Antera Bamardee 28

 

This story is a courtesy of Padma Bhushan Varaprasad Reddy

 

28 వ భాగం

బసవరాజు గారి బంగళా బంగళాలో అందరూ విచారంగానే వున్నారు డాక్టర్ మురళి బాధగా అంటున్నాడు "ఎంతో ప్రేమగా స్వీట్స్ తీసుకెళ్లేను నాన్నా తినమని ప్రాధేయపడ్డాను నేను తెచ్చింది విషమనుకున్నాడో ఏమో? వద్దంటే వద్దని శివాలు తొక్కేడు నా తల కొట్టేసినంత పనయ్యిందమ్మా! ఏమ్మా! నువ్వు చెప్పు! ఇదేమైనా బావుందా?"

"నీ సంగతి ఇట్లా అఘోరించింది! ఎంతో కాలంగా ఎంతో నమ్మకంగా మన దగ్గిర పనిచేస్తూ మనల్నే నమ్ముకున్నాడు ఆ రంగడు! నిన్నూ ఉమని ఎత్తుకు పెంచాడ్రా! మనింట్లో మనిషిగా మనందర్తో కలిసిపోయేడు అల్లాంటి విశ్వసపాత్రుడ్ని కారణం చెప్పకుండా ఉద్యోగంలోంచి తీసేసేడు! దీనికేం చెబ్తావ్?"

"పాపం రంగడు పిల్లల గల వాడమ్మా!" అన్నది ఉమ.

"ఇదంతా చూస్తుంటే మావయ్యగారి మెదడ్ని ఎవరో పనిగట్టుకుని పాడు చేస్తున్నట్టుంది అత్తయ్యా!" అన్నది పద్మ సడన్ గా బసవరాజు తన గదిలోంచి బయటకు వచ్చేడు! వచ్చి అందర్నీ చూసి ఎవర్తోనూ మాటాడకుండా - హాల్లో వున్న ఇంగ్లీషు పేపర్ తీసుకుని, మళ్లా తన గదిలోకి వెళ్లిపోయేడు! అతను వెళ్ళిం తర్వాత డాక్టర్ మురళి తల్లితో అన్నాడు "ఆ వాలకం చూడమ్మా! ఏదో గెస్ట్ హవుస్లో వున్నట్టు ఆ స్టైల్ చూసేవా? ఇవాళ ఆదివారం 'సెలవురోజు' అందరం ఇంట్లో వున్నాం ఒక మాటా పలుకు లేకుండా అంటీ అంటనట్టు తిరుగుతాడే".

"అసలేం జరిగిందో నన్ను వెళ్లి కనుక్కోమంటావా?" అడిగింది తల్లి "వద్దమ్మా! నాన్న అంత బెట్టుకుపోతుంటే నువ్వెందుకు వెళ్లాలి? ఎందుకు పలకరించాలి?" అన్నది ఉమ.

డాక్టర్ మురళి ఒక నిర్ణయానికొచ్చి అన్నాడు "ఆల్ రైట్! లంచ్ టైం వరకు చూద్దాం! అప్పటిక్కూడా ఆయన ఇదే వరస కంటిన్యూ చేస్తే అప్పుడే అడుగుతాను!"

"ఏమని అడుగుతారు?" అన్నది పద్మ.

"ఎవరి మీద అలిగాడో ఎవరి మీద కోపమో అడిగి తెలుసుకుంటా!"

"మీరొక్కరే అడిగి ఎందుకు చెడ్డ అనిపించుకోవాలి? అడిగేదేదో అందరం కలిసే అడుగుదాం!"

సరిగ్గా అప్పుడే ఆ బంగళాలోకి వేణు పరుగెత్తుకుంటూ వచ్చేడు! అతను కొంచెం కంగారుగానే వున్నాడు! అందరూ అతన్ని వింతగా చూస్తున్నారు!

"బాసెక్కడ!" వేణు అడిగేడు.

"ఆయన గదిలో వున్నారు!" అన్నాడు డాక్టర్ మురళి.

"కాసేపట్లో ఆ పాణిగాడు వస్తాడు!"

"వస్తే మనకే? అందుకంత ఖంగారెందుకు?" అని అడిగింది జానకి.

