిపోయింది. ____________ శుభం _______________________

  • Next