Cinemakelli Chudu

సినిమాకెళ్ళి చూడు

మల్లిక్

*******************************************************************

ఆ రోజు ఆదివారం. సాయంత్రం అయిదు గంటలైంది.

జానకిరాం, సత్యవతి సరదాగా సినిమాకి వెళ్దామని అనుకున్నారు ఆ రోజు.

ఇద్దరూ ఇంటికి తాళం వేసి బస్సు స్టాండ్ వరకు నడిచి వెళ్లారు.

“ఏవండి...అసలే ఆదివారం.మనం బస్సు కోసం కాచుకుని ఉంటే టైమైపోతోంది.టిక్కెట్లు దొరకవు. ఆటోలో పోదామండీ "అంది సత్యవతి.

జానకిరాం వెంటనే ఆ వైపుగా పోతున్న ఆటోని ఆపాడు.

“ప్రభాత్ థియేటరుకి వస్తావా ?”ఆటోవాడిని అడిగాడు జానకిరాం.

“హర్రే...ఎందుకురాం సాబ్...ఆటో ఎక్కండ్రి " అన్నాడు ఆ ఆటోవాడు. వాళ్ళిద్దరూ చాలా సంబరపడిపోయారు. అడగ్గానే వస్తానని అన్న ఆటోవాడిని వీడొక్కడినే చూశారు వాళ్ళు ఇప్పటిదాకా. ఇద్దరూ ఆటో ఎక్కి కూర్చున్నారు.ఆటో స్టార్ట్ అయి ముందుకు కదిలింది.

“కాస్త తర్వాత పోనివ్ ఆటో అబ్బీ. లేకపోతే టిక్కెట్లు దొరకవు "అంది సత్యవతి కంగారు పడుతూ. అంతే...గబుక్కున ఆ ఆటోవాడు ఆ మాట వింటూనే ఆటోని ఆపేశాడు.

“నేను రాను.మీరు దిగండ్రి "అన్నాడు ఆ ఆటోవాడు.

“ఇప్పుడే కదా వస్తానని మాతో అన్నావ్. మళ్ళీ రానని అంటావేం "ఆశ్చర్యంగా అడిగాడు జానకిరాం.

“మరి మీకు జల్దిగా ఉన్నది కదా! అందుకనే రాను "అన్నాడు ఆ ఆటోవాడు.

“పోనీ మెల్లగా పోనియ్యవయ్యా "

“మెల్లమెల్లగా పోనిస్తే మీకు టిక్కెట్లు దొరకవు గదా!” అన్నాడు ఆటోవాడు విలాసంగా.

“త్వరగా వెళ్ళమంటే రానన్నావు. పోనీ మెల్లగా వెళ్ళమంటే టిక్కెట్లు దొరకవని నువ్వే చెబుతున్నావు. ఇంతకీ నీ ఉద్దేశం ఏంటయ్యా ?” కాస్త విసుకున్నాడు జానకిరాం.

“ అదిగో గట్ల మాట్లాడితే అస్సలు రాను " అన్నాడు కోపంగా ఆటోవాడు.

“ అబ్బ మీరుండండి. అలానేనా వాడితో మాట్లాడేది? అసలే ఆలస్యం అవుతుంది. టిక్కెట్లు దొరకవ్" అంది సత్యవతి.

“నేనేం చేశానే మధ్యలో... వాడే రానని అన్నాడు కదా? ” అన్నాడు జానకిరాం.

“ నేనోస్తాగానీ మీరు జల్డిలా ఉన్నారు కాబట్టి రాను. మీటరు మీద మూడు రూపాయలు ఎక్స్ ట్రా ఇస్తే వస్తాను " అన్నాడు ఆటోవాడు.

“ ఇస్తాం లేవయ్యా. నువ్వు పద. అసలే ఆలస్యం అయ్యిందా టిక్కెట్లు దొరకవు " కంగారుగా అంది సత్యవతి.

“ గది శానా మంచి సిన్మానా అమ్మ ?” అడిగాడు ఆటోవాడు.