మేడం ఇప్పుడు నన్నేమీ అడక్కండి! అన్ని విషయాలు మీకు తర్వాత చెప్తా! ముందు నేను దాక్కోవాలి!"

"దాక్కోడమా? చిన్న పిల్లల ఆటలాగా దాక్కోడమేమిటి? ఉమ అడిగింది.

"అంతగా దాక్కోవాలంటే ఇంత పెద్ద బంగళాలో చోటే దొరకదా?" అన్నది పద్మ.

"నో! నేను ఆయన గదిలోనే దాక్కోవాలి ఆ పాణి గాడు తిన్నగా ఆయాన గదిలోకే వెడతాడు!" అని అటూ ఇటూ చూచుకుంటూ బసవరాజు గారి గదిలోకి దూరిపోయేడు వేణు! క్షణం తర్వాత పాణి హాల్లోకి అడుగు పెట్టేడు.

"గుడ్ మార్నింగ్ ఎవ్విరిబడీ! బాస్?" అడిగేడు పాణి.

"ఆయన గదిలోనే వున్నారు!" అన్నాడు మురళి.

"థ్యాంక్యూ!" అని పేపర్తో పాణి బాస్ గదిలోకి నడిచేడు! ఏదో జరగబోతోందని మిగతా వాళ్లంతా హాల్లోనే వుండిపోయేరు! బసవరాజు గదిలో బాత్ రూం నుంచి బసవరాజు బయటికి వచ్చేడు!

"గుడ్ మార్నింగ్ సార్!" అన్నాడు పాణి!

ఆ గదిలో ఒక బీరువా చాటున నిలబడ్డ వేణు బాసునీ పాణినీ శ్రద్ధగా గమనిస్తున్నాడు! అంతే శ్రద్ధగా వాళ్ల మాటల్ని కూడా వింటున్నాడు! బసవరాజు తన కుర్చీ కూచుంటూ పాణి చేతిలో వున్న పేపర్ని చూస్తూ అడిగాడు.

"ఏం పేపరది?"

"బహార్!"

"బహారా?"

"గుజరాతీ డైలీ పేపర్ సార్! లార్జెస్ట్ సర్కు లేటెడ్ డైలీ ఇన్ గుజరాత్!"

"ఊ చదువు!"

పాణి గుజరాతీ పేపర్లోని ఒక వార్తని గబగబా చదివేశాడు చదివింతర్వాత బసవరాజుని అడిగాడు.

"మీకు అర్థమై వుండదనుకుంటాను సర్!"

"గుజరాతీ భాష కదా! అర్థమవడం అంత ఈజీ కాదు!"

"ఊరుగానీ పేరుగానీ లేకుండా టూకీగా వార్త మాత్రమే చెబ్తాను సార్!"

"ఆ టైపులోనే చెప్పు! బావుంటుంది!"

"తన భర్తని మావగారు అవమానించారనే కోపంతో, ద్వేషంతో, కసితో, ఒక కోడలు పిల్ల కాఫీలో విషం కలిపిమావగారికిచ్చింది!" ఆ వార్తకి తట్టుకోలేక అన్నాడు బసవరాజు.

"ఘోరం! మావగారంటే ఎవరయ్యా?"

"దేవుడు సార్!" దేవుడి కంటే గొప్పవాడు తండ్రి! మావగార్ని తండ్రిగా భావించమన్నారు! ఇది మన తెలుగు సెంటిమెంటు కూడా యించు మించు మన టైపే సార్!"

"అలాంటప్పుడు కాఫీలో విషం కలిపి మావగారికి ఎందుకిస్తుంది?"

"ఇక్కడ తమరు ఆమె భర్తని మరిచిపోయేరు సార్! మావగారి కంటే భర్తే ముఖ్యమైనవాడు! అలాంటి భర్తని మావగారు అవమానించారనే కోపం సర్! ఇది గుజరాతీ సెంటి మెంటు!" ఆ మాట వినేసి వేణు మెల్లిగా ఆ గది నుంచి తప్పించుకుని హాల్లోకి వెళ్ళిపోతున్నాడు!

క్షణం తర్వాత బసవరాజు పాణిని పలకరించేడు "మిస్టర్ పాణీ!"

