Antera Bamardee 26

 

This story is a courtesy of Padma Bhushan Varaprasad Reddy

 

26 భాగం 

"అంటే ఏమిటే నీ ఉద్దేశం? ఆ చెప్పు దెబ్బలు నేను తిని వుంటే ఆనందంగా వుండేదా నీకు? ఇప్పుడు తింటున్నాను గదా? ఆనందించు. బాగా ఆనందించు! ఎంత వద్దని వారించినా నీ తమ్ముడు - నా విరోధి కంపెనీలు కంపెనీలో చేరిపోయేడు! నా విరోధి - నాతో సంప్రదించకుండానే నీ తమ్ముడ్ని తన గుప్పెట్లో పట్టేసుకున్నాడు!

దొంగ రాస్కెల్ - ఆ బసివిగాడు అంతేనే! చిన్నప్పుడు - ఎలిమెంటరీ స్కూల్లో నా పలకా బలపం లాక్కునేవాడు! హైస్కూల్లో నోట్సులన్నీ లాక్కునేవాడు. కాలేజీలో రికార్డు పుస్తకాలు లాక్కునేవాడు ఇప్పుడు జీవితంలో నా బామ్మర్దిని లాగేసుకున్నాడు!" అలా అంటూనే రంగనాధం వీధిలోకి అడుగు పెడుతుండగా - అన్నపూర్ణ అడిగింది "అటెక్కడికీ?"

"అడక్కు! నాకు మిగిలింది శూన్యమేగా! ఆ శూన్యంలోకే దూసుకుపోతా!" అని పెద్ద పెద్ద అంగల్తో ఇంటినుంచి బయటపడ్డాడు.

అన్నపూర్ణమ్మ వంట గదిలోకి వెడుతోంది!

రంగనాధం వీధిలో అడుగుపెట్టగానే - కృష్ణమూర్తి కనిపించలేడు. ఆటను ఒక బడ్డీ కొట్టు దగ్గర నిలబడి సిగరెట్లు కొనుక్కుంటున్నాడు! కృష్ణమూర్తి రంగనాధాన్ని చూడగానే - సిగరెట్లు కొనుక్కోవడం మానుకుని గబగబా వెళ్ళిపోతున్నాడు. రంగనాధం కృష్ణమూర్తిని విడిచి పెట్టలేదు! ముందు కృష్ణమూర్తీ వెనగ్గా రంగనాధం నడుస్తున్నారు.

ఆ నడకలోనే రంగనాధం మాటాడుతున్నాడు - "చూచి కూడా వెళ్లిపోతావే? పలకరిస్తే పాపమవుతుందా?"

నడుస్తూనే కృష్ణమూర్తి అంటున్నాడు - "ఈ మధ్య మీ ధోరణి అదోరకంగా వుందండి. రంగనాధం గారూ! పలకరిస్తే ఏం గొడవ అవుతుందోనన్న భయంతో వెళ్లిపోతున్నా!"

"అంతేలే! మమ్మల్ని పలకరించిన మనుషుల్ని కరవడం మా హాబీ!"

"విడిచిపెట్టండి బాబు! అసలే వర్రీసులో వున్నాను!"

"మీకెందుకుంటాయి వర్రీసూ? సకల వర్రీసు మాకే వుంటాయి! సమస్తమైన బాధలూ మాకే వుంటాయి! మా నాన్నకి పక్షవాతం! మా అమ్మకి క్షయరోగం! మా ఆవిడకి ఉబ్బసం! నాకు చెప్పక్కర్లేదు - మతి చలించింది!" ఆ లిస్టు ఎంతవరకు సాగేదో గాని - కృష్ణమూర్తి రోడ్డు మీద వెడుతున్న ఆటోలో ఒక్క గెంతు గెంతి కూచున్నాడు!