“ అవును.త్వరగా పద ఆలస్యం అయ్యింది "

“ గది జూడకపోతే మన్సు కష్టం అవుతాదామ్మ ?” అన్నాడు ఆటోవాడు.

“ అవునయ్య. చాలా బాధ కలుగుతుంది. త్వరగా పద టిక్కెట్లు దొరకవు " అంది సత్యవతి.

“ గట్లయితే నాల్గు రూపాయల్ ఎక్స్ ట్రా ఇవ్వండి. లేకపోతే రాను " అన్నాడు ఆటోవాడు.

జానకిరాం కమ్మీకేసి తలకోట్టుకున్నాడు.

“ ఆయనట్లానే తలకొట్టుకుంటాడగానీ నువ్వు పదబ్బి. నీకు నాలుగు రూపాయలు నేనిస్తా. అసలే టైమైపోతోంది " అంది సత్యవతి.

అంతే...ఆమాట వినబడగానే ఆటో రివ్వున ముందుకు కదిలింది.

వాళ్ళు పావుగంటలో సినిమా హాలు చేరుకున్నారు.ఆటోవాడికి డబ్బులిచ్చి పంపేసి థియేటర్ కాంపౌండ్లోకి అడుగు పెట్టారు.

ఆదివారం. అందులోను కొత్త సినిమా వల్ల అక్కడ చాలా పెద్ద పెద్ద క్యూలు ఉన్నాయ్.

“ చూశారా! ఆటోవాడితో బెరాలాడ్తూ కూర్చున్నారు.ఇక్కడ చూడండి క్యూ ఎంత పెరిగిపోయిందో?” అంది సత్యవతి గుండెలు బాదుకుంటూ.

“ బాదుకున్నది చాల్లే... నువ్వెళ్ళి ఆడోళ్ళ క్యూలో నిలబడు. నేనెళ్ళి మగాళ్ళ క్యూలో నిలబడుతాను.టిక్కెట్లు ఎవరికి దొరికితే వాళ్ళు తీస్కుందాం " అన్నాడు జానకిరాం.

ఇద్దరూ విడివిడిగా క్యూలలో నిలబడ్డారు. పావుగంట అలా ఎండలో నిలబడి చెమటలు కక్కుకున్న తరువాత బుకింగ్ కౌంటర్ ఓపెన్ చేశారు. అంతదాకా బుద్ధిగా క్యూలో నిలబడి ఉన్నవారు టిక్కెట్లు ఇవ్వడం మొదలు పెట్టగానే తోసుకోవడం మొదలు పెట్టారు. ఆ తోపులాటకి జానకిరాం అటూఇటూ ఊగిసలాడాడు.ఎవరో అతని జుట్టు పీకేశారు.ఇంకెవరో అతని చొక్కాపట్టుకుని లాగారు. అతని చొక్కా జేబు చినిగిపోయి వేలాడసాగింది.మరో నిమిషం తోపులాట తరువాత ఎవరో జానకిరాం వీపుమీద చెయ్యిపెట్టి ఒక్కతోపు తోశారు.

జానకిరాం క్యూలో నాలుగు గజాలు అవతలికి వెళ్లి నేలమీద మట్టిలో బోర్లా పడ్డాడు. బట్టలంతా దుమ్ము అయ్యింది. “ అర్రే...” అని అనుకుంటూ జానకిరాం బట్టలకయిన దుమ్ము దులుపుకుని మళ్ళీ క్యూ దగ్గరికి వెళ్లాడు.

“ క్యూలో దూరుతున్నాడు. లాగెయ్యండి... లాగెయ్యండి.” అని క్యూలో వెనక ఉన్న వాళ్ళు అరిచారు. వాళ్ళ అరుపులకి ఒక కానిస్టేబులు అక్కడికి లాఠీ ఊగిస్తూ పరుగెత్తుకుని వచ్చాడు.

“ ఏయ్... క్యారే... క్యూమే గుస్ జాతేహై ?” అంటూ జానకిరాం చొక్కా కాలర్ పట్టుకుని వెనక్కిలాగాడు. అంతే... జానకిరాం వెనక్కితూలి ఈసారి వెల్లకిలా పడ్డాడు.