"అడగండి సార్!"

"దేశం చెడిపోతోంది!"

"ఆహా! ఏదో ఆఫ్ట్రాల్ ప్రశ్న అడుగుతారని అనుకున్నానే గాని ఇంత అద్భుతమైన స్టేట్ మెంట్ సెలవిస్తారని అనుకోలేదు!" బసవరాజు పాణి మాటల్ని పట్టించుకోలేదు.

అంచేత తన ధోరణిలో చెప్పుకు పోతున్నాడు.

"ఎంత గొప్పది మన దేశం! అంత గొప్ప దేశం ఈ స్థాయిలో చెడిపోతున్నందుకు బాధ పడుతున్నాను!"

"నేను కూడా అంతే సార్! గొప్ప వర్రీ అవుతున్నాను సర్!"

"భర్తని ఎంత అవమానిస్తే మాత్రం? మావని చంపుతుందా కోడలు?"

"కలికాలం సార్? ఈ కాలంలో ఎవ్వరూ రూల్స్ పాటించరు! ఇవాళ్టికి నా డ్యూటీ అయిపోయింది సార్? సెలవిప్పిస్తే వెళ్ళొస్తా!"

"ఊ" "తమరు రెస్టు తీసుకోండి!" అని బసవరాజుకి చేతులు జోడించి ఆ గది నుంచి బయటపడుతున్నాడు.

గది నుంచి హాల్లోకి వచ్చిన పాణికి ఇంటి జనాభా యాభై మంది కనిపించేరు. వాళ్ళు తనని వింతగా చూస్తున్నారు. పాణి కీడు శంకించేడు. అంచేత అక్కడ్నుంచి ఎంత త్వరగా నిష్క్రమిస్తే అంత మంచిదనే ఉద్దేశ్యంతో "అర్జంటు మీటింగు! అందుకే రెండు నిమిషాల్లో పూర్తయింది! వస్తానండి! నమస్కారం.

" అని ఆటను అక్కడ్నుంచి పారిపోయేడు! అతను వెళ్లిం తర్వాత వేణు అంటున్నాడు.

"ఆయ్ పిటీ హిమ్!" డాక్టర్ మురళి మంటమీద అన్నాడు.

"నో! అతని మీద జాలిపడొద్దు! పాపం తగులుకుంటుంది. అలాంటి వాడ్ని జాలిపడి విడిచిపెట్టకూడదు. షూట్ చేయాలి!"

"ఎందుకు?"

"ఇంకా ఎందుకని అడుగుతారేమిటండి? మీరేగా చెప్పారు! దిక్కుమాలిన వార్తలు చదివి నాన్న మెదడు పాడు చేయడం అతని హాబీ అని!"

"హాబీ కాదు! అది అతని వృత్తి! కేవలం వార్తలు చదివేందుకు అతన్ని మీ నాన్నగారు అపాయింట్ చేశారు!"

"ఇదేం ఉద్యోగమండీ?"

"పేపరు రీడింగు ఆఫీసరు! పిఆర్వో!"

"ఇప్పుడు తెలిసిందండీ! ఇతను చదివే పాపిష్టి వార్తలతో చెట్టంత నాన్న బెదిరిపోతున్నాడు! ఏ దిక్కుమాలిన వార్తో విని నేను తెచ్చిన స్వీట్సు వద్దంటే వద్దని నన్ను అవమానించేడు!" వేణు డాక్టర్ మురళి భుజం తట్టి అన్నాడు.

"రిలాక్సు! తప్పంతా పాణి మీద నెట్టేయడం పెద్ద తప్పు! ప్రతిరోజూ ఎక్కాలు చదివి వినిపించండి ఏడువేల జీతమిస్తానని మీరు పేపరు ప్రకటన ఇచ్చి చూడండి! మీ ఇంటి ముందు పెద్ద క్యూ చాలా పెద్ద క్యూ వుంటుంది. ఆ క్యూలో మీరెంతో అభిమానించే నేను కూడా వుంటాను!"

"వేణుగారూ?" అన్నాడు డాక్టర్ మురళి నొచ్చుకుంటూ!