అతను కూచున్న ఆటో వేగం పెంచుకుంది! కృష్ణమూర్తి ఆటోలో పారిపోయి నందుకు రంగనాధానికి కోపం వచ్చింది. తాను కూడా ఆటో ఎక్కి వెంబడించాలనుకున్నాడు. అంచేత అతను ఆటోకోసం వెతుకుతుండగా - సిగ్నల్ ఇవ్వని కారణంగా బసవరాజు కారు రోడ్డుమీద ఆగివుండటం చూసేడు! సిగ్నలిస్తే ఆ కారు తన ముందునుంచే వెళ్లాలి!

ఈ పాయింటు తట్టగానే రంగనాధం నేలమీద వెతుకుతున్నాడు. రాయి కనిపించింది. తీసుకున్నాడు! కానీ ఆ రాయి చాలా చిన్నది! దాంతో పని జరగదని ఊహించి ఆ రాయి పారేసి పెద్ద సైజు రాయి కోసం వెతికేడు! ఆ పక్కనే వుంది - కొబ్బరికాయంత రాయి! ఆ రాయి తీసుకొని చాటుగా నిలబడ్డాడు! సిగ్నల్ పడింది! బసవరాజు కారు తనవైపే వస్తోంది!

* * *

బసవరాజు ఆఫీసు! ఒక ఫైలు తీసుకుని వేణు బసవరాజు గదిలోకి వెళ్లేడు.

బసవరాజుని చూచి షాకు తిన్నాడు! బసవరాజు తలకి కట్టు కట్టబడి ఉంది! ఆ బేండేజి వైపు వేణు ఆందోళనగా చూసేడు! వివరాలడుగుదామనుకున్నాడు!

కానీ - బసవరాజు - "కూచో" అన్నాడు. వేణు కూచుంటూ అడిగేడు -

"అంత పెద్ద దెబ్బ ఎట్లా తగిలింది సార?" "ఆఫీసుకి వస్తుంటే ఎవడో రౌడి వెధవ రాయిచ్చుక్కొట్టేడు!"

"కార్లో వచ్చేరుగా?"

"వాడి కసికి కారొక లెక్కా? వాడు విసిరిన రాయి అద్దం పగలకొట్టడమే గాకుండా - తలక్కూడా పంక్చరు వేసింది!"

" మీ మీద ఎవరికుంటుందండీ - అంత కోపం?"

"కోపమొక్కటే కాదు! కొండంత కక్ష కూడా వుంది!"

"రౌడీ వెధవల్నీ ఎందుకు ఏమిటని అడగలేం గదా? కారణాలు లేకుండానే కక్ష పెంచుకుంటారు! గురి తప్పుతుందని తెలిసినా - పెద్దపెద్ద రాళ్ళు విసుర్తారు! కార్లో కడప వెళ్లి సురక్షితంగా తిరిగి వచ్చేనయ్యా! సొంత ఊళ్లో అడుగుపెట్టి - ఇదిగో ఈ దిక్కు మాలిన దెబ్బ తేనేసేనే! సప్త సముద్రాలూ సునాయసంగా దాటి - ఇంటి ముందు మురికి గుంటలో పడమంటే - ఇదే!"

"పోలీసు కంప్లయింటిస్తే బావుండేదేమో!"

'కంప్లయింటిచ్చి - మన కళ్లను మనమే పొడుచుకోమంటావా?"

ఆ మాట అర్థం గాని వేణు ఆశ్చర్యంగా అడిగేడు "రౌడీ వెధవల మీద మీకంత జాలెందుకండీ?"

"ఆ రౌడీ వెధవ నాకు ఫ్రెండు!" ఆ మాట వినగానే వేణు అదిరిపడ్డాడు. అందువల్ల బోలెడు ఆశ్చర్యంగా అడిగేడు

"ఫ్రెండా? మీ ఫ్రెండ్సులో రౌడీలు కూడా వున్నారా సార్?"

