Antera Bamardee 16

 

story is a courtesy of Padma Bhushan Varaprasad Reddy.

*************

 

అంతేరా బామ్మర్దీ - 16

“ఆహా " అనుకున్నాడు ఆనందంగా!

***

బసవరాజు, తన ఆఫీసు గదిలో కిటికీ దగ్గర నిలబడ్డాడు. అక్కడ నిలబడి వీధిలోకి చూస్తూ దీర్ఘంగా ఆలోచనలో మునిగిపోయాడు.

ఆ గదిలోకి అప్పుడే వచ్చిన పాణి, యజమానిని ఆ స్థితిలో చూడగానే షాకు తిన్నాడు. అతని గుండె తరుక్కుపోయింది.

కొంచెం విషాదంగా పలకరించాడు. “ సార్ "అని.

ఆ పిలుపు విన్న బసవరాజు పాణి వైపు నీరసంగా చూసాడు.

“ తమరు అదో మాదిరి వున్నారు సార్!”

“ నేనంతె మిస్టర్ పాణి. నాకు విచారం ఎక్కువయినప్పుడు ఇలాగే వుంటాను.కిటికీలకి అతుక్కుపోతా!” అన్నాడు బసవరాజు కొంచం విచారంగా.

“ చాలా మంచి అలవాటు సార్! విచారానికి కిటికీ సరైన సింబల్ సర్ " అన్నాడు పాణి.

“ మిస్టర్ పాణీ!” కిటికీ వదిలి వస్తూ అన్నాడు బసవరాజు.

“ యస్సర్ " అన్నాడు పాణి.

“ సినిమాలు చూడడం మానేయ్ " అన్నాడు బసవరాజు.

“ ఇంక చూడను సార్!”

“ కిటికీలు ఉన్న సినిమాలు అసలే చూడొద్దు " చెప్పాడు బసవరాజు.

“ ఇకముందు ఆ పని మీదే వుంటాను సార్!”

“ జీవితాలను చూడటం నేర్చుకో " చెప్పాడు బసవరాజు.

“ తప్పకుండా సార్!”

“ అసలు నువ్వు ఆ మాయదారి మలయాళం వార్త చదవకపోతే బావుండేదేమో ?” అన్నాడు బసవరాజు.

“ ఇకముందు ఏ వార్తలు చదవను సార్ "

“ చదవకపోతే నేను జాగ్రత్త పడటం ఎట్లా? అంచేత చదవాలి!” అన్నాడు బసవరాజు.

“ అల్లాగే సార్!” చెప్పాడు పాణి.

“ నేను వద్దన్నా నువ్వు చదవాలి!”

“ తప్పకుండా చదువుతాను సార్!”

“ అది నీ డ్యూటీ " అన్నాడు బసవరాజు.

“ అంతేగదా సార్!”

“ కాకపొతే సింగినాదాన్ని బాధ పెట్టినందుకు చింతగా వుందంతె " చెప్పాడు బసవరాజు.

“ క్వయిట్ నేచురల్ సార్!” అన్నాడు పాణి.

“ సింగినాదం ఎవడనుకున్నావు ?” అన్నాడు బసవరాజు.

“ మీ ఫ్రండు సార్! ప్రాణ మిత్రుడు " చెప్పాడు పాణి.

“ అంతేకాదు మిస్టర్ పాణి! విద్యాదాత కూడా!”

“ మీకు ట్యూషన్లు చెప్పేవాడా సార్ "

“ ఊహూ " తల అడ్డంగా ఊపాడు బసవరాజు.

“ మరి విద్యాదాత అని బిరుదు ఇచ్చారు!”

“ అవును! వాడి లెక్కల పేపరు కాఫీ కొట్టి యసల్సీ పాసయ్యేను " చెప్పాడు బసవరాజు.

“ ఓహో ! అట్లా వచ్చారా ?” అన్నాడు పాణి.

“ అప్పట్లో అట్లాగే వచ్చేవాడిని పాణీ! లెక్కల పేపరు కాఫీ కొట్టడమే కాదు! వాడి చేత లవ్ లెటర్స్ రాయించుకున్నాను! ఆ లెటర్స్ లో మహత్తరమైన పోయిట్రీ గుప్పించేవాడు! అది నా సొంత కవిత్వమని మురిసిపోయి జానకి నన్ను పెళ్లి చేసుకుంది " జరిగినది చెప్పాడు బసవరాజు.

“ అహా! ఇది మీ జీవితంలో మరపురాని మధురమైన మలుపుసార్! ఈ రహస్యం మేడమ్ గారికి యింత వరకు తెలీదా సార్?” అంటూ అడిగాడు పాణి.

“ ఇప్పుడేమో గానీ, మా పెళ్ళయిన కొత్త రోజుల్లో తెలిసుంటే విడాకులిచ్చేది "

“ గొప్ప ప్రమాదం తొలిగిపోయింది సార్" అన్నాడు పాణి.

“ జానకితో నా పెళ్లి జరగడం మూలంగానే, అత్తవారి పెట్టుబడితో ఇంత పెద్ద వాడినయ్యాను. ఇప్పుడు చెప్పు మిస్టర్ పాణీ! జానకితో నా పెళ్లి కాకపోతే నేను ఈ స్థితికి ఎదిగి వుండేవాడినా?”

“ డేపనిట్ గా ఎదిగి వుండేవారు కాదు " చెపాడు పాణి.

“ ఏ స్థితిలో వుండేవాడిని ?” అడిగాడు బసవరాజు.

*********************

అప్పుడు పాణి ఏమని సమాధానం చెప్తాడు ?

దానికి బసవరాజు ఎలా రియాక్టు అవుతాడు ?

రంగనాథం అసలు ఇంటికి వెళతాడా లేదా?

ఇంటికి వెళ్లకుంటే మరెక్కడికి వెళ్తాడు ?

అన్నిటికి సమాధానం తరువాయి భాగంలో...

*******************

(ఇంకావుంది)

హాసం సౌజన్యంతో