"హు! నిరుద్యోగమండీ! దాని పవరు అలాంటిది! నిరుద్యోగం ఎంతటివాడినైన పిచ్చివాడ్ని చేస్తుంది! పెద్ద పెద్ద చదువులు చదివి కూడా ఉద్యోగం దొరకని కారణంగా ఎక్కాలు చదివే ఉద్యోగం నేనేకాదు! ఎవరైనా చేస్తారు! బతుకు తెరువు డాక్టర్! మీలాంటి కోటీశ్వరుల బలహీనతలే మాకు బతుకుమార్గం!" ఇంత చెప్పినా డాక్టర్ మురళి రాజీపడలేకపోయాడు.

అంచేత కఠినంగానే అన్నాడు. "ఆర్గ్యుమెంట్స్ అనవసరం! ఆ పాణికి బుద్ధి చెప్పాల్సిందే!"

"అంతేగదా? ఆ పని నాకు విడిచి పెట్టండి! అంతకంటే ముందు మీ నాన్నగార్ని బాగు చేయాలి? ఇంత పెద్ద దేశంలో ఎక్కడో ఏదో ఘోరం జరిగిందనే వార్తకి స్పందించి అదే ఘోరం తనక్కూడా జరిగే అవకాశముందనే భయంతో ఆత్మీయుల్ని దూరం చేసుకునే పెద్ద మనిషిని ఎట్లా బాగుచేయాలి? ఈ పాయింటు ఆలోచించండి! ఇదే ఆలోచించండి!" జానకి కలగజేసుకుంది.

"ఆపాటి ఆలోచనలు మాకు రావు నాయనా! చచ్చి నీ కడుపున పుడతా ఆ పనేదో నీ చేతుల మీదగానే జరిపించి పుణ్యం కట్టుకో!"

"అవును వేణుగారూ! మా ఇంటిల్లిపాది కోరిక కూడా అదే!" అన్నాడు డాక్టర్ మురళి అంతలో పద్మ కాఫీ కప్పుతో రంగ ప్రవేశం చేసింది.

"ఆ కాఫీ నాన్నకేగా?" పద్మ తల ఊపింది.

"గదిలో వున్నాడు వెళ్లు!"

"భయంగా వుంది!" అన్నది పద్మ.

వేణు సర్ది చెప్పాడు

"జరగబోయే సీను మాతో పాటు మీక్కూడా తెలుసుగదా? భయమెందుకు మేడం? ప్లీజ్ వెళ్లండి!" ఆమె అన్యమనస్కంగానే మావగారి గదిలోకి కాఫీ తీసుకెళ్లింది! జరగబోయే రాద్దాంతం కళ్లారా చూసేందుకు జానకీ, ఉమ, డాక్టర్ మురళి, వేణులు కిటికీల దగ్గర నిలబడ్డారు. బసవరాజు గదిలో పద్మని చూస్తూ అన్నాడు బసవరాజు.

"కాఫీ తెచ్చావా అమ్మా! మంచిది! నీ చేత్తో యిచ్చిన కాఫీనే తాగుతానని ప్రామిస్ చేశాను గదా! ఇలాగివ్వు" మావగారు మాలూలుగానే మాటాడుతున్నందుకు పద్మ ఆశ్చర్యపోయింది.

కాఫీ కప్పు మామగారికిచ్చింది. అడిగి మరీ కాఫీ కప్పు తీసుకున్నందుకు కిటికీల దగ్గర నిలబడ్డ జనాభా కూడా ఒకరి మొహాలొకరుచూసుకుంటున్నారు. బసవరాజు కోడల్తో అంటున్నాడు.

"నువ్వెళ్లమ్మా! నేను తాగుతాలే!" ఆ హామీకి అసలైన అర్థం తెలీక అయోమయంగానే ఆ గది నుంచి బయటకు వచ్చేసింది పద్మ.

ఆమె వెళ్లాక ఆమె ఇచ్చిన కాఫీని బేసిన్లో పోసి నీళ్లు వదుల్తున్నాడు బసవరాజు! ఆ దృశ్యాన్ని కిటికీల ద్వారా చూసిన జనాభా విషాదంగా నిట్టూర్పులు విడుస్తున్నారు.

(ఇంకావుంది)

(హాసం వారి సౌజన్యంతో)