"ఎందుకడుగుతావులే! చెప్పుకుంటే సిగ్గుచేటు! ఇంతకీ ఆ రౌడీరాస్కెల్ ఎవరనుకుంటావ్?" వేణు ఎంతో కుతూహలంగా అడిగేడు -

"ఎవరు సార్?"

"మీ బావ!" వేణు గొప్ప షాకు తిన్నాడు!

ఆ షాకుతోనే అడిగేడు - "మా బావ...మిమ్మల్ని...ఇంత గట్టిగా కొట్టడమా?"

"చెట్టు చాటుగా రాయి విసిరితే - ఎవరికీ కనిపించననుకున్నాడు తెలివితక్కువ దద్దమ్మ! నాకు సుబ్బరంగా కనిపించేడు!"

కనిపించేడు గదా! కారు ఆపి కారణం అడగలేకపోయారా?"

"ప్రత్యేకించి అడగడం దేనికి? నాకు తెలీకపోతే గదా? వాడ్ని సంప్రదించకుండా - నీకు ఉద్యోగామిచ్చేనని ఉడుకుబోత్తనం! మనిషి ఎదిగేడేగాని - మెదడు ఎదగలేదు! ఊ...వాడి విషయం విడిచిపెట్టు! ఇది కడప ఫైలు! కడపలో మన ప్రొడక్టుకి డిమాండు బాగా పెరిగింది! వివరాలు స్టడీ చెయ్యి!" అని ఫైలు వేణు చేతికిచ్చేడు! సరిగ్గా అప్పుడే ఫోన్ మోగింది!

బసవరాజు ఫోన్ తీసుకున్నాడు "హాల్లో బసవరాజు హియర్! ఎవరు మాటాడేది?" అవతల్నుంచి రంగనాధం గొంతు మార్చి అంటున్నాడు-

"నేను -"

"నేనంటే?"

"అబ్దుల్ రెహమాన్!"

"అబ్దుల్ రెహమానా!"

"దెబ్బ తగిలిందట కదా?"

"రాయిచ్చుక్కొడితే తగలదా?"

"బాగా తగిలిందా?"

"వచ్చి చూడచ్చు గా?"

"బిజీగా వున్నాను! సాయంత్రం ప్రోగ్రాం పెట్టుకున్నాను!"

" మళ్లా సాయంత్రం కూడానా? అసలింతకీ మీరు - "

"చెప్పేగదా! అబ్దుల్ రెహమాన్!"

"అది ఫేక్ నేమని తెలుస్తూనే వుంది! ఆకాశరామన్న పేరుతో దాక్కోవద్దు! దమ్ములుంటే అసలు పేరు చెప్పు!"

"చెప్పను!"

"ఒరే నీ అసలు పేరు నేను చెప్పగలనురా! కొట్టాలనుకున్నప్పుడు - ధైర్యంగా - ఎదటపడి ఫైటింగుకి దిగాలి! చెట్టు చాటేందుకురా చవట! వద్దు! నువ్వు నాతో మాటాడొద్దు! ఫోన్ పెట్టేయ్!" అని బసవరాజు ఫోన్ పెట్టేశాడు.

తాపీగా కట్టు సవరించుకుంటో వేణుతో అన్నాడు - "విన్నావుగా? మీ బావ!"

"అబ్దుల్ రెహమాన్ - "

"అని పేరెట్టుకుని సాయంత్రం మళ్లా రాళ్ళు విసుర్తానని వార్నింగిస్తున్నాడు! వార్నింగు! ఊ సర్లే! ఆ అబ్దుల్ గాడి గురించి ఆలోచిస్తూ మనసు పాడుచేసుకోవద్దు! కడప ఫైలు శ్రద్ధగా స్టడీ చెయ్యి! వెళ్లు!"

"వేణు - కడప ఫైలుతో - మెదడంతా బావ తాలూకు అఘాయిత్యం గురించిన ఆలోచనలతో - ఆ గది నుంచి బయటపడుతున్నాడు! గది బయట - హడావుడిగా వస్తున్న పాణి - వేణుకి డేష్ యిచ్చేడు! అతని చేతిలో వున్న దినపత్రిక కిందపడింది!

