Antera Bamardee 29

 

This story is a courtesy of Padma Bhushan Varaprasad Reddy

 

29 వ భాగం

రెండురోజుల తర్వాత - బసవరాజు గారి బంగళా చాలా నిశ్శబ్దంగా వుంది!

బసవరాజు తన గదిలో పేపరు చదువుకుంటున్నాడు! అనగా తనక్కవాల్సిన వార్తలు వెతుక్కుంటున్నాడు. అంతలో 'గుడ్ మార్నింగ్ సార్' అని వినిపించింది. అది పాణి గొంతు మాత్రం కాదు. అంచేత బసవరాజు తలెత్తి చూసేడు! తనముందు నిలబడి వున్నది వేణు!

"ఆఫీసుకి వేళయిందండి!" అన్నాడు వేణు.

"నువ్వెల్లు! నేను కొంచెం ఆలస్యంగా వస్తా."

వేణు వెళ్లబోయేడు బసవరాజు అతన్ని పిలిచేడు "వేణూ!"

వేణు ఆగిపోయేడు "ఎప్పుడూ లేనిది - ఇవాళ ఇల్లు ఇంత నిశ్శబ్దంగా వుందేమిటి?"

"ఇంట్లో ఇద్దరూ లేకపోతే అంతే గదండీ మరి?"

"ఇద్దరు లేరా? ఎవరా ఇద్దరు?"

"మీ అబ్బాయి డాక్టర్ మురళీ మీ కోడలు పద్మగారూ!"

"అయ్ సీ!" అన్నాడు బసవరాజు ఏదో ఆలోచిస్తూ.

"మీరు ఏమీ అనుకోను ! అసలు విషయమేమిటి? అచ్చెప్పునాకు!"

"డాక్టర్ మురళీ మీకోసం స్వీట్స్ తెస్తే అక్కర్లేదని అతన్ని అవమానించారట!"

"అఫ్ కోర్స్! తినకూడదనుకున్నాను వద్దన్నాను అందుక్కోపం వచ్చిందా వాడికి?"

"అతనికి కోపం రావడం కాదు ! మీకే అతని మీద కోపమొచ్చినట్టు అర్థం చేసుకున్నాడు!"

"అందుకని వేరే కాపురం పెట్టేడా? అచ్చెప్పు నాకు!"

"దాదాపు ఆపనే చేసాడు!"

"ఆ మాటకొస్తే నేనే వాళ్లని వెళ్లిపొమ్మని చెబుదామనుకున్నాను! వేరే కాపురం ఎంతో మంచిదని సలహా యిద్దమనుకున్నాను!"

"సలహాలు సరే కారణం కూడా చెప్పాలిగా?" బసవరాజు సడన్ గా లేచి నించున్నాడు.

గంభీరంగా అన్నాడు "అడక్కు! వాళ్లిద్దరూ నాకు దూరంగా వుండటమే మంచిది! నేను కోరుకున్నది కూడా అదే! దట్సాల్ ! ఇక నువ్వు ఆఫీసుకి వెళ్లవచ్చు!" వేణు - మరేమీ మాటాడకుండా ఆ గదిలోంచి బయటకు వస్తున్నాడు! బసవరాజు గట్టిగా నిట్టూర్చాడు!

* * *

రంగనాధం నడుస్తున్నాడు! అతని వెనుక నుంచి ఆటో వచ్చి - అతని ముందు ఆగింది! ఆటో మనిషి ఆటో దిగి రంగనాధాన్ని అడిగాడు.

"ఎక్కడికి వెళ్లాలి సార్?" ఆటో మనిషిని ఎగాదిగా చూచి అన్నాడు రంగనాధం .

"ఆ రహస్యం నీకు చెప్పాలా?"

"రహస్యమా?" ఆశ్చర్యంగా అడిగాడు ఆటో మనిషి.

"రహస్యమే! మేము ఎక్కడికి వెడుతున్నాం? ఎందుకు వెడుతున్నాం? వెళ్లి తర్వాత ఏం చేస్తాం? అన్నీ రహస్యాలే! మా బతుకే ఒక పెద్ద రహస్యం! మీరంటే మీరు ఆటో వాళ్లు కదా! మీకు రహస్యాలుండవు! అంచేత మేము మిమ్మల్ని పిలవక పోయినా మాముందు ఆటో ఆపి ఎక్కడికి వెళ్లాలి సార్ అని ఎంతో ఫ్రాంకుగా, కుండ బద్దలు కొట్టినట్టు ముక్కు గుద్ది మరీ అడుగుతారు! ఈ లోగా అక్కడికి కృష్ణమూర్తి వచ్చేడు. వచ్చి ఆ దృశ్యాన్ని చూశాడు. చూసి రంగనాధానిక్కనిపించాకుండా ఆటో పక్కనే దాక్కున్నాడు! దాక్కుని వాళ్ల సంభాషణ వింటున్నాడు! ఆటో మనిషి గొణుక్కుంటున్నాడు.