జానకిరాం లేచి నిలబడి దుమ్ము దులుపుకున్నాడు.

“ అర్రె ఏంటయ్యా అలా తోసేస్తావ్. నేను ఇందాకట్నుంచి క్యూలో నిల్చున్నాను " అన్నాడు జానకీరాం మళ్ళీ క్యూలో దూరడానికి ప్రయత్నం చేస్తూ.

జనం గోల పెట్టారు.

“ హర్రే ఇస్కీ... చెప్తూంటే నీక్కాదు. ఛల్ " అంటూ లాఠీతో మోకాళ్ళ కింద ఎముకమీద ఒక దెబ్బ వేశాడు కానిస్టేబులు.

“ హమ్మనాయనోయ్... చచ్చాన్రా దేవుడోయ్ " గావుకేక పెట్టి క్యూకి దూరంగా జరిగి కింద కూర్చుని చేత్తో దెబ్బ తగిలిన చోట రుద్దుకోసాగాడు జానకిరాం.

క్యూలో అందరూ ఘేల్లుమని నవ్వారు. కాస్సేపైన తరువాత లేచి కుంటుకుంటూ వెళ్లి ఓ పక్కన నిలబడి ఆడోళ్ళ క్యూ వంక చూశాడు జానకిరాం. అక్కడ మగాళ్ళ క్యూ కంటే అన్యాయంగా ఉంది. టిక్కెట్లు సంపాదించడం కోసం హోరాహోరి యుద్ధం జరుగుతున్నట్లు ఉంది. క్యూ ఏ మాత్రం లేదు. కొప్పులు ఊడిపోతున్నాయ్. గాజులు పగిలిపోతున్నాయ్. సత్యవతి ఆ గుంపుని చేదించుకుంటూ టిక్కెట్లు ఇచ్చే కౌంటర్ వైపు వెళ్లడం జానకిరాం చూశాడు.

ఒక అయిదు నిమిషాలు గడిచాయ్.

ఇంతలో ఆడోళ్ళ గుంపులోంచి సత్యవతి రివ్వున పరిగెత్తుకుని వచ్చింది. ఆమె చీర మొత్తం చెదిరిపోయింది. జాకెట్ చినిగిపోయింది. తలంతా రేగిపోయి ఉంది. మొహం మీద గోళ్ళతో రక్కిన గాట్లున్నాయి. అయినా ఆమె మోహంలో ఆనందం.

“ ఏమండీ.. మనకి టిక్కెట్లు దొరికాయండి " అంది సంబరంగా.

“ ఆ...దొరికాయా? ఏవీ...ఏవేవీ! వేవీ...” అన్నాడు కుంటుకుంటూ ఆమెకి ఎదురుగా వెళ్తూ జానకీరాం. సత్యవతి చెయ్యిచాపి చూపించింది.

“ ఏవీ? ” అన్నాడు జానకిరాం ఆశ్చర్యంగా.

“ ఇదిగో " అంటూ తన చేతి వంక చూసుకున్న సత్యవతి కెవ్వుమని గట్టిగా అరిచింది.

“ ఎవరు? ఏంటి? ఏమైంది? ఎందుకా కేక?” అంటూ కంగారుగా ఇద్దరు పోలీసులు కానిస్టేబుల్సు అక్కడికి పరుగెత్తుకు వచ్చారు.

వాళ్ళు సత్యవతిని చూశారు.

“ హా.. ఈమె రేపు చేయబడింది. రేపు కేసు. ఏమ్మా..సినిమా హాలు వెనకాల చేశారా? మెట్ల కిందికి లాక్కెళ్ళి చేశారా? మాములు రేపా, సాముహిక రేపా? సామూహిక రేపైతే ఎంతమంది చేశారు " అంటూ ఇద్దరూ కానిస్టేబుల్స్ సత్యవతి మీద ప్రశ్నలవర్షం కురిపించారు.

“ రేపెంటయ్యా...నన్నెవరు చేస్తారు ?” అంది సత్యవతి ఆశ్చర్యంగా.