వేణు - ఆ పేపర్ని తీసి పాణికిస్తూ అన్నాడు - "అస్సామీ పేపరు కాబోలు!"

పేపరు తీసుకుంటో అన్నాడు పాణి - "యస్! అస్సామీ పేపరే! బాగా కనిపెట్టేరు!"

"బసవరాజు గారికి అస్సామీ కూడా వచ్చా?"

"నో! నో! వారికి ఆ భాషతో టచ్ లేదు! నాకుంది!"

"అయ్ సీ!"

"బాస్ తో అర్జంటు విషయం మాటాడాలి!" అని పాణి గబగబా బసవరాజు గదిలోకి వెళ్లిపోయేడు అతను వెళ్లిన వైపు చూస్తూ ఆలోచనల్లో పడ్డాడు వేణు!

* * *

రంగనాధం ఇల్లు. రంగనాధం ప్రశాంతంగా వున్నందుకు - రంగనాధం బుద్ధిగా ఉప్మా తింటున్నందుకూ - అన్నపూర్ణమ్మ ఎంతో ఆనందించింది ఆనందంగానే అన్నది - "వేణు ఫోన్ చేసేడు!"

"ఏమన్నాడు? ఉద్యోగమదీ బావుందన్నాడా?" భర్త ఎంతో నార్మల్ గా మాతాడుతున్నందుకు సంతోషిస్తూ -

మరింత ఉప్మా వడ్డిస్తూ అన్నది అన్నపూర్ణమ్మ - "వాడికేమండీ? అన్నీ వాడికి అనుకూలంగానే వుంటాయి! వాడి కుడి భుజమ్మీద కుంకుడు గింజంత పుట్టుమచ్చ వుంది!"

రంగనాధం ప్రశాంతంగానే ప్రశ్నించేడు "ఉద్యోగం గురించి అడిగితే - పుట్టుమచ్చల గురించి చేబుతావేమిటి అర్థం లేకుండానూ?"

"ఆ పుట్టుమచ్చ అక్కడే అందరికీ వుంటుందా ఏమిటి? కుడి భుజమ్మీద పుట్టుమచ్చ వుంటే - కుభేరుడవుతాడని శాస్త్రమండీ!"

అప్పుడు రంగానాధానికి కోపమొచ్చింది! "నీ శాస్త్రం తగలెయ్య!" అంటూ ఉప్మా ప్లేటుని గాల్లోకి విసిరేసి అంటున్నాడు -

"పుట్టుమచ్చలు చూసుకొని తృప్తిపడే జాతే మీది! కుడి భుజమ్మీద పుట్టుమచ్చ వుంటే కుభేరుడవుతాడనీ - ఎడం భుజమ్మీద వుంటే వెర్రి వెధవవుతాడనీ పిచ్చి పిచ్చి సూత్రాలు చెప్పేవంటే చెప్పుచ్చుక్కొడతా!"

"అదికాదండీ!"

"నోర్ముయ్! మూసెయ్ నోరు! నేనడిగిందేమిటి? ఉద్యోగం ఎట్లా అఘోరించిందో చెప్పేడా అని అడిగేను! అవునా? బాగుందని వాడంటే - బాగుందన్నాడని చెప్పు! ఎడ్చినట్టుందని అంటే - ఏడుస్తున్నాడని చెప్పు! కుంకుడుగింజంత మచ్చ - దబ్బకాయంత దెబ్బ - నీదేవసం - ఇవన్నీ ఎవడడిగేడు?" అతని మాటలకి అడ్డం పడే ప్రయత్నం చేసింది అన్నపూర్ణమ్మ.