"ఇదెక్కడి బేరమండీ బాబు?" రంగనాధం అసహనంగా అంటున్నాడు.

"అంతేమరి! మేము బేరాలు చేసుకు బతికేవాళ్ళం! మావి బేరాల బతుకులు! పరమ బేవార్సు బతుకులు! మీరంటే ఆటోవాళ్లు కదా! ఆటోలు తొక్కుతూ ఆనందగా బతికేస్తారు! కనిపించిన ప్రతి ప్యాసెంజర్నీ పట్టుకుని ఆపి 'ఎక్కడికెళ్లాల్సార్' అని కూపీ లాగుతారు. అక్కడెక్కడో మర్డర్ జరిగితే ఆ కేసు మీ ఆటో ఎక్కినా ప్యాసింజర్ నెత్తినెయడానికి శతవిధాల ప్రయత్నిస్తారు" రంగనాధం తాలూకు ఉపన్యాసానికి ఆటో మనిషి బెంబేలు పడిపోతూ చేతులు జోడించి అన్నాడు.

"సార్! నన్ను నమ్మండి సార్! నేనల్లాంటి మనిషిని కాదు!"

"మీరు కాకపోవచ్చు! మేము మాత్రం అల్లాంటి మనుషులమే! జేబుల్లో కత్తులు దాచుకుని ఆటోలెక్కుతాం! కావల్సిన మనిషి కనిపించగానే ఆటోలోంచి దూకి వాడి డొక్కలో పొడిచి మళ్లా ఆటో ఎక్కుతాం! పనైపోయిందని సంతోషిస్తామే గాని మమ్మల్ని పోలీసులకు అప్పగించే ధర్మం పురుషులు ఆటో వాళ్లేనని ఆటో ఎక్కేముందు మాకు తెలీదు. ఆటోవాడు ఆ పాపిష్టి మాటలు వినలేక ఆటో ఎక్కి పారిపోయే పయత్నం చేశాడు! అతన్ని పట్టుకుని అన్నాడు రంగనాధం వెళ్లిపోతావే?

" మీరు వెళ్లే పనేంటో తెలవక ఎక్కడికి వెళ్లాలని అడిగాను సార్! ఇప్పుడు చెప్తున్నాగా మర్డరు పనిమీద వెడుతున్నానని! అందుకే సార్! భయమేసి పారిపోతున్నా! మీరు మామూలు ప్యాసింజర్లనుకుని ఆటో ఆపేను! వచ్చేవాడా? మేము ప్యాసింజర్లు కాదు నాయనా! ఖూనీ కోరులం! గళ్ల లుంగీలు కట్టుకుంటాం! చారల బనీన్లు తొడుక్కుంటాం! కారా కిళ్ళీలు నముల్తుంటాం! మొలలో కుడిపక్క చాకులు పెట్టుకుంటాం! ఎడంపక్క చాకులు దాచుకుంటాం! పద! నీ ముచ్చట ఎందుక్కాదనాలి! నీ ఆటోలోనే కూచుంటా! నడు! "

ఆ దెబ్బతో ఆటోవాడు రంగనాధం కాళ్ల మీద పడిపోయేడు!

ఎంతో ధీనంగా అంటున్నాడు.

"వద్దు బాబో! వద్దు! తమరు ఆ ఫీల్డులో వున్నారు గనక ఇట్టా పొడిచేసి అట్టా పారిపోతారు! ఆ ఫీల్డు నాకు కొత్త! పైగా పిల్లలు గలోడ్ని! నేను పారిపోలేను! పోలీసులు నా వెంట పడితే నా బతుకు చిగిరిపోయిన యిస్తరాకవుద్ధి! నన్నొదిలేయండి బాబో! నే ఎల్లిపోతా! అని గబగబా ఆటో ఎక్కి పారిపోయాడు! ఆటో వెళ్ళిపోగానే చాటున దాక్కున్న కృష్ణమూర్తి బయటపడ్డాడు! అతన్ని చూడగానే రంగనాధం చాలా సీరియస్ గా అతనివైపు నడిచాడు. కృష్ణమూర్తి పారిపోవాలనుకుని ఆగిపోయాడు! ఏం జరిగినా ఫర్లేదనే ధీమాతో కత్తిలాగా నిలబడివున్నాడు! రంగనాధం కృష్ణమూర్తి దగ్గరికి వచ్చాడు! కృష్ణమూర్తి వైపు విర్రున చూచాడు! ఆ తర్వాత అతన్నేమీ పలకరించకుండానే వెళ్లిపోయేడు! వెళ్లిపోతున్న రంగనాధం వైపు వెర్రిగా చూస్తూ నిలబడిపోయేడు కృష్ణమూర్తి!