“ మిమ్ముల్నెవరూ రేపు చెయ్యలేదా ? మరి ఆ గాట్లేంటి, ఆ జుట్టు రేగిపోవడమేంటి, ఆ జాకెట్ చిరగడమేంటి, ఆ చీర చెదిరిపోవడం ఏంటి ?” అన్నారు ఇద్దరూ. సత్యవతి విసుక్కుంది.

“ కొత్త సినిమా రిలీజైనప్పుడు మీరు హాలు దగ్గర డ్యూటీ చెయ్యడం ఇదే మొదలా? నేనింకా నయ్యం అటు చూడండి " అని ఓ దిక్కుకి చూపించింది సత్యవతి.

ఒకామె చేతిలో టిక్కెట్లతో ఒంటిమీద కేవలం లంగా బాడితో ఎన్ ట్రేన్స్ వైపు పరుగులు తీసింది. అతడి వెనకాల చిరిగిన షర్టుతో, డ్రాయరుతో ఆవిడ భర్త పరుగెత్తుతున్నాడు. “ ఓలమ్మో " గుండెలమీద చేయ్యేసుకున్నారు కానిస్టేబుల్స్.

మళ్ళీ టిక్కెట్స్ సంగతి గుర్తుకొచ్చి మరోసారి కేవ్వుమంది సత్యవతి.

“ జనంలోంచి తోసుకుని వచ్చేటప్పటికీ టిక్కెట్లు ఎక్కడో జారి పడిపోయినట్టున్నాయండి " అంది దీనంగా సత్యవతి.

ఇంతలో బుకింగ్ క్లోజ్ చేసేశారు. కొందరు కుర్రాళ్ళు టిక్కెట్లు ఓపెన్ గా బ్లాకులో అమ్మసాగారు.

“ హవ్వ...ఇంటికి తిరిగి వెళ్ళిపోతే అందరూ నవ్వరూ? ఎంత సిగ్గుచేటు. టిక్కెట్లు బ్లాకులో కొనండి " అంది సత్యవతి భర్తతో.

“ అవునవును...ఎంత సిగ్గుచేటు " అన్నాడు జానకిరాం.

వాళ్ళు అయిదు రూపాయల టిక్కెట్లు పదిరూపాయల చొప్పున బ్లాకులో కొనుక్కుని వెళ్లారు.తీరా చూస్తే ఇద్దరి సీటు నెంబర్లు చెరోమూలా ఉన్నాయి.ఒక దగ్గర లేవు.జానకిరాం రెండు సీట్లు ఒక దగ్గర ఉండటం కోసం వాళ్ళనీ వీళ్ళనీ బతిమిలాడం వల్ల, అతడు అందరి దగ్గరికీ వెళ్లి నిలుచుని మాట్లాడుతుండడంతో అడ్డు రావడం వల్ల వెనక జనం "ఒరేయ్...కూర్చోబే... నిన్నే. ఏయ్... నీ ఇస్కీ " అంటూ బండబూతులు తిట్టసాగారు.

చివరికి రెండు సీట్లూ ఒక దగ్గర సంపాదించాడు జానకిరాం.సినిమా చూస్తుండగా వెనక లైను వాడు మెల్లగా కాల్తో సత్యవతిని నొక్కాడు. ఆ విషయం సత్యవతి జానకిరాం చెవిలో చెప్పింది. జానకిరాం, వెనక సీటు వాడూ...కాస్సేపు జుట్టూ జుట్టూ పట్టుకున్నారు.

ఇంతలో పోలీసులు వచ్చి వెనక సీటు వాడిని లాక్కెళ్ళిపోయారు. మొత్తానికి కొత్త సినిమాని మొదటి వారంలోనే చూసి ఇంటికి చేరింది ఆ జంట.

ఆ మర్నాడు ఆఫీసులో జానకిరాం పక్క సీటులోని అప్పారావు అడిగాడు.

“ నిన్న ఆదివారం ఏం చేశావోయ్?” అని.

“ సరదాగా నేను, మా ఆవిడ సినిమాకి వెళ్ళాం " అని జవాబు చెప్పాడు జానకిరాం.