రంగనాధం ఆమెను మాటాడనివ్వలేదు - "మాటాడకు! నేనడిగిందేమిటి? ఉద్యోగం - ఉద్యోగం బావుందన్నాడా అని అడిగేను! నువ్వు చెప్పాల్సిందేమిటి? వాడు బావుందని అంటే బావుందనీ - బేవర్సుగా వుందని అంటే నీచంగా వుందని - సింపులు - సింపులు వాక్యంతో చెబితే సరిపోయేది

! అది చెప్పకుండా - అక్కడెక్కడో మచ్చ వుంది! ఇక్కడెక్కడో చిన్న పుండుందీ! ఇవన్నీ చెప్పమని ఎవడు అడిగేడు నిన్ను?" "తప్పయిపోయింది! ఎరక్కపోయి ఏదో అన్నానే అనుకోండి! దానికింత రాద్దాంతం చేయాలా?" రాద్ధాంతం అనే మాటకి రంగనాధం వళ్లు మండిపోయింది అటూ ఇటూ వెతికి కంచు గ్లాసు తీసుకున్నాడు దాన్ని పక్క గదిలోకి విసిరేస్తూ రంకెలు పెడుతున్నాడు

"అవునే! నేను రాక్షసముండా కొడుకుని గదా!అంచేత రాద్ధాంతమే చేస్తాను! మీరు జాతకరత్న మిడతం భొట్లు వారసులు గదా? ఎంచక్కా పుట్టుమచ్చల శాస్త్రం క్షుణ్ణంగా చదివేసి - ఆ సబ్జెక్టులో డాక్టరేటు పుచ్చుకున్న పండితులు గదా! ఏ దిక్కుమాలిన మచ్చ ఎక్కడ తగులుకుంటే ఏమవుతుందో వివరించి చెప్పే విదుషీమణులు! పెద్ద మాట వాడేసెను! ఏమైతే అయ్యింది! ఆ మాటే ఖాయం చేసేసుకో! నీ యిష్టమొచ్చిన బిరుదులు తగిలించేసుకో! వాటికి అర్థాలు తెలీకపోయినా - అట్లాగే పిలిపించుకో! నీ సొంత పేరు ఇంటి పేరుతో సహా మరిచిపో! నీ పేరుతో నిన్నెవరైనా పొరపాటున పిలుస్తే అట్లకాడతో వాతలు పెట్టేసుకో!" అని గబగబా వీధిలోకి వెళ్లిపోతున్నాడు!

అతని వాలకం గమనించి భయపడి - మాటాడకుండా బొమ్మలా నిలబడిపోయింది అన్నపూర్ణమ్మ! అక్కడ బసవరాజు ఆఫీసు గదిలో పాణి అస్సామీ పేపర్లో అధ్బుతమైన వార్తని పూర్తిగా చదివేసేడు! అతను చదివినదంతా శ్రద్ధగా విన్నాడు బసవరాజు! అందులో అక్షరం అర్థం గాకపోయినా బసవరాజు ఎంతో ఆనందించేడు!

పాణిని అభినందిస్తూ అన్నాడు "వెరీగుడ్ ! అస్సామీ భాషలో కూడా నీకు అద్భుతమైన ప్రవేశమున్నందుకు ఆనందిస్తున్నాను! ఆ భాషలో కూడా నువ్వు అసాధ్యుడివని తెలిసి నిన్ను అభినందించకుండా వుండలేకపోతున్నాను!"

"థ్యాంక్యూ సార్!" "అన్నాడు పాణి - ఆనందంతో మెలికలు తిరిగిపోతూ! "ఇప్పుడు ఆ వార్త యొక్క పూర్తి వివరాలు తెలుగులో చెప్పు!" అన్నాడు బసవరాజు. పాణి తెలుగులో చెప్పేందుకు సిద్ధపడగా - బసవరాజు అడ్డం పడ్డాడు "ఊరు పేరు వద్దు! విషయం చెప్పు!" పాణి చెప్పడం ప్రారంభించేడు -

(ఇంకావుంది)

(హాసం వారి సౌజన్యంతో)