* * *

బసవరాజు ఆఫీసు గది ! ఆ గదిలోకి వేణు వెడుతున్నాడు! అతను కొన్ని ఫైల్సుతోనూ రష్యన్ దినపత్రిక తోనూ బసవరాజు గదిలోకి అడుగు పెట్టేడు! బసవరాజు చూపు వేణు మీదగానీ అతను మోసుకొచ్చిన ఫైళ్లమీద గానీ పడలేదు.

కేవలం రష్యన్ దినపత్రిక మీద అతని చూపు లగ్నమైంది! అది గుర్తించిన వేణు ఆ దినపత్రిక బసవరాజుకి అందుబాటులో ఒక ఫైలు తెరుస్తూ అన్నాడు మన కడప బిజినెస్సు అద్భుతం! చాలా భారీ ఎత్తున ఆర్డర్స్ వస్తున్నాయి! బసవరాజు వేణు మాటలు వినిపించుకోవడంలేదు.

తనకి అందుబాటులో వున్న రష్యన్ దినపత్రికను తీసుకుని పేజీలు తిప్పుకున్నాడు. ఆ చర్యను ఒక కంట చూస్తూనే చెబుతున్నాడు వేణు కడప వారిని చూచి కర్నూలు బ్రాంచి వాళ్లు కూడా రెచ్చిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారంతో నిమిత్తం లేని ప్రశ్న అడిగాడు బసవరాజు. ఇదేం పేపరు?

వేణు అసహనం నటిస్తూ అన్నాడు వ్యాపార విషయాలు డిస్కస్ చేస్తున్నప్పుడు పేపరు గురించి ప్రశ్నించడం పద్దతికాదేమో? బసవరాజు చిరాకు పడ్డాడు అందుకే కటువుగా అన్నాడు నాకు పద్దతిగానే వుంటుంది. ఇదేం పేపరు? అచ్చెప్పు నాకు? నికొలోవ్? బసవరాజు ఆ పేరు విని ఆశ్చర్యంగా అన్నాడు నికొలోవా? ఎక్కడా వినలేదే? పాణి కూడా చెప్పలేదు! దేశవాళీ పేపరు కాదుగదా! అంచేత మీరు వినివుండరు అతను చెప్పివుండరు అంటే ఈ పేపరు రష్యన్ పేపరు! మాస్కోలో ప్రింటవుతుంది! రష్యా మొత్తంమీద నికొలోప్ కి మంచి డిమాండుంది! అక్కడిది మోస్ట్ పాప్యులర్ డైలీ!

"అట్లా చెప్పు! ఇది రష్యన్ డైలీ అన్నమాట!అందుకే ముద్దుగా 'నికొలోప్' అని పేరు పెట్టారు!"

వాళ్ళ పేర్లన్నీ అట్లాగే వుంటాయి. రష్యన్ భాషలో 'నికొలోప్' అంటే 'మేలుకో' అని అర్థం! "మేలుకో మంచిపేరు. చాలా మంచి పేరు. అవును మిస్టర్ వేణూ! నీకు రష్యన్ భాష కూడా వచ్చా?" వేణు మొహమాటం నటిస్తూ అన్నాడు.

"యూనివర్సిటీలో తోచక నేర్చుకున్నాను."

ఆ మాటకి బసవరాజు మురిసిపోతూ అన్నాడు.

"మరిన్నాళ్ళూ చెప్పేవుకాదే?"

"అడక్కుండా చెప్పడం నా పద్ధతి కాదు."

"అంతేలే! నేనడగలేదు! నువ్వు చెప్పలేదు! ఆదర్సేగాని ఈ పేపరు నీకు ప్రతిరోజూ వస్తుందా?"

"వస్తుంది! రష్యన్ భాష తెలిసిన ఇండియన్స్ కి ఈ డెయిలీణి ఫ్రీగా పంపిణీ చేస్తారు!"

"ఎవరు?"

"ఈ దేశంలో వున్న రష్యన్ ఎంబసీ! 'నికొలోప్' చదవందే నాకు నిద్రపట్టదు."

వేణుకి పేపర్నిస్తూ అన్నాడు బసవరాజు "చదువు!వింటాను!"

