Shooting Spot Joke

Shooting Spot Joke

***************

షూటింగ్ లో టింగ్ టింగ్

రావికొండలరావు

అల్లురామలింగయ్య గారితో అవుట్ డోర్.

రామానాయుడు గారు పాపకోసం సినిమా తీశారు. అందులో అల్లువారు, నేను బ్రాహ్మణ పాత్ర దారులం. మద్రాసుకు దూరంగా అవుట్ డోర్ పెట్టారు. మంచి ఎండ. ఒంటి గంటలోపలే షూటింగ్ బ్రేక్ చేసి, భోజనాలు పెట్టారు. రామలింగయ్య గారికి భోజనం చేసిన తరువాత ఓ అరగంట పాటైనా విశ్రమించే అలవాటుంది. అంచేత ఆయన ఎక్కడికి వెళ్ళినా ఒక చిన్న దిండు కూడా తనతో తెచ్చుకుంటారు.

" నాకు మళ్ళీ షాటు ఎప్పుడు ? టైముంటుందా ?" అని అసిస్టెంట్ ని అడిగాడు.

తను ఆలోచించి " ఉంది. మీరు రెస్ట్ తీసుకోండి " అన్నాడు.

అన్నదే తడువుగా అల్లువారు, సదురు దిండు వగైరాలు తీసుకుని నిద్రాభంగం కలగకుండా షూటింగ్ స్పాట్ కి దూరంగా వెళ్ళిపోయి మంచి నీడ ఇస్తున్న చెట్టు చూసుకుని, దిండు పెట్టుకుని సుఖనిద్రలోకి జారుకున్నారు. షూటింగ్ నాలుగు గంటకల్లా అయిపోయింది. " పాకప్ " అన్నారు.

అలా అనడమే ఆలస్యమే అందరూ ఎవరికీ దొరికిన కార్లో వాళ్ళు ఎక్కి బయలుదేరారు. మధాహ్నం తరువాత రామలింగయ్య గారికి షాట్ రాలేదు గనుక, ఆయన హాయిగా నిద్రపోయారు.షూటింగ్ పాకప్ హడావుడిలో ఎవరికీ ఆయన సంగతి గుర్తులేదు. ఆయన దూరంగా వెళ్లి పడుకోవడం చేత నిదానంగా ట్రామలింగయ్య గారు నిద్రలేచి అటూ ఇటూ చూశారు. ఎక్కడ షూటింగ్ అలికిడి లేదు. అంతటా నిశ్శబ్దంగా వుంది.

లొకేషన్ మార్చినట్టున్నారు అనుకుని పక్కనే ఉన్న కాలువ గట్టున బట్టలు ఉతుకుతున్న ఓ అబ్బాయిని అడిగారు " బాబు నీకు షూటింగ్ సంగతి తెలుసా ?" అని.

దానికి ఆ అబ్బాయి " అందరూ వెళ్లిపోయారు " అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు.

అంతే..అల్లువారి ఒళ్ళు ఝల్లుమంది. గుండెలో కలుక్కుమంది.

ప్రొడక్షన్ కార్లు ఆఫీసుకు చేరాయి.

" రామలింగయ్య గారిని ఏ కార్లో దింపారు ?" అని వాళ్ళలో వాళ్ళు తర్జనభర్జన చేసుకుని, అక్కడ రామలింగయ్య గారు కనిపించకపోవడంతో నాలికలు కొరుక్కుని, అయ్యయ్యే అనుకుని కారు తీసుకుని పరుగులు పెట్టారు.

సరిగ్గా లొకేషన్ దగ్గరగా కారు చేరుకునే ముందు ఒక బస్టాండ్ వుంది. అక్కడ పిలక, నుదుటిమీద విభూతి రేఖలతో, ఒంటి మీద చొక్కా లేకుండా చంకలో ఒక దిండుతో ఒకాయన నించుని ఉన్నాడు. ఆయనే రామలింగయ్య గారు.

" సార్ సారీ సర్ రండి " అని కారెక్కించారు.

" నేనే సారీ చెప్పాలి. ఎక్కడ పడుకున్నానో మీతో చెప్పాలిగా " అన్నారాయన. మొత్తానికి ఆ కథ అలా కంచికి వెళ్ళింది. అటు తరువాత ఇంకో షూటింగ్ లో రామలింగయ్య గారు నా పక్కనే వుండగా, ఈ కథంతా తక్కిన వాళ్ళతో చెప్పి " రామలింగయ్య గారూ జ్ఞాపకం వుందా ?ఇలా ఎక్కడ జరిగిందో ? " అని అడిగాను.

" ఏ షూటింగ్ జరిగిందంటే ఎలా చెప్పను ? ఇలాంటివి చాలాసార్లు జరిగాయి " అన్నారు రామలింగయ్య గారు తేలిగ్గా నవ్వేస్తూ.