బసవరాజు మాటకి ఆశ్చర్యపోతున్నట్టు నటిస్తూ అన్నాడు వేణు.

"ఓవ్! మరి చెప్పరే? మీక్కూడా వచ్చా రష్యన్ భాష?"

"ఏమడుగుతావులే! మాతృభాషే సరిగ్గా రాదు! ఇక పరభాష కూడానా? ఇంగ్లీషు భాషాక్కటే అంతంత మాత్రం వచ్చు!"

"మరి ఈ రష్యన్ డైలీ ఎందుకు చదవమంటున్నారు?"

"సౌండు విందామని"

"సౌండా? సౌండొక్కటే చాలా? మీనింగు అక్ఖర్లేదా?"

"మీనింగు చెప్పేందుకు నువ్వున్నావుగా? ముందు ఆ భాష యొక్క సౌండ్ వినిపించు!" వేణు ఆ పేపర్లో రెండు మూడు హెడ్ లైన్స్ చదివాడు. బసవరాజు వేణు చదివింది విని అన్నాడు.

"ఏమిటో కంకర్రాళ్ళు కొరుకుతున్నట్టు సౌండు విచిత్రంగా వుంది."

"ఆ భాష తీరు అంతే. కంకరభాష!"

"మీనింగేమిటో?"

"ఏముందీ? మామూలే! ఆ దేశంలో కమ్యూనిజం మళ్లా ఇప్పుడిప్పుడే రాజుకుంటోందట!" బసవరాజు అయిష్టంగా అడిగాడు.

"నికొలోప్ నిండా ఆ టైపు వార్తలేనా?"

"మీకు ఏ టైపు వార్తలు కావాలి?"

"అదేనయ్యా! చంపడాలు చావడాలూ."

"క్రైమ్ న్యూసా?"

"ఎందుకంత ఆశ్చర్యంగా అడుగుతావ్? రష్యాలో క్రైమ్ న్యూసే వుండదా?"

"ఎందుకుండదు? ఆ న్యూస్ కోసం రెండు పేజీలు ప్రత్యేకంగా కేటాయిస్తారు. ఆ పేజీలకు 'నేరాలో పేజోప్' అని పేరు పెట్టేరు."

"నేరాలో పేజోప్ ఆ ఒక్కముక్క అర్థమైనట్టుంది! ఆ పేజీల్లో ఒక మంచివార్త చదువు."

"మరి కర్నూలు ఫైలు" బసవరాజుకి కించిత్తు కోపంగా అన్నాడు.

"ఇప్పుడు నాకు కర్నూలు వద్దు. కాకరకాయా వద్దు! నేరాలో పేజోప్ లో ఒక్కటంటే ఒక్కటి మచ్చుకి ఒకే ఒక్క వార్త చదువు." వేణు ఆ పేజీల్లో ఒక వార్తని పట్టుకుని గబగబా కంకర్రాల్లు కోరికేసేడు.

అతను చదవడం పూర్తికాగానే "ఇప్పుడు తెలుగులో చెప్పు?" అన్నాడు బసవరాజు.

"ఈ గొడవ మాస్కోలో జరిగింది. తోళ్ల వ్యాపారం చేసే తోర్కియోప్ ణి "

"తోర్కియోప్ అంటే ? తోళ్ల వ్యాపారం చేసే మనిషి పేరా?"

"అవునండి!"

"వద్దు! పేర్లొద్దు! పేర్లవీ లేకుండా వార్త మాత్రమే చెప్పు!"

"అదేం పద్ధతి?"

"వార్త బాగా అర్థం కావాలిగదా! బాగా అర్థం కావాలంటే పేర్లవీ అడ్డు పడకూడదు! ఊ. కానివ్వు!"

"ఆ పేరులేని తోళ్ల వ్యాపారి దగ్గిర ఒక పేరు లేని పి ఏ వున్నాడు."

"అంటే? నా దగ్గిర పాణి వున్నట్టు." వేణు బసవరాజుణి మెచ్చుకుంటూ అన్నాడు.

"అబ్బ! ఉస్కో అంటే చాలు పాయింటుని భలే పట్టుకుంటారు!"

"నేనంతే! నాదో టైపు! నువ్వు ఉస్కో అను!"

"కానీ పాణి పీఆర్వో కదా? పి ఏ కాదు కదా?"

" పి ఏ కూడా అతనే! ఇప్పుడు పాణి గొడవ ఎందుకు? నువ్వు ఉస్కో అను!" అన్నాడు బసవరాజు.

(ఇంకావుంది)

(హాసం వారి సౌజన్